అక్షర

సరళ భాషలో ఉషః ఖండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ హనుమ సీతాదేవి
దివ్య దర్శనము
సుందరకాండలోని-ఉషః
ఖండానికి మల్లంపల్లి శరభేశ్వరశర్మగారి వ్యాఖ్య ఆధారము
రచయిత: జె.వెంకటేశ్వరరావు
వెల: రూ.100/-
ప్రతులకు-రచయిత,
శ్యామలానగర్, 1వలైను, మూడవ ఇల్లు,
గుంటూరు 522006
***

కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన శ్రీ మద్రామాయణం కల్పవృక్షానికి శివశ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మగారు కొన్ని కాండలకు వ్యాఖ్యానం రచించగా అవి వెలుగు చూడలేదు. జవంగుల వెంకటేశ్వరరావు వారి వ్యాఖ్యను ఆధారంగా తీసుకుని ఉషఃఖండాన్ని సరళ భాషలో, వచన రూపంలో రచించారు. దానిని శ్రీ హనుమ సీతాదేవి దివ్యదర్శనము అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు. హనుమంతుని సీతానే్వషణం రామాయణంలోని ప్రధానమైన మలుపు. ఇది సుందరకాండలో ఉంది. సుందర కాండలోని ఐదు ఖండాలలో మూడవ ఖండం ఉషఃఖండం. హనుమకు తాను చేపట్టిన పని సీతాదేవి దర్శనంతో సఫలమైంది. అందుకే ఇది ఉషఃఖండము. సీతమ్మతల్లి కష్టాల కడగండ్ల చీకట్లు కూడా కడతేరే సమయం వచ్చింది కాబట్టి ఆమెకూ అది ఉషఃఖండము. హనుమంతుడు సీతను దర్శించడంతో ఈ ఖండం ప్రారంభమైంది. హనుమ తానెవరో చెప్పడం, సీతాదేవి సందేహించడం, తిరిగి ఆమె పరీక్షించడం, హనుమంతుడు నెగ్గడం, సీత నమ్మడం, రాముని రాకను వీరు కోరుకోవడం ఇందులో కనిపిస్తుంది. రాముని వంశ ప్రశస్తి, రాముని గుణ శీలములు, లక్ష్మణుని భ్రాతృభక్తి, రాముని ముద్రిక చూపించడం, తన రూపాన్ని పెంచి చూపించడం, చూడామణిని గ్రహించడం, సీతాదేవిని రాముని కడకు చేరుస్తానని సీతతో అనడం, ఆమె రాముడు వచ్చి విజయాన్ని సాధించి తనను తోడ్కొని పోవడమే యుక్తమని చెప్పడంతో హనుమంతుడు తిరిగి రాముని వద్దకు ప్రయాణమయ్యాడు. ఇదీ ఉషఃఖండంలోని కథ. ఈ విశేషాలను తిరిగి మననం చేయడం ద్వారా సద్వర్తన అలవడుతుంది. చదువరులకు మేలు కలుగుతుంది. వెంకటేశ్వరరావుగారు ఈ కథను రామాయణ కల్పవృక్షంలో చిత్రించిన విధానాన్ని విశే్లషించి చూపారు. విశేషాలను అవతారిక అని చెప్పారు. సీతాదేవికి దూతగా వచ్చిన హనుమంతునిపై వెంటనే నమ్మకం కుదరలేదు. రావణుని మాయ ఏమో అనుకుంటుంది. ఎన్నో విధాలుగా హనుమంతుడు చెప్పిన తరువాత కూడా సందేహిస్తుంది. బాహుబల తేజో వేగములతోపాటు దూతకు బుద్ధి బలం కూడా ఉందా లేదా అని పరీక్షించేందుకు నిన్ను ప్రశ్నించవలసి వచ్చింది అంటుంది. సంశయ నివృత్తి కోసం రాముని వివరాలను అడుగుతుంది. తరువాత ఆనవాళ్లుగ తమ దాంపత్య బంధాన్ని వివరిస్తుంది. ఈ విషయాన్ని కల్పవృక్షంలో కవి మనోహరంగా సీతారాముల ప్రణయ మాధుర్యాన్నీ, వియోగ బాధనీ కూడా వర్ణించి చెప్పారు. సీతారాములు సెలయేళ్లలో, కొండ ల్లో విహరించేటప్పుడు వారి ప్రేమ ప్రకృతికి తెలుసునని చెప్పడమే కాకుండా ఇప్పుడు వీరి దుఃఖ కథ లోతు సముద్రానికి, దాని నిరవధిత్వము ఆకాశానికి తెలుసునని చెప్పడం ద్వారా ఆనందానికీ, వియోగానికీ గల భేదాన్ని స్పష్టంగా చూపారు. శ్రీరాముని నయనాలను తామర పూలతో పోల్చారు. తెల్లవారగానే తామరల్లా విచ్చుకున్న రాముని కళ్లు వికసించి చీకటి సమయానికి ముడుచుకోవడంగా కవి వర్ణించిన విధం అత్యద్భుతం. సీత పలుకులను ఆలకించిన హనుమ ఆమెను యోగినిగా, నిర్మమురాలిగా, నీతి కుశలగా యుద్ధనీతి కుశలురాలిగా, భక్తురాలిగా, దీనురాలిగా దర్శించాడు. హనుమ సీతను మాతృదేవతగా గౌరవిస్తే సీత హనుమ యెడల పుత్రవాత్యల్యంతో మెలిగింది. ఈ విధంగా హనుమ సీతాదేవిని దర్శించిన ఘట్టం రామాయణ కథకు మూల కారణమై ఉంది.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ