అక్షర

వైద్యులకు వైద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిగ్మండ్ ఫ్రాయిడ్
జీవితం- కృషి
డాక్టర్ పరుచూరి
రాజారామ్
అమరావతి పబ్లికేషన్స్, గుంటూరు
వెల: రు.120/-;
పేజీలు: 168
ప్రతులకు: నవచేతన మరియు విశాలాంధ్ర బ్రాంచీలు.
**
1910కి ముందు మానవ ప్రకృతిని గూర్చిన కొన్ని అభిప్రాయాలు: మానవ ప్రకృతి మానవుడి చుట్టూ వుండే పరిసరాల చేత, పరిస్థితుల చేత ప్రభావితం అవుతుందని ఆ పరిస్థితులు, పరిసరాలు మానవుడ్ని పూర్తిగా మార్చివేస్తాయన్న నమ్మకం ఆనాటి మేధావుల్లో వుండేది. కాని దానికి భిన్నంగా ప్రతి మనిషిలోనూ ఆ మనిషికి తెలియని ప్రపంచమొకటి వుంటుందనీ, అదే అతని బాహ్యప్రవర్తనను నిర్ణయిస్తుందనీ, మనిషికి తెలియని మనిషి లోపలుండే ప్రపంచాన్ని అంతశే్చతన లేక సుప్తచైతన్యం అంటారని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మానసిక శాస్తజ్ఞ్రుడు తెలియజేశాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కనుక్కున్న ఈ అంతశే్చతన అనే సిద్ధాంతం 1910 నుండి యూరప్‌లో బహుళ ప్రచారాన్ని పొందింది. మనిషిలో వున్న ఈ అంతశే్చతనను తెలుసుకోవడానికి ఆ మనిషికొచ్చే కలల్ని విశే్లషించడం ద్వారా తెలుసుకోవచ్చుననీ, కలలు అంతశే్చతనకు తెలుసుకోవడానికి రాచమార్గాలని కూడా ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు. అంతశే్చతనను తెలుసుకోవడానికి ఫ్రాయిడ్ మరో మార్గాన్నికూడా సూచించాడు. ఒక వ్యక్తిని ఓ సోఫామీద పడుకోబెట్టి అతని మనస్సులోకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను అడ్డంలేకుండా చెప్పనివ్వాలి. అతడిలా చెబుతున్నప్పుడు అతని పక్కనే ఒక మానసిక విశే్లషకుడు కూర్చొని అతని మాటలన్నీ వినాలి. తర్వాత ఆ మానసిక విశే్లషకుడు అతని మాటల్ని విశే్లషించాలి. ఈ విశే్లషణ ద్వారా ఆ వ్యక్తి అంతశే్చతనలో దాగివున్న శక్తులేమిటో తెలుసుకుని, వాటిని బహిర్గతం చేయడం ద్వారా ఆ వ్యక్తిని వేధిస్తున్న మానసిక సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. ఇలా వ్యక్తుల అంతశే్చతనలో దాగివున్న నిగూఢ శక్తులను బహిర్గతం చేసే విధానానే్న మానసిక విశే్లషణ అన్నారు.
ఫ్రాయిడ్ మనోవిశే్లషణా సూత్రాలు మొదట్లో తీవ్రమైన నిరసనలకు గురయ్యాయి. చెడుకు మూలం మనిషి అంతరంగమే అన్న ఫ్రాయిడ్ సిద్ధాంతం మనుషుల అహాన్ని దెబ్బతీసింది. కాని కొంతకాలం తర్వాత ప్రజలు ఫ్రాయిడ్ సిద్ధాంతాలను నిజమేనని అంగీకరించక తప్పలేదు.
బీదరికంలో పెరిగిన ఫ్రాయిడ్ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత పరిశోధనకే తన జీవితం అంకితం చేయాలనుకుంటాడు. కాని అప్పట్లో రీసెర్చిచేయడం సంపన్నులకే సాధ్యం. అనుభవంకోసం ఏ హాస్పటల్‌లోనైనా పనిచేస్తే ప్రాక్టీసు పెట్టుకోమని అంతా సలహాలిస్తుంటారు. తెలిసినవాళ్ళ దగ్గర ప్రాక్టీసు చేస్తూ, రోగులను పరిశీలిస్తూ పరిశోధనలు సాగిస్తుంటాడు. రీసెర్చిలో గడుపుతూ నిలబడలేక రాబడి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక, ఆఖరుకు వైవాహిక జీవితానికి దూరమై ఎన్ని కష్టాలుపడినా తన గమ్యాన్ని మరచిపోలేదు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఫ్రాయిడ్ మానసిక శాస్తజ్ఞ్రుడిగా ఎదిగిన విధానాన్ని, ఆయన జీవితాన్ని కృషిని ఈ పుస్తకం వివరిస్తుంది.
పరుచూరి రాజారాం రాసిన ఈ పుస్తకం 1985లో ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చిందట. అదే సంవత్సరం అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి రాసిన ‘‘సిగ్మండ్ ఫ్రాయిడ్’’ తెలుగు అకాడమీ ప్రచురణగా వెలువడింది. బోలెడన్ని పునర్ముద్రణలు పొందింది. ‘‘ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’’ను ‘‘స్వప్న సందేశం’’గా అనువదించి, పుస్తకంగా వేసింది కూడా వారే. వారి తర్వాత ఫ్రాయిడ్‌ను తెలుగువారికి పరిచయం చేసింది డా.పరుచూరి రాజారామ్‌గారే. అన్నపురెడ్డి పుస్తకంకొంటే ఈ పుస్తకాన్ని డిఫరెంట్‌గా తీర్చిదిద్దడంలో డాక్టర్‌గారు చేసిన కృషి ప్రశంసనీయం.

-కె.పి.అశోక్‌కుమార్