రాష్ట్రీయం

సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో మారణాయుధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలాసవంతమైన భవంతులు
నేరగాళ్ళతో సంబంధాలు
ఆనంద్‌కుమార్ నివాసంలో ఏసిబి సోదాలు

విశాఖపట్నం, డిసెంబర్ 31: ఆయన ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి. అన్ని మినహాయింపులూ పోను ఆయనకు నెలకు 36 వేల రూపాయల జీతం వస్తుంది. కానీ ఆయన కోట్లాది రూపాయల ఆస్తికి అధిపతి. విలాసవంతమైన జీవితం ఆయన సొంతం. ఇంతేకాదు. నేరగాళ్ళతో పరిచయాలు.. సంబంధాలు.. ఇంట్లో మారణాయుధాలు.. ఇవన్నీ ఒక సబ్ రిజిస్ట్రార్‌కు ఉంటాయంటే నమ్మశక్యమవుతుందా? కానీ నమ్మాల్సిందే.. విశాఖ శివారులో ఉన్న మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలతో ఏసిబి అధికారులు గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దాడుల్లో వెలుగు చూసిన నిజాలు ఇవి. ఆనంద్‌కుమార్‌పై ఎవ్వరూ పోలీసులకు కానీ, ఏసిబి అధికారులకు కానీ ఫిర్యాదు చేయలేరు. ఆయనంటే జనానికి అంత భయం.
ఆయన ఆస్తి కోట్లు దాటిపోతున్న విషయాన్ని తెలుసుకున్న ఏసిబి అధికారులే సుమోటోగా కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. మంగళవారం ఆనంద్‌కుమార్‌కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించగా, ఆయన ఏసిబి చేతిలో నుంచి తప్పించుకున్నాడు. నగరంలోని లాసన్స్‌బే కాలనీలో అత్యంత విలాసవంతమైన ఆయన ఇంటిని ఏసిబి అధికారులు సీజ్ చేశారు. బుధవారం నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఆచూకీ కనిపెట్టారు. లాసన్స్‌బే కాలనీలోని ఆనంద్‌కుమార్ ఇంటిని గురువారం తెరిచారు. ఆనంద్‌కుమార్ నాలుగు అంతస్తుల భవంతిలో నివసిస్తున్నాడు. ఒక్కో అంతస్తు కనీసం కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇంట్లో మినీ థియేటర్, మినీ బార్, ఇంపోర్టెడ్ ఫర్నీచర్, ప్రతి అంతస్తులోనూ స్టీమ్ బాత్ షవర్స్, టబ్ బాత్‌లు ఉన్నాయి. అలాగే వీడియో కాలింగ్ లిఫ్ట్.. తన కోసం వచ్చిన వారు సెల్లార్‌లో ముందు లిఫ్ట్ దగ్గరకు రావాలి. అవసరమైతే, ఆ వ్యక్తులను పైకి రమ్మంటాడు. లేకుంటే అక్కడే మాట్లాడి పంపించేస్తాడు. ఇంటి నిండా సిసి కెమెరాలు. ఈ సిసి కెమెరాలతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఏం జరుగుతున్నదీ ఆనంద్‌కుమార్ తెలుసుకుంటుంటాడు. ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఏసితో ఉంది. ఇక ఆయన ఇంట్లో ఒక ఒరిజినల్ పిస్టల్, ఒక డమీ పిస్టల్ లభించాయి. ఒరిజినల్ పిస్టల్ అత్యంత ఆధునాతనమైనదని ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలియచేశారు. ఆనంద్‌కుమార్ ఇంట్లో 40 బుల్లెట్లు, గొడ్డలి, కొన్ని కత్తులు దొరికాయి. వీటిని బట్టి చూస్తే ఆనంద్‌కుమార్‌ది నేరపూరిత జీవితంగా ఏసిబి అధికారులు భావిస్తున్నారు.
ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామని ఏసిబి అధికారులు చెప్పారు. ఆనంద్‌కుమార్‌పై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లలో కేసులు కూడా ఉన్నాయని ఏసిబి అధికారులు చెప్పారు. ఇంకా ఆనంద్‌కుమార్ ఇంట్లో గురువారం 500 గ్రాముల బంగారం, 60 వేల రూపాయల నగదు లభ్యమైంది. భీమిలిలోని ఆయన ఫాం హౌస్‌లో 1,70,000 రూపాయల విలువైన ఫర్నీచర్ దొరికింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఆనంద్‌కుమార్ బంధువు ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు. ఆయన సామాన్యమైన వ్యక్తి. అయితే ఆయన పేరున ఫార్చ్యూనర్, వెర్నా కార్లు ఉండడం గమనార్హం. మొత్తంమీద ఆనంద్‌కుమార్ ఆదాయానికి మించి రెండు కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నట్టు ఏసిబి అధికారులు లెక్కవేశారు. కానీ వీటి మార్కెట్ విలువ 20 కోట్లకు పైగానే ఉంటుంది. (చిత్రం) సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో పట్టుబడ్డ రివాల్వర్