అక్షర

అద్భుతమైన జ్ఞాపకాల వడపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించి ప్రపంచం ఒక కుగ్రామంగా మారిందని చెప్పుకుంటున్న తరుణం ఇది. ఎంత పురోగతి సాధించిన ఒక వ్యక్తీ జీవన గమనంలో వివిధ ప్రాంతాలతో, విభిన్న సంఘటనలతో పెనవేసుకున్న జ్ఞాపకాలు మధుర ఘట్టాలుగా మిగిలిపోతాయి. ఆ వ్యక్తి తన జ్ఞాపకాలను, అనుభవాలను సార్వజనీనం చేయగల ప్రతిభావంతుడైన రచయిత అయి వాటిని అక్షరబద్ధం చేసినప్పుడు స్థానిక చరిత్రల రచనకు నిస్సందేహంగా అది మహోపకారం చేస్తుంది. తెలంగాణాలోని సమకాలీన సాహిత్య విమర్శకులలో వేళ్ళమీద లెక్కించదగిన ప్రామాణిక పరిశోధకులలో ఒకరైన డాక్టర్ గుమ్మనగారి బాలశ్రీనివాసమూర్తి తన పాతికేళ్ళ జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసి అందించిన మా ప్రసిద్ధిపేట అన్న పుస్తకం ఈ కోవలోకే వస్తుంది. ఒక ప్రాంతంతో పెనవేసుకున్న అనుభవాలు, అనుభూతులను పుస్తకరూపంలో సమకూర్చడం అంటే అది జ్ఞాపకాల కలబోతలా కాకుండా వడపోతలా ఉండాలి. ఇది పరిశోధక గ్రంథంలానో, విమర్శనాత్మక వ్యాసంలోనో కాకుండా రమణీయమైన శైలితో ముంగిటవేసిన ముగ్గులా ఉండాలి. ఈ విషయంలో మా ప్రసిద్ధిపేట రచయిత సంపూర్ణ విజయం సాధించారనే చెప్పాలి.రెండు పర్యాయాలు ఉవ్వెత్తున లేచిన తెలంగాణా ఉద్యమానికి జన్మనిచ్చిన ప్రాంతం సిద్ధిపేట సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో విలక్షణతను సంతరించుకున్న పట్టణం ఇది. తెలంగాణా ఉద్యమం రధసారధి ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇక్కడివాడే కావడంవల్ల సిద్ధిపేట అంటే అందరికీ సహజంగానే ఆసక్తి కలుగుతుంది. వేముగంటి నరసింహాచార్యులు, కనపర్తి రామచంద్రాచార్యులు వంటి నిన్నమొన్నటి కవులు మొదలుకుని నందిని సిద్ధారెడ్డి, రామగిరి శివకుమార్ వంటి ఆధునిక కవులకు, గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ, అష్టకాల నరసింహరామశర్మ వంటి అవధానులకు, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ మొదలైన కవి గాయకులకు నెలవైన చోటిది. విశ్వవిఖ్యాత చిత్రకారులు కాపు రాజయ్య, పేరిణి నాట్యాచార్యులు రమేష్, బాతిక్ బాలయ్య, కవి రచయిత అధికారిగా పేరొందిన రమణాచారి మొదలైన కళాకారులు ఇక్కడివారే. ఆయా విశిష్టవ్యక్తులతో తనకుగల పరిచయాన్ని, ఆ ప్రాంతానికిగల అనుబంధాన్ని అక్షరబద్ధం చేయడంలో రచయిత రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించడం ప్రశంసనీయం.
పుస్తక రచనా ప్రణాళికలో ఏడు అధ్యాయాలుగా విభజించుకున్న రచయిత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో తన అనుబంధానికీ, సాహిత్య రంగంతో ఉన్న బాంధవ్యానికి పెద్దపీట వేశారు. ఆనాటినుండి ఈనాటివరకు తెలంగాణా ప్రాంతంలో విద్యాసుగంధాలను అందించడంలో అగ్రశ్రేణిలో నిలుస్తున్న సిద్ధిపేట కళాశాలతో రచయితకు ముడిపడి ఉన్న జ్ఞాపకాల ఆ కళాశాల విద్యార్థులందరికీ తమ అనుభూతులను నెమరువేసుకునే అవకాశం కలిగించేవే. నిజాం పాలననుండి విముక్తమై హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక జిల్లాలలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేస్తున్న క్రమంలో జిల్లా కేంద్రం కాకపోయినా సిద్ధిపేటలో కళాశాల ఏర్పాటైంది.అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు సన్నిహితులు సిద్ధిపేటకు చెందిన పి.వి.రాజేశ్వర్‌రావు తనకు మంత్రి పదవి వద్దని తన ప్రాంత ప్రజలు బాగుపడాలంటే డిగ్రీ కళాశాల కావాలని పట్టుబట్టి సాధించారట. ఇవాళ సిద్ధిపేట ప్రాంతం చైతన్య కేంద్రం కావడానికి తొలినాళ్ళలోనే ఇక్కడ కళాశాల ఏర్పాటుకావడమే కారణం. చుక్కారామయ్య, పరాశరం గోపాలకృష్ణమూర్తి, ముదిగొండ వీరభద్రయ్య వంటి ఉద్దండులు పనిచేసిన కశాళాలలో చదివిన బాల శ్రీనివాసమూర్తి రచన ఆనాటి అధ్యాపకుల అంకితభావానికి, విద్యార్థులలో జ్ఞానతృష్ణ పెంచి పోషించిన తీరు కచ్చితంగా నేటితరానికే కాదు భావితరాలకూ స్ఫూర్తినందించే విధంగా ఉంది. నాటి కళాశాల సాహిత్య, సాంస్కృతిక వాతావరణం దేశపతి, రసమయి, ఎస్.ప్రభాకర్ వంటి విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దిన వైనం సముచిత రీతిలో అందించడం ప్రశంసనీయం.
సిద్ధిపేట ప్రాంతంలో రచయిత జ్ఞాపకాలు పెనవేసుకున్న మరొక ముఖ్య రంగం సాహిత్యం. పెద్దగా పేరుప్రఖ్యాతులు లేకుండా అజ్ఞాతంగా ఉండిపోయిన బెల్లోజు రమణాచారి, గడ్డం రామదాసుల ప్రస్తావన, యక్షగాన నిర్మాణంలో వీరు చూపిన ప్రతిభను పేర్కొనడం ఆ రంగంలో పరిశోధన చేయాలనుకునే వారికి దారిచూపడమే. వీరితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి విద్యార్థి దశలోనే అందించిన కవిత సంధ్యావంధ్య వంటి అంశాలు గుర్తుచేసుకున్నారు. జాతీయ సాహిత్య పరిషత్తు, మంజీరా రచయితల సంఘం వంటి సాహిత్య సంస్థల సేవలను, రేకా అబ్బయ్య వంటి సంపన్నుల షష్టిపూర్తి వేడుకల్లో సాహిత్యకార్యక్రమాల వివరాలను రేఖామాత్రంగా స్పృశించడం అక్కడి సాహిత్య వాతావరణాన్ని వివరించడానికి దోహదపడ్డాయి. తమ అనుభవాలు అనుభూతులను అక్షరబద్ధం చేయగల ప్రతి రచయితా బాలశ్రీనిసాసమూర్తిలా పుస్తకరూపంలో తేగలిగితే భవిష్యత్తులో స్థానిక చరిత్రల రచనకు ప్రధాన ఆకారాలను అందించిన వారవుతారు.

-చెప్పెల హరినాథశర్మ