అక్షర

గుడిసె గుండె కావ్యం.. ఆనాటి ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిసె గుండె కావ్యం
దేవరాజు మహారాజు
వెల:రు.60
ప్రతులకు:
అన్ని పుస్తక కేంద్రాలలో

తెలంగాణ భాష కవిత్వ స్థాయికి తెచ్చే ప్రయత్నం ఇటీవల జరుగుతూంది అనేమాట ఉంది. కాని దేవరాజు మహారాజుగారి గుడిసె గుండె లాంటి కవితా సంపుటి ఈ ప్రయత్నాన్ని 1974 నుండే చేసింది. దుర్ముఖి ఉగాది సందర్భంగా ఉగాది కవితలు విరివిగా వచ్చాయి. ఇందులో కేవలం ఉగాది ప్రతిపాదనలుగా వచ్చిన వాచ్య కవితలే ఎక్కువ. ‘ఊల్లోకి ఉగాది వచ్చింది ఉర్కి రాండ్రి ఉర్కి రాండ్రి అని ఆనాడు దేవరాజు మహారాజు రాసిన కవిత ఎన్నో విషయాలకు ప్రాతిపదిక అయింది.
దేవరాజుగారు పచ్చి గ్రామీణ భాష వాడారు. లాంగ్వేజ్ నియర్ టు ది లాంగ్వేజ్ ఆఫ్ మెన్ అన్న వర్డ్స్‌వర్త్ మాటలు నిజం చేస్తూనే తన సహజమైన ఈస్తటిక్స్‌కు ఎక్కడా లోపం రానీయలేదు. ‘సుట్టు శానా దూరం నిండిన సీకటి తోటి ఆ చిన్నదీపం పానాలకు తెగించి కోట్లాడుతూంది.(పే 24)’ ‘నా పెన్మిటి కాదు, నా పాలి పులి, పదేండ్లనుండి నన్ను పల్గజీరుతున్న ఉలి’(పే 48) లాంటి కవిత్వవంతమైన వాక్యాలు తాననుకున్న భావాన్ని బలంగా వ్యక్తీకరించాయి.
కావ్యంలో ఆధునిక కవితా లక్షణాలను ఎక్కడా విస్మరించలేదు. గంగిరెద్దు ప్రతీకగా బానిసత్వాన్ని నిరసిస్తూ పారే ఏరు అంటూ కవిత్వాన్ని ఏరుకు ప్రతీక చేస్తూ రచన సాగించారు.
మహారాజుగారి పాత్రలు, సంఘటనలు, వివరణలు అన్నీ సాధారణ కవిత్వం లాగే ఉంటాయి. కాని కవి సంఘటన నుంచి, పాత్ర నుంచి లక్ష్యంవైపు పఠితని తీసుకుపోయే వైనంలోనే ఆయన ఒడుపుదనం కనబడుతుంది. ఒక నిర్దిష్టమైన భాషను ప్రయోగించడమనేది ఆ కాలంలో ఒక ప్రయోగం. కాని రచన ప్రయోగం దగ్గరే ఆగిపోకుండా తాను చిత్రించదలచుకున్న లేక చెప్పదలుచుకున్న దాన్ని చదువరి గుర్తించనంత లేతగా ఆయన చొరబడతారు. భాషతోపాటు ప్రతీకలలో వైవిధ్యం తెచ్చిన ఈ కవి ఒక అసాధారణమైన ఆవృత్తంలో పాఠకుడ్ని బిగిస్తాడు.
కవిత్వం ఇట్లా ఉండాలి అని ఇప్పటివరకు ఎంతోమంది చెప్పారు. కాని ఎప్పుడూ ఎవరు చెప్పిన పద్ధతిలోను కవిత్వం ఉండలేదు. అట్లాగే కవిత్వానికుండవలసిన తాత్విక పునాదికి కూడా ఎట్లాంటి ఇతమిద్ధత లేదు. మార్క్సిజం, దళిత, స్ర్తి, మైనారిటీ, తెలంగాణ వాదాలన్నీ కవిత్వంలో ప్రవేశించి కవిత్వానికి ఒక ప్రచాలనావరణాన్ని గీచి నిశ్శబ్దమైపోతున్నాయి. ఏ వాదాన్ని చెప్పాలనుకున్నా దాన్ని ప్రజా జీవన విధానానికి స్థానిక సంస్కృతికి జోడించినపుడే సార్ధకత ఉంటుంది.
‘గుడిసె గుండె’ శీర్షికే నూతనంగా ఉంది. గుడిసె ఆర్థిక దైన్యానికి నివాసం. అంటే కావ్యమంతా పీడితుల బాధితుల గుండె చప్పుళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతి కవితలోను ఈ విషయం స్పష్టంగా ప్రతిఫలించింది. టైటిల్ కవితగా కూడా ఇది లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించింది.
‘గుండెలన్ని అంటుకున్నాయి/ ఈడ గుడిసెలన్ని మండుతున్నాయి ఈడ,
బంగ్లాలు కాంగనే ఏమయింది,/ తప్పిచ్చుకునేదింకేడ’
గుడిసె గుండె కావ్యంలో బతుకుకోసం, అడ్డమైనోల్లు, ఉగాది పచ్చడి, యిసిత్రాలు లాంటి కవితలలో స్థానిక జీవితం, దానిలోని దుఃఖం ప్రతిఫలించాయి. ఇంకా తెలంగాణ సంస్కృతికి సంకేతమైన నుడికారాన్ని కూడ ప్రవేశపెడితే స్థానికతతో అనుసంధానతకు సార్ధక్యం చేకూరేది.
ఏమైనా సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఇంత తెలంగాణ స్పృహ కనబరిచిన కవిని అభినందించక తప్పదు. ఇలాంటి చైతన్యమే తరువాత వచ్చిన తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర సాధనకు ప్రాతిపదిక అయిందని గుర్తించాల్సి ఉంటుంది. ఇది పునర్ముద్రణ పొంది విడుదల కావడం తెలంగాణ సాహిత్య సమాజాన్ని, పౌర సమాజాన్ని ఉత్తేజపరచడమే.

-కాంచనపల్లి