అక్షర

విజయనగర సామ్రాజ్య వైభవ ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రౌఢ దేవరాయలు
(చారిత్రక నవల)
-అయ్యదేవర
పురుషోత్తమరావు
వెల: రూ.100/-
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు

భారతదేశ చరిత్రలో అదొక స్వర్ణయుగము. విజయనగర సామ్రాజ్యం పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే పేర్లు రెండు. మొదట ప్రౌఢదేవరాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు. రెడ్డిరాజుల యుగానికి చెందిన విద్యాధికారి శ్రీనాథుడు విజయనగరం వెళ్లి ప్రౌఢ దేవరాయల సభలోని గౌడ డిండిమభట్టును ఓడించి కనకాభిషేకం చేయించుకున్న ఘటన చిరస్మరణీయమైనది. లోగడ కనకాభిషేకము పేరుతోనే ఒక నవల వచ్చింది. ఇప్పుడు అయ్యదేవర పురుషోత్తమరావుగారు ప్రౌఢ దేవరాయలు పేరుతో చారిత్రక నవలను వెలువరించటం ముదావహం. ఇందులో ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులు కళా సాంస్కృతిక వైభవం, చర్చలు, చందన చర్చలు, వ్యూహాలు, యుద్ధాలు, కావ్యగానాలు, ఉత్సవాలు అన్నీ పరిశోధించి పరిశీలించి అయ్యదేవర వారు ఇందులో పొందుపరిచారు. ఈయన ప్రధానంగా నటుడు. ప్రౌఢ దేవరాయల పాత్రను కూడా లోగడ సమర్థవంతంగా పోషించారు. ఆ కారణంచేత నాటకీయంగా ఈ నవలను తీర్చిదిద్దారు.
ఈ ప్రౌఢ దేవరాయల నవలలో సింహళదేవి, శ్రీనాథుడు, నారాయణాంబిక, లక్ష్మణ దండనాయకులు, విశే్వశ్వర దీక్షితులు, జక్కనామాత్యుల వంటి ఎన్నో సజీవ పాత్రలు మనకు దర్శనమిస్తాయి. డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ పీఠికలో చెప్పినట్లు ‘రాయలవారి ముత్యాలశాల సాహితీ గోష్టి సాహిత్య ప్రియులకు ఇష్టమైన హృదయమైన నైవేద్యంగా భాసిస్తుంది. వాఙ్మయ బ్రస్మ సరసకవి సార్వభౌముడు శ్రీనాథుల వారి గీర్వాణాంధ్ర భాషాయోష విజృంభణ చదువరుల హృదయాలపై సుధలను వర్షింపజేస్తుంది. వ్యాసుడు రచించిన మహాభారతానికి సన్మానం చేయటం, శ్రీనాథ గౌడ డిండిమల మధ్య జరిపిన సంవాదం, శ్రీనాథుని పద్య వైభవం ఇందులో పురుషోత్తమరావుగారు చక్కగా వివరించారు.
విద్యారణ్యుల వారి ఆశీస్సులతో ఏర్పడిన ఈ హిందూ సామ్రాజ్యం మహమ్మదీయుల దండయాత్రలను నిలువరించగలిగింది. కార్తీక పూర్ణిమతో నవల ప్రారంభమై తిరిగి కార్తీక పౌర్ణిమతోనే నవల ముగియటం ఒక శరత్ జ్యోత్స్నానుభవం. చారిత్రక నవలా రచన ఒక యోగం. ఒక యాగం. విశ్వనాథ, నోరి, బాపిరాజు గారల తర్వాత ఈ పరంపర ఆగిపోతుందేమోనని ఎవరూ భయపడవలసిన పని లేదు. చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడవుతాడు. ఈ తరం వారికి ఆ తరం అందించవలసిన బాధ్యత రచయితల మీద ఉంది. అయ్యదేవర పురుషోత్తమరావు ఎంతో శ్రమకోర్చి లోగడ కాకతీయ చరిత్ర, ఇప్పుడు విజయనగర చరిత్ర పాఠకులకు అందించారు. అందుకు వారికి తెలుగు పాఠక లోకం రుణపడి ఉంటుంది. ఇలాంటి గ్రంథాలు అన్య భాషలలో నుండి తెలుగులోనికి ఎన్ని గ్రంథాలు వచ్చాయో అన్ని ఆయా భాషలలోనికి వెళ్లకపోవటం ఒక లోపమేనని భావించాలి. పురుషోత్తమరావు గారు తమ చారిత్రక నవలా రచనా మార్గాన్ని కొనసాగించగలరని ఆశిద్దాం. విలువగల పుస్తకానికి వెల మాత్రం తక్కువ ఉంచారు.

-ముదిగొండ శివప్రసాద్