అక్షర

అమ్మంగి రచనలపై విలక్షణ విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మంగి వేణుగోపాల్
రచనలు-సమగ్ర పరిశీలన’
డా.ఆర్.సూర్యప్రకాశరావు, ప్రభాతవాణి సాహిత్య వేదిక, మేడ్చల్
వెల: రు.375.. పేజీలు: 567
ప్రతులకు అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలు
**
కవిగా, కథకుడిగా, నాటక కర్తగా పరిశోధకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా అమ్మంగి వేణుగోపాల్ ప్రజ్ఞ బహుముఖీనమైనది. సాహితీరంగంలో విశేష కృషి చేసిన ఇలాంటి సాహితీమూర్తుల వ్యక్తిత్వ జీవితవిశేషాలను, వారి సాహిత్య విశే్లషణలతో కూడిన పరిశోధన గ్రంథాలు వెలువడుతున్న క్రమంలో- ఆర్.సూర్యప్రకాశరావు పిహెచ్.డి పట్టాకొరకు ‘అమ్మంగి జీవితం- సాహిత్యం’లపై సమర్పించబడిన పరిశోధనా సిద్ధాంత గ్రంథమిది.
ఇందులో మొదటి అధ్యాయమైన ‘అమ్మంగి వేణుగోపాల్ జీవన రేఖలు’లో అమ్మంగి వారి బాల్యం, ఒడిదుడుకులతో సాగిన వారి విద్యాభ్యాసం, చివరకు అధ్యాపక వృత్తిలో చేరడం, వారి వివాహ కుటుంబ జీవితాలను, బాల్యంలోనే ఆయనకు సాహిత్య అధ్యయనం పట్ల ఎలా ఆసక్తి కలిగిందీ, అది ఎలా విస్తృతమైనదీ తెలిపారు. కవిగా మొదలై పరిశోధకుడిగా, విమర్శకుడిగా,నాటక కర్తగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా అమ్మంగివారు ఎదిగిన క్రమాన్ని, ఆయన భవిష్యత్ ప్రణాళికను తెలియజేసారు. రెండవ అధ్యాయమైన ‘కవిగా వేణుగోపాల్’లో వారి కవిత్వాన్ని వస్తుపరంగా, శిల్పపరంగా విశే్లషిస్తూ-కవిగా ఆయన గొప్పతనాన్ని, ప్రత్యేకతను తెలియజేసారు. భాషా ప్రయోగాలలో నవ్యత, క్రియారహిత వాక్యనిరూపణ వారి కవితల్లో ఎలా వుంటుందో వివరిస్తూ, సామెతలు, లోకోక్తులు, జాతీయాల ప్రయోగాన్ని ఎంత చక్కగా వాడుకున్నారో వివరించారు. మూడవ అధ్యాయం ‘పరిశోధకుడిగా అమ్మంగి వేణుగోపాల్’లో నవలా రచయితగా గోపిచంద్ పయనాన్ని అమ్మంగివారు తమ పరిశోధనలో సవివరంగా విశే్లషించారు. మనో విశే్లషణాత్మక నవలలు, సాంఘిక నవలలు, నవలికలు, అసంపూర్ణ నవలలుగా గోపీచంద్ నవలలను విభజించిన విధానం బాగుంది. అసంపూర్తి నవలలు ఒకవేళ కొనసాగివుంటే వాటి ముగింపు ఎలా వుండేవో వూహించి వివరించిన విధానం ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. గోపీచంద్ నవలలో ఆత్మ కథాత్మకమైనవేవో నిరూపించడం, ఆయనపై ఇతరుల ప్రభావం, ఆయన రచనలను వేరే వాటితో తులనాత్మకంగా విశే్లషించడం, వారి పరిశోధనలో కనిపించే ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గోపీచంద్ సాహిత్యాన్ని క్షుణ్ణంగా మదించి, శోధించిన ఫలితమే ఆయనపై వెలువరించిన మొనోగ్రాఫ్‌గా చెప్పుకోవాలి. ‘అవినాభావం’, ‘సాహిత్య సందర్భం-సమకాలీన స్పందన’ అనే విమర్శ సంపుటాలను విశే్లషిస్తూ నాలుగో అధ్యాయం ‘సాహిత్య విమర్శకుడిగా అమ్మంగి వేణుగోపాల్’లో రూపొందించారు. విమర్శా వ్యాసాలలో వస్తు శిల్పాల పరిశీలన, సామాజికాంశాల ప్రతిఫలనం, తులనాత్మక విశే్లషణ, మార్క్సిస్టు దృక్పథం కనిపిస్తుందని తెలియజేసారు. ఆకాశవాణి కోసం రాసిన ‘అమ్మంగి వేణుగోపాల్ నాటికలు‘లోని వస్తు విన్యాసాన్ని, సంభాషణా చాతుర్యాన్ని, శ్రవ్యనాటికలుగా వాటి విజయాన్ని తెలియజేస్తూ ‘నాటికల రచయితగా అమ్మంగి వేణుగోపాల్’ అనే అయిదో అధ్యాయాన్ని రాసారు. వర్గ దృక్పథ చిత్రీకరణ, మాండలికంలో రూపొందిన వేణుగోపాల్ కథలను విశే్లషిస్తూ ‘కథానికా రచయితగా అమ్మంగి వేణుగోపాల్’ అనే అధ్యాయంలో అమ్మంగి విశిష్టతను తెలియజేసారు.
రచనల ఎంపిక, అనువాదాల ఏకరూపత, గ్రంథ రూపకల్పనలో సమన్వయంతో సంపాదకుడిగా తనదైన ముద్ర వేసిన అమ్మంగిని ‘సంపాదకుడిగా అమ్మంగి వేణుగోపాల్‌‘ అనే అధ్యాయంలో చూపించారు. ‘అనువాదకుడిగా అమ్మంగి వేణుగోపాల్’ అనే చివరి అధ్యాయంలో అనువాదకుడిగా ఆయన చూపిన శ్రద్ధను, ప్రతిభా విశేషాలను తెలియజేసారు. రచయితల జీవితం-సాహిత్యం పేరిట మొక్కుబడిగా వచ్చే గ్రంథాలకంటే భిన్నంగా రచయితయొక్క అన్ని రచనలను తీసుకుని అక్షరాక్షర పరిశీలన చేసి అమ్మంగి విశిష్టతను-గొప్పతనాన్ని తెలియజేసిన విధానం బాగుంది. ఈ పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని చక్కగా సమగ్రంగా రూపొందించడంలో పరిశోధకుడు చేసిన కృషి, పట్టుదల కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. యూనివర్సిటీకి సమర్పించబడిన సిద్ధాంత గ్రంథాన్ని ఏమాత్రం ఎడిట్ చేయకుండా యథాతథంగా 567 పేజీలతో వెలువరించడం సాహసమేనని చెప్పాలి. అమ్మంగిపై వచ్చిన రెడీ రెఫరెన్స్ బుక్‌గా ఇది నిలిచిపోతుంది. మంచి పర్యవేక్షకులు వుంటేనే మంచి పరిశోధనా గ్రంథాలు వెలువడతాయని మరోమారు తూర్పు మల్లారెడ్డి నిరూపించారు.

-కె.పి.అశోక్‌కుమార్