అక్షర

కేరళ అందాల కథాకళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మా కేరళ యాత్ర’
ఙముత్తేవి రవీంద్రనాథ్,
పేజీలు : 256,
ధర : రూ. 250,
ప్రతులకు : విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు.

పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కొబ్బరి చెట్లు, అంబారీ అలంకరణలతో ఆలయాల్లో కొలువుదీరే గజరాజులు, ప్రత్యేక ఆహార్యంతో ఆకట్టుకునే ‘కథకళి’, పడవ పందాలతోప్రసిద్ధి చెందిన ‘ఓనం’... కేరళ అనగానే మన మదిలో మెదిలేవి ఇవే. అయితే దేశం మొత్తం మీద ‘్ఫస్ట్’, ‘బెస్ట్’, ‘లాంగెస్టు’, ‘హయ్యెస్టు’, ‘బిగ్గెస్టు’లను సొంతం చేసుకున్న మహా విశిష్టతలెన్నో కూడా ఈ మలయాళ రాష్ట్రంలో వున్నాయి. ఆసక్తికరమైన ఆ విశేషాలను రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ ‘మా కేరళ యాత్ర’ అనే పుస్తక రూపంలో మన ముందుంచారు. ఆ విశేషాలు తెలుసుకోవడం ఆసక్తిదాయకమే కాదు, అవసరం కూడా.
దక్షిణ భారతదేశపు స్వర్గంగా, దేశంలో ఏకైక సతత హరిత ప్రాంతంగా గాంధీజీ ప్రశంసలందుకున్న కేరళలో వున్న ప్రకృతి రమణీయతతో బాటు చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాల గురించిన విశే్లషణాత్మక కథనాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆంధ్రులకు భౌగోళికంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలతో ఉన్నంత అనుబంధం కేరళ రాష్ట్రంతో లేకపోవడం వల్ల కూడా ఇక్కడి విశేషాలు వారికి అంతగా తెలియవని ఓచోట ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అతి పొడవాటి సరస్సు ‘వెంబనాడు’, మొత్తం పడమటి కనుమల్లోనే అత్యంత ఎతె్తైన పర్వతం ‘అనైముడి’, పడవలు, ఓడల నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ‘బేపూర్’, లోహ ముకురాలు లభించే ఏకైక ప్రదేశం ‘అరన్ముళ’, అక్షరాస్యత నూటికి నూరుశాతం నమోదు చేసుకున్న, ప్రచురణా రంగంలోనే విశిష్ట స్థానమున్న ‘కోట్టయం’, ఒకప్పటి బానిసల విక్రయ కేంద్రం ‘తిరునక్కర’, భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన 50 ప్రదేశాల్లో ఒకటిగా నేషనల్ జియోగ్రాఫికల్ మ్యాగజైన్ పేర్కొన్న హిల్‌స్టేషన్ ‘వాగమణ్’, సర్పనావలతో ఉత్కంఠ పోటీలు నిర్వహించే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన అలెప్పీ, పుష్కరానికి ఒక్కసారే విరబూసే ‘కురంజీ’కి నెలవైన ‘ఎరవికుళం నేషనల్ పార్కు’, ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ‘పోన్ముడి’, ప్రపంచంలోనే అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా వున్న ‘కోవలం బీచ్’, అత్యంత అరుదైన చారిత్రక నాణాలున్న ‘కోయిక్కల్ ప్యాలెస్’, సహ్యాద్రి పుత్రులుగా పిలుచుకునే ఏనుగుల కోసం ఏర్పరచిన సంరక్షణ కేంద్రం, పాటలు పాడే పక్షులతో బాటు ఎన్నో జీవవైవిధ్య జాతులున్న ‘పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ’, తిరువనంతపురానికే తలమానికంగా వున్న ‘నేపియర్ మ్యూజియం’, అద్భుతమైన కళాఖండాలెన్నింటినో పొందుపరచిన ‘శ్రీ చిత్ర ఆర్ట్స్ గ్యాలరీ’ ఇలా ఎన్నో, ఎనె్నన్నో ప్రత్యేకతలున్న ప్రదేశాలను గురించి ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
సుప్రసిద్ధ హిందూ దేవాలయాలైన శబరిమలై అయ్యప్ప సన్నిధానం, అపార నిధి నిక్షేపాలున్న అనంతపద్మనాభుని ఆలయం, నాగారాధన క్షేత్రాల్లో ప్రముఖమైన ‘మన్నార్ శాల’, ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రాలు.. ఇలా ఎన్నో ఆలయాల ప్రత్యేకతల గురించి తెలిపారు. అయితే భక్తి, విశ్వాసాలకు సంబంధించిన విశేషాలు చెప్పేటప్పుడు తనకు తెలిసిన సమాచారాన్ని సమగ్రంగా అందిస్తూనే వాటిలోని లోపాలను, అసంబద్ధ విషయాలను ఎత్తిచూపారు. ‘దివ్య తిరుపతులు’గా కొన్ని ఆలయాలను ఎందుకు పేర్కొన్నారో చెబుతూ అలాంటి ఆలయాలు మన దేశం మొత్తమీద 108 వుండగా కేరళలో 8 వున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో అలాంటివి అహోబిలం, తిరుపతి మాత్రమేనని తెలిపారు. వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వారుల కారణంగా ఈ దివ్య తిరుపతులు ఏర్పడిన వైనాన్ని వివరించే క్రమంలో అసలు ఆళ్వారులందరూ నిమ్నజాతుల వారేనని చెప్పడం, వారు వైష్ణవ భక్తులుగా మారడానికి వెనుక వున్న కథనం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదే సందర్భంలో శైవ భక్తులు నయనార్ల వల్ల వచ్చిన సంఘ సంస్కరణల గురించీ వివరించారు.
చర్చిల గురించి వివరించే సందర్భంలో ‘బసీలికా’గా పేర్కొనే చర్చిల ప్రాధాన్యతని తెలియజేస్తూ అలాంటివి మనదేశంలో 21 వుండగా, అందులో కేరళలోనే 8 వుండడం విశేషమని చెప్పారు. కేరళ క్రిస్టియన్లు ఒకప్పుడు నంబూదిరి బ్రాహ్మణులని, ఏసుక్రీస్తు ప్రత్యక్ష శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారినందరినీ క్రైస్తవులుగా మార్చారని, అందుకే ఇప్పటికీ వారు జంధ్యం ధరించడం, పిలక పెట్టుకోవటం చేస్తారని, అంటరానితనం పాటిస్తారని రచయిత పేర్కొనడం గమనార్హం.
ఇక కేరళలో జరిగిన సామాజిక విప్లవాలు, చారిత్రక ఉద్యమాల గురించి కూడా రవీంద్రనాథ్‌గారు చక్కగా వివరించారు. రాజ్యహింసకూ, అణచివేతకూ వ్యతిరేకంగా తిరువితాంకుర్ సంస్థాన ప్రజల్లో వచ్చిన విప్లవ చైతన్యాన్ని, బ్రిటీష్ సేనలకు వ్యతిరేకంగా జరిగిన మోప్లా తిరుగుబాటును, కమ్యూనిస్టుల పున్నప్ర, వయలార్ పోరాటాన్ని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమకారులు ఎకె గోపాలన్, కెకె వారియర్, ఎన్‌ఇ బలరాం, పి కృష్ణపిళ్లై, ఇఎంఎస్ నంబూద్రిపాద్, అచ్యుత్ మీనన్, పికె వాసుదేవ నాయర్ నాయకత్వ పటిమనూ పేర్కొన్నారు.
గడచిన శతాబ్దంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘వైకోమ్ సత్యాగ్రహం’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైకోమ్‌లో వున్న మహాదేవాలయంలోకే కాదు, పరిసర వీధుల్లోకి కూడా అపర్ణులు రాకుండా సపర్ణులు అడ్డుకున్న విషయంపై ఈ ఉద్యమం నడిచింది. కేరళలో జరిగిన మొట్టమొదటి వ్యవస్థీకృత పోరాటంగా, పౌర హక్కుల కోసం జరిగిన తొలి చారిత్రక ఉద్యమంగా దీన్ని పేర్కొన్నారు. 200 మంది యువకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉద్యమ ఉద్ధృతికి జాతీయ స్థాయి నేతలే కదిలి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందిట. మహాత్మాగాంధీ మధ్యవర్తిత్వం వహించడం, ఆచార్య వినోబా భావే, స్వామి శ్రద్ధానంద మద్దతునివ్వడం, పెరియార్ రామస్వామి నాయకర్ సతీసమేతంగా ఈ ఉద్యమంలో పాల్గొనడాన్ని బట్టి ఈ సత్యాగ్రహం ఎంత తీవ్రస్థాయిలో జరిగిందో వివరించారు.
‘కాలడి’ గ్రామానికి చెందిన అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల నుంచి ఇప్పటివరకూ ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఎందరో మహానుభావులు, ప్రముఖుల గురించి పరిచయం చేశారు. వారిలో శివగురు ఆశ్రమ స్థాపకుడు నారాయణ గురు, అద్భుత చిత్రకారుడు రాజా రవివర్మ, సుప్రసిద్ధ వాగ్గేయకారుడు స్వాతి తిరునాళ్, మలయాళ భాషలో కార్ల్ మార్క్సు జీవితంపై మొట్టమొదటి గ్రంథాన్ని, పాత్రికేయులకు పెద్దబాలశిక్ష వంటి ‘వృత్తాంత పరివర్తన్’ గ్రంథాన్ని రచించిన ‘స్వదేశాభిమాని’ కె రామకృష్ణ పిళ్లై, దేశం మొత్తమీద శాసనసభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళ టి మాధవి అమ్మన్, కేరళ రాజకీయ భీష్మాచార్యుడు ‘పట్టంతాను పిళ్లై’, మలయాళ మహాకవి ఎస్ పరమేశ్వర్ అయ్యర్‌లను ప్రముఖంగా పేర్కొన్నారు. 20వ శతాబ్దానికి చెందిన గొప్ప ‘హేతువాద ఉద్యమకారుడు’ అబ్రహాం థామస్ కోవూర్, సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు అబూ అబ్రహాం, చిత్ర దర్శకులు జాన్ అబ్రహాం, అడూర్ గోపాలకృష్ణ, నటుడు మమ్ముట్టి, ప్రపంచ అథ్లెటిక్స్‌లో మన దేశానికి మొట్టమొదటి కాంస్య పతకాన్ని అందించిన క్రీడాకారిణి అంజు బాబి జార్జ్, ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ రచయిత అరుంధతి రాయ్‌లను ప్రస్తావించారు.
ప్రచురణల రంగంలో అగ్రగామి సంస్థ అయిన డిసి బుక్స్, దేశంలోనే అత్యధిక సర్కులేషన్ కలిగిన ‘మలయాళ మనోరమ’తో బాటు ఇంకా అనేక పత్రికలు వెలువడేది కోట్టయం నుంచేనని, దేశంలోనే మొట్టమొదటి మీడియా కళాశాల ‘జోసఫ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్’ వున్నది చెంగానాస్సేరిలోనని వెల్లడించారు. నావికులు ‘అరేబియా సముద్రరాణి’గా పిలుచుకునే తీర పట్టణం ‘కొచ్చి’లో పోర్చుగీసు వారు, డచ్చివారు, ఆంగ్లేయులు, అరబ్బులు కూడా తమ స్థావరాలను ఏర్పరచుకున్నారట. వారిక్కడ నిర్మించిన ఎనె్నన్నో కట్టడాలు ఇప్పటికీ చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచివున్నాయి. అందులో యూరోపియన్లు మనదేశంలో నిర్మించిన మొట్టమొదటి చర్చి ‘సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి’ ఒకటని, దేశం మొత్తమీద 1724లో నిర్మించిన డచ్‌వారి శ్మశానవాటిక అతి పురాతనమైనదని చెబుతూ వీటిని చూడగలగడం గర్వకారణమని కూడా రచయిత పేర్కొన్నారు.
నాయర్ల కుటుంబ వ్యవస్థ గురించి వివరించే సందర్భంలో మాతృస్వామిక వ్యవస్థ, బహు భర్తృత్వంపై రచయిత వెల్లడించిన అంశాలు విస్మయం కలిగించాయి. ‘ఒక స్ర్తికి ఎంతమంది భర్తలు వుంటే సమాజంలో ఆమెకి అంతటి గౌరవం. ఇద్దరు, ముగ్గురు యువకులను ఆమెకు భర్తలుగా వుండేలా కుటుంబీకులే ఎంపిక చేస్తారు’ అని రాశారు. అయితే ఇది ఎంతవరకు ప్రామాణికమో అన్నది సంశయాత్మకం.
మొత్తమీద ‘కేరళ యాత్ర’ పుస్తకాన్ని చదివిన వారెవరికైనా కనీసం ఒక్కసారైనా కేరళ యాత్ర చేసి రావాలన్న తపన కలగక మానదు. కాగా ఇందులో పేర్కొన్నవి కేరళలోని దక్షిణ ప్రాంతపు విశేషాలు మాత్రమే. అయితే ఈ పుస్తకంలో పరిహరించాల్సిన విషయాలు కూడా వున్నాయి. ‘మా 18 రోజుల కేరళ యాత్ర’ అని పదేపదే రాయడం, ప్రయాణాల్లో చోటుచేసుకున్న కొన్ని సంభాషణలు, ఫొటోల ప్రచురణలో రిపిటీషన్లు నివారిస్తే బాగుండేది. ఏదిఏమైనా సాహిత్యం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలపై రచయితకున్న పట్టు, పాఠకులకు శాస్ర్తియ దృక్పథంతో వాటిని అందించాలనే ఆశయం అభినందనీయం.
..............................................................................................................................................................................................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-డి.స్వాతి