అక్షర

యువజనోద్యమ కెరటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదు సంస్థానంలో
రాజకీయ చైతన్యం..
విద్యార్థి యువజనుల పాత్ర (1938-1956)
- ఎస్.ఎమ్.జవాద్ రజ్వీ
పుటలు: 110; వెల: రు.70/-
ప్రతులకు: నవచేతన బుక్‌హౌస్ వారి అన్ని శాఖలు
హైదరాబాదు.
***
‘‘కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు’’. కుటుంబ బాధ్యతలు, రేపేమిటి అన్న ఆలోచన లేనివారు, ఆవేశం, ఉద్వేగం, ఉత్సాహం ఉరకలెత్తే నవ యువకులు ఉద్యమాల్లో దూసుకొనిపోతారు. ప్రాణాలు తృణప్రాయంగా త్యాగాలు చేస్తారు. ఉద్యమాల విజయాలకు హేతువులవుతారు. అధికారం హస్తగతం కానంతవరకు విపరీతంగా ప్రశంసలతో ముంచెత్తిన నేతలు యువజనుల త్యాగాలను గుర్తించకుండా సన్నాయినొక్కులు నొక్కడం అనుభవంలో ఉన్నదే. జవాద్ రజ్వీ సాబ్ నిజాం వ్యతిరేకోద్యమంలో పోరాడి, జైలునుంచి పారిపోయి అజ్ఞాత జీవితం గడిపిన వీరయోధులు. కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించినవారు. సాలార్‌జంగ్ మ్యూజియం లైబ్రేరియన్‌గా పనిచేసిన జవాద్ రజ్వి ‘‘కామ్రేడ్స్ అసోసియేషన్’’అనే పేరిట కళాశాల విద్యార్థి సంఘాన్ని స్థాపించినవారిలో ఒకరు. ఆ సంస్థ కార్యకలాపాలను ఆధారాలతో నమోదుచేయడం ఈ గ్రంథ లక్ష్యం. ఇది ఆంగ్ల ఆంధ్రాలలో చాల ఏళ్ళ కిందటే వచ్చింది. ఇప్పుడు నవచేతన ప్రథమ ముద్రణగా పునర్ముద్రితమైంది.
1938-1956నాటి హైదరాబాదు రాజకీయాలు చాల సంక్లిష్టమైనవి. వెల్దుర్తి మాణిక్యరావు, మందుమల నరసింగరావు రచనలు మొదలుకొని విశ్వవిద్యాలయాల్లో వచ్చిన పరిశోధనలు కలుపుకొని ఇటీవలి ఏనుగు నర్సింహారెడ్డి అనువాదందాక ఎన్నో పుస్తకాలు వెలువడినా ఇంకా ఎంతో చెప్పుకోవడానికి అవకాశం ఉంది.
ప్రగతిశీల భావాలు కలిగిన ప్రొఫెసర్ ఖలీఫా అబ్దుల్ హకీం సూచనలతో, ఆశీస్సులతో 1939లో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఇది విద్యార్థి సంఘం. ఆనాటి ఈ సంఘంలో రాజబహద్దుర్‌గౌర్, మొఖ్దుం మొహియుద్దీన్, జవాద్ రజ్వి (ఈ గ్రంథ రచయిత) మొదలగు వారున్నారు. హిందు ముస్లిం ఐక్యత, సామ్రాజ్య వ్యతిరేకత, నిరక్షరాస్యతా నిర్మూలన, ప్రగతిశీల భావాలవ్యాప్తి మొదలైన వాటిని సాధించేందుకు సభలు, సమావేశాలు, శాఖలు ఏర్పాటుచేయడం లక్ష్యాలుగా గణనీయంగా కృషిచేసింది. వార్షిక సభలు కూడ పెద్దఎత్తున చేసుకొంది. 1944దాక ప్రజాతంత్ర ప్రగతిశీల విధానాలతో హైదరాబాదు యువకుల్లో చైతన్యాన్ని నింపడానికి కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రబలంగా కృషి చేసింది.
1939 అక్టోబర్‌లో ‘‘ఆల్ హైదరాబాదు స్టూడెంట్స్ అసోసియేషన్’’ ఏర్పడింది. కుల మతాలకతీతంగా జాతీయ భావాలతో హైదరాబాదు పౌరులు ఉండేలా తయారుచేయడం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దేశవ్యాప్త గౌరవాన్ని కలిగించడం దీని లక్ష్యం. స్పష్టమైన లక్ష్యాలతో హిందు ముస్లిం ఐక్యతతో 1941-42 ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనియన్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలపరచినందుకు, నిజాం ప్రభుత్వం అణచివేతలను ప్రశ్నించినందుకు ఈ సంఘం ప్రధాన కార్యదర్శి జవాద్ రజ్వి (ఈ గ్రంథ రచయిత)ని 1943లో విశ్వవిద్యాలయంనుంచి బహిష్కరించారు. 1945 దాక ఈ సంఘం తన ప్రభావాన్ని చూపింది. ఆనాటి సంఘటనల వివరాలను, తేదీలను ప్రత్యక్ష సాక్ష్యాలతో, అనుభవాలతో నమోదుచేసిన రచన ఇది. బూర్గుల నరసింగరావు లాంటి ఆనాటి కొందరు పెద్దలు ఇంకా మన మధ్య వుండడం మన అదృష్టం. వారిని సంప్రదించి మరింత విస్తృత స్థాయిలో హైదరాబాదు సంస్థానంలో విద్యార్థి యువజనుల రాజకీయ చైతన్యాన్ని నమోదుచేయాల్సిన కర్తవ్యం మనమీద వుంది.

-వెలుదండ నిత్యానందరావు