అక్షర

పిచ్చి వ్యామోహులకు హెచ్చరిక కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుందర సుందరీయము’- పద్య కావ్యం;
-కలువకొలను సూర్యనారాయణ;
పుటలు: 100; వెల: 100 రూ.;
ప్రాప్తిస్థానం: రచయత,
ఫ్లాట్ నం.202, మోహన్ రెసిడెన్సీ,
శ్యామలానగర్ 2వ లైను,
గుంటూరు- 522006

--
అరిషడ్వర్గాలలోని కామమోహాల జంటకు ప్రేమ అనే ఉదాత్త భావార్థక పద ఆచ్ఛాదనతో తమను, తమ తల్లిదండ్రులను, బంధుమిత్రులను ఏదో బయటపడలేని భ్రమావంతులనుగా చేసుకొని నేడు చాలామంది యువతీయువకులు ఒక పిచ్చి వ్యామోహపు ఊహల్లో తేలిపోతూ లవ్ మ్యారేజ్‌లంటూ క్రేజీగా క్రేవ్ (్ళ్గఉ) అవుతూ, వెనకాముందూ చూసుకోకుండా దంపతులైపోతూ, చివరకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న అవస్థకు చేరుకొని తమతమ జీవితాలను విషాద పూరితాలుగా చేసుకుంటున్నారు. ఇలాంటి ఒక బాధ, ఒక ఆందోళన, ఒక హెచ్చరిక అనే మూడు భావ వ్యక్తీకరణలతో కలువకొలను సూర్యనారాయణగారు రాసిన ఒక సరళ సుందర కథాకావ్యం ‘సుందర సుందరీయము’. ఇది పది కిరణాలు (కథాఘట్టాలు)గా మూడువందల పైచిలుకు పద్యాలతో సాగిపోయిన ఒక సామాజిక సమస్యా దృగ్రచన.
సుందరీ, సుందరశాస్త్రులు భిన్న కులస్థులు. ఒకరినొకరు ఆకర్షితులు తమతమ తల్లిదండ్రులకు తెలియకుండా పెండ్లి చేసుకుంటారు. పెళ్ళైన కొన్నాళ్ళలోనే ఇద్దరూ వివిధ వస్తురూప సుఖ సౌకర్యాల మోజులో పడిపోతారు. సుందరశాస్ర్తీ అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆ స్థితిలో సుందరి ధనహీనుడైపోయిన సుందరశాస్ర్తీని వదిలేసి వెళ్ళిపోయి తన దారేదో తాను చూసుకుంటుంది. స్థూలంగా ఇదీ కథ.
‘‘తెలియన్ జాలక యుక్తియుక్తముగ నుద్దీపించు ప్రాయమ్మునన్
పొలతుల్ పూరుషులున్ హృదంతరములన్ పొంగారు మోహంబెదో
బరిదంబై తనరారు ప్రేమయెదొ యావంతైన మోహమ్మునే
వలపంచెంచి యుపద్రవాలబడుచున్ వాపోవుటల్ జూడమే?!’’
- ఈ కావ్యం మొత్తానికి వస్త్ధ్వునిపూర్వక పరోక్ష సందేశాత్మక ప్రధాన పద్యం ఇది.
కావ్య సౌందర్యానికి కావలసిన కొన్ని అలంకారాలు, భావ సౌందర్యాలు, భాషా నైసర్గికతలు ఇందులో చాలా ఉన్నాయి.
కథానాయిక (సుందరి) తన ప్రియుడైన సుందరశాస్ర్తీని కలుసుకోవటానికి వీలులేకుండా ఆమె తలిదండ్రులు కట్టడిచేశారు; ఆంక్షలు పెట్టారు. కుకవి అయిన వాడికి పద్యకవిత్వ రచనలో ప్రాస నిబంధన ఎంతో గడ్డు సమస్య అయినట్టుగా ఉందిట సుందరికి తన తలిదండ్రుల నియంత్రణ. ఇక్కడ ‘కుకవి’అనే ఉపమానం తీసుకురావటంలో చక్కని వివక్షితాన్య పరవాచ్య అలంకార ధ్వని, గాంభీర్యాలు అందగించాయి. కుకవి కవిత్వం ఎలా ఆచరీణీయంకాదో ఆ కన్య చేసే చాటుమాటు ప్రేమకలాపం కూడా అలాగే సమర్ధనీయం కాదు అని చెప్పటంలోని శిల్పం బాగుంది.
తల్లిదండ్రుల నిఘాను తప్పించుకొని బయటకుపోలేక విసిగి విసిగి తన జడను ఒక్క విసురుగా వెనక్కువేసుకొని పక్కపై వాలిందట సుందరి. అలా పడుకొని నిద్రా వరివస్య అయిందట. ‘వరివస్య’అంటే సేవిక, ఉపాసిని అని అర్థాలు. ఇక చేసేదేమీలేక నిద్రాదేవతోపాసనలో మునిగిపోయింది; నిద్రకు దాసి అయిపోయింది అనటం చాలా సమయోచితంగాను, సందర్భ శుద్ధిమంతంగాను ఉంది. ప్రసిద్ధ అలంకార శాస్తవ్రేత్త అయిన వామనుడు ప్రతిపాదించిన ‘రీతిరాత్మా కావ్యస్య’అనే సిద్ధాంత సూత్రానికి చక్కగా సరిపోతుంది ఇది. ‘రీతి’అంటే సందర్భశుద్ధి సహిత సమయోచిత పదపు పోహళింపు.
ఇలాగే 3వ కిరణం (ఘట్టం)లో ‘‘ఎన్నడు కాంతుఁగాంతు?’’అంటూ కథానాయిక దిగులుపడ్డది అని రాసిన దాంట్లోని ‘కాంతుడు’అనే బహుళార్థ పద సమర్థతగూడా రమ్యంగా ఉంది. ఎందుకంటే కాంతుడు అంటే ప్రియుడు, చంద్రుడు, చక్కనివాడు, ఒప్పిదమైనవాడు, మగడు అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలన్నీ సరిపోతాయి అక్కడ.
కథానాయకుడైన సుందరశాస్ర్తీకి తన ప్రేయసిని పెండ్లాడటానికై తాను చేసిన ఆలోచనల్లో వేగిపోగా వేగిపోగా ఒక ఉపాయం తట్టింది. తాను మరుల మంటలలో తపించిపోతుంటే అప్పటికప్పుడు ముంచుకొచ్చిపడిన ఒక భారీ వర్షమేమో అన్నట్టుగా ఉందిట. ఆ తట్టిన ఉపాయం. ఇక్కడి వస్తూత్ప్రేక్షాలంకారం ఆహ్లాదకరం.
నాయికానాయకులు తిరుపతి పర్వత సానువులలో విహరిస్తున్నారు. కొండల్లోని నడకదారి ఎన్నో మెలికలు తిరుగుతూ ‘‘బ్రతుకుబాట పూర్తిగా పూల బాటకాదు. తఱచుగా వక్రతకు లోనవుతూనే ఉంటుంది. పరాకుగా ఉంటే పతనంగూడా తప్పదు అని చెప్తోంది మనకు’’అనటంలో భ్రాంతి మదలంకారం ఉంది. ఇలాంటి కవితావస్తువులు ఈ పుస్తకంలో ఎడనెడ పాఠకుడికి రసానందాన్ని ఇస్తూనే ఉంటాయి.
‘‘పరోపకారమే అర్థము జీవితానికి అని, అర్థముకాదని చాటి చెప్పెడిన్’’ లాంటిచోట్ల కనిపించే యమకాది శబ్దాలంకారాలు బాగున్నాయి. ఇక్కడ అర్థము అంటే ప్రయోజనము (పరమార్థము) అని, ధనము అని వేఱువేఱు అర్థాలు అన్వయించుకోవాలి. ఇదీ ఈ అలంకార చమత్కారం.
ఇందులోని ‘ప్రాసగు విత్తువంటి నెరపారు కులంబున బుట్టినావు’వంటి కొన్ని వాక్యాలనుబట్టి రచయిత సూర్యనారాయణగారికి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యం వంటి కొన్ని ప్రబంధాల పఠనానుభవం కూడా మెండుగా ఉన్నదని తెలుస్తోంది.
బూచుల యెకిమీడు (శివుడు), ఎకాయెకి (నేరుగా), దందడ పెట్టు (ఒరయు, బాధించు) మొదలైన తెలుగు పలుకుల జిలుగు, కొన్ని తెలుగు సామెతల సంస్కృతికరింపు, ‘వినేవాళ్ళుంటే వేలకువేల నీతులు చెప్తారు’వంటి లలిత హాస్యోక్తులు, ‘పొరుగింటి పేరంటానికి పోదామంటే నా బ్రతుకుకు అదొక్కటే తక్కువ’లాంటి కుపిత, క్షుభిత వనితల వక్రోక్తుల సహజతా సౌందర్యం (ఉద్యోగపర్వ ద్రౌపది సంభాషణలు గుర్తువచ్చేటట్టుగా)- ఇలాంటి రచనాశిల్ప లక్షణాలు కొన్ని కొన్నిచోట్ల మిలమిలా మెఱిశాయి.
47వ పుటలో ‘బద్ధకమున నటులయుంట వర్జితమమ్మా’అంటూ ప్రయోగించిన భౌతకాలిక క్రియారూపం సముచితంకాదు. వర్జ్యమె అమ్మా! (విడువవలసిన పద్ధతి) అని ఉండాలి.
60వ పుటలోని 25వ పద్య ప్రారంభంలో ‘ప్రాంగణ ప్రాంతమున్’ అన్నచోట సంస్కృత సమాస ఉచ్చారణా ధారళతా ధర్మం దృష్ట్యా గణభంగం అనిపించే ప్రమాదం ఉంది.
15వ పుటలోని 10వ పద్యం మొదట్లో ‘పాదునొనర్చి కోరియనువౌయొక...’అంటూ యడాగమం చేయకూడదు కదా! అనువౌనొక అంటూ ద్రుత, ఉకార సంధులే చేయాలి. ‘ఉ దంత తద్ధార్మార్థక ధాతుజ విశేషణమున కచ్చు పరంబగునపుడు నుగాగమంబగు’అని లక్షణం.
ఇక ఉకార సంధి నిత్యత అయితే కొన్నిచోట్ల నిర్లక్ష్యానికి గుఱి అయింది. కానీ ఈ చిన్న దోషం రాకుండా చూసుకోవటం సాధ్యమయ్యేదే కలువకొలనువారు కొంచెం దృష్టిపెట్టి ఉంటే.
ఏదిఏమైనా ఆలోచనాత్మకత, సమాజ శ్రేయోకాంక్షాపూర్వక సందేశాత్మకతలు ఉన్న ఒక పఠనీయకావ్యం ఈ సుందర సుందరీయం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం