అక్షర

కవిత్వమై పరిమళించిన అక్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో మట్టి
(కవిత్వం)
ప్రతులకు: ఎన్.అరుణ, ఇం.నెం.13-1/5 బి,
శ్రీనివాసపురం
రామంతపూర్,
హైదరాబాద్- 500 013
040-27037585, 09391028496
అన్ని ప్రముఖ
పుస్తకాల షాపుల్లో

అంతరంగం ఆకాశంలో అనుభూతి సీతాకోక చిలుకలు ఎగురుతున్నపుడు, మది నదిలో తలపుల తరంగాలు ప్రవహిస్తున్నపుడు మనిషి ఊరికే వుండలేడు. కవియై కావ్యగానం చేస్తాడు. ఋషియై వర్తమాన సమాజాన్ని వ్యాఖ్యానిస్తాడు. కవిగా జీవించిన ఆ క్షణాలలో గాఢానుభూతుల జలపాతంలో తడిసి, మానవ జీవనంలోని బహుముఖ కోణాలకు అక్షర రూపమిస్తాడు. అప్పుడు ఆ అక్షరాలు నిజంగా అక్షరాలుగా శాశ్వతత్వాన్ని సంతరించుకొంటాయి. వాటిని సృష్టించిన కవి కలకాలం గుర్తుండిపోతాడు. అలాంటి కవే డా.ఎన్.గోపీగారు.
ఇటీవల గోపీగారు రచించిన కవితా సంపుటి ఆకాశంలో మట్టి. 60 కవితలున్న ఈ సంపుటిలో ఆధునిక మానవుడే ప్రధాన వస్తువు. పల్లెటూరి మట్టి పరిమళాలను ఆస్వాదించిన వ్యక్తి నగరంలో ఇమడ లేడు. నగరం అతణ్ణి పరాయివాడిగా చూస్తుంది. నగర జీవితం వేరుగా వుంటుంది. పొద్దున లేచిన దగ్గరనుంచి అందరూ ఉరుకుల పరుగులతో హడావిడిగా వుంటారు. దీనే్న ‘‘నగరం నాకొద్దు’’ కవితలో, ‘‘ఇక్కడి రోడ్లకు గమ్యం లేదు/ ఇక్కడి వేగానికి అర్థం లేదు’’/ అంటూ ‘‘ఇక్కడి ఆకాశం ఒంటరిది/ ఇక్కడి ఆవేశం తుంటరిది/ మట్టిని చీలుస్తూ రోజూ నువ్వు పాడే పాటకోసం/ జెండాలా రెపరెపలాడే నీ కొంగుకోసం/ నేనే కొత్తదారి వేసి పరిగెత్తుకొస్తాను’’ అని నగరంనుంచి పల్లెకు వెళ్ళిపోడానికి ప్రయత్నం చేయడాన్ని వివరిస్తారు.
జీవితం వ్యాపారమయ్యాక తల్లీపిల్లల మధ్య అనుబంధాలు అంతరించి పోతున్నాయి. మనిషికి మనిషికి మధ్య మమకారాల బదులు నిలువెత్తు గోడలు మొలుస్తున్నాయి. డబ్బు సంపాదనలో పడి ముసలి తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోవడం లేదు. వారిని వృద్ధాశ్రమాల చిరునామాలుగా మార్చేస్తున్నారు. దీనినే ‘‘తద్దినం పెట్టడం ఈజీ/ బతుకున్నప్పుడు/ ఇంట్లో చోటివ్వడమే కష్టం/’’అని ‘‘మలి సంధ్య’’ కవితలో అంటారు. ఇప్పుడు కుటుంబమంటే భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు. అంతే. అమ్మమ్మలు, తాతయ్యలకు వృద్ధాశ్రమాలే తప్ప ఇళ్ళుండవు. అక్కడ వుండేది వయసుమీరిన పండుటాకులే కాబట్టి అక్కడ మంచాలపై ఇవాళ వున్నవారు రేపుండరు. ఈ విషాద దృశ్యాన్ని ‘‘వృద్ధాశ్రమంలో మంచాలు పాతవే/ వచ్చిపొయ్యేవాళ్ళే మారుతుంటారు/’’ అని గుండెల్ని పిండేసే కరుణ రస చిత్రాలను బొమ్మ కట్టిస్తారు కవి.
ప్రభుత్వంవారు పార్లమెంటులో ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటారు. పంటలు పండక, గిట్టుబాటు ధరలు లేక, పార్లమెంటు బయట ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసికొంటుంటారు. దీనినే ‘‘బడ్జెట్ విన్యాసాలు’’ కవితలో ‘‘అతడు చచ్చిపోయాడు/ పార్లమెంటులో మంత్రి బడ్జెట్ వివరాలు చదువుతుండగానే / అతడు ప్రాణాలు విడిచాడు/ అంటూ ‘‘దళారుల క్రీడలతో/ గిట్టుబాటు ధరలు రావు/ పురుగు మందులు/ ఆత్మహత్యలకు పనిచేస్తాయి/ కల్తీ విత్తనాల్లోంచి బావులు మొలుస్తాయి/ ఇవేవీ బడ్జెట్‌లో వుండవు’’అని అన్నదాతల ఆత్మహత్యల కఠోర వాస్తవాలు వెల్లడిస్తారు.
గోపీగారికి కవిత్వమే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అనుక్షణం కవిత్వానే్న కలవరిస్తారు. పలవరిస్తారు. ‘‘నా కవిత్వం’’ కవితలో ‘‘చెమ్మపట్టిన గోడలా మెరుస్తుంటాను! కవిత్వం లేకుండా ఉండలేను/ అని అంటూ ‘‘చీమలు మోసుకొస్తున్న జొన్నగింజలు/ కాగితంపైకి దారికడతాయి/ ఆకలికి మించిన కవిత్వం/ నాకిప్పటికీ తోచదు/’’అంటారు. నిజంగా ఈ సృష్టి ప్రారంభంనుండి ఆకలి వుంది. మానవ జీవితచరిత్ర అంతా ఆకలి తీర్చుకోవడానికే పోరాటాలు ఆరాటాలు.
జేబు, కవిత్వంతో తిరిగిరా, కవియు జీవించె, వెలిగే వాక్యం, ఆ ఒక్క క్షణం మొదలైన కవితలు కవిత్వం గురించి మాత్రమే రాసిన కవితలు. మామూలు మనుషులకు కొన్ని వస్తువులు మామూలుగా కనిపిస్తాయి. కానీ కవికి మాత్రం దేన్నైనా కవితగా మలిచే శక్తివుంది. ‘‘చేతులు’’ కవితలో ‘‘చేతులు/ వొట్టితోలు కట్టెలు కావు/ కవాతుచేసే చేతుల ముందు/ జనావళులు సముద్రాలై లేస్తాయి/ కత్తిపట్టాలన్నా/ కరుణ చూపాలన్నా/ చేతులకే సాధ్యం/ చేతులముందు ఈ మహాకావ్యాలెంత/’’ అని మానవ శరీర అవయవాల్లో చేతుల ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తారు. ప్రతిభావంతుడైన కవికి ఎత్తుగడ, ముగింపు తెలుసు. ఎలా మొదలుపెట్టాలో ఎప్పుడు ముగించాలో తెలుసు. చివరిలో ఒక మెరుపును మెరిపిస్తాడు. గుండెల్లో గుచ్చుకొనేలా అక్షరాయుధాన్ని ప్రయోగిస్తాడు.
ముఖపత్ర కవితయైన ‘ఆకాశంలో మట్టి’ కవితలో మట్టిపరిమళాన్ని పంచిపెడతారు. మానవుడు మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతాడు. మనిషి విమానమెక్కినా భూమిమీదనుంచే కదా అడుగులువెయ్యాలి. నేలమీద కాళ్ళు పెట్టినపుడు అమ్మను ఆలింగనం చేసికొన్నట్లే వుంటుంది. దీనినే‘‘చెప్పులు లేకుండా నేలమీద తిరుగుతున్నప్పుడల్లా/ కాళ్ళలోంచి పద్యాలు పాకుతాయి/ అంతెందుకు/ కొంచెం మట్టిని తెచ్చి కాగితంపై చల్లాను/ అదే ఈ అక్షరాలు/’’అని ఇక్కడ మట్టి విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తారు.
ఇంకా ఈ సంపుటిలో ఊరు చిన్నదే, సొంతిల్లు, పాపనవ్వు, రాజ్యంగం నీడలో మొ.కవితలు చదవదగిన కవితలు. ఈ పుస్తకంలో ‘‘నిజమైన చేతులు బతుకు తుఫానులో శరీరం పడవను తెరచాపల్లా నిలబెడతాయి, రోడ్లమీద ట్రాఫిక్ సంక్లిష్టవాక్యంలా వుంటుంది. ఇవాళ నగరం వచనమైతే దానిలో నలిగే జీవితం కవిత్వం/ నీటి పక్షులు ఆకాశాన్ని అలంకరిస్తాయి. కవిత్వం ఒక ఆకురాయి సానబెడితేనే తళుకు, కవిత్వం ఒక విసుర్రాయి, నలిగితేనే మెరుపు, మనస్సును తెరవకపోతే ప్రేమ వ్యర్థవౌతుంది. పురుగుపట్టిన కట్టెలు పక్కటెముకల్లా తేలాయి మొ. వాక్యాలు వెంటాడుతాయి.
అక్షరాల విమానాలు, సిమెంటు చర్మం, రక్తనదులు, నీటి పక్షులు, బతుకు తుఫాను మొ. రూపకాలు మనసును అలరిస్తాయి. కొంతమంది కవులు ఒకటి, రెండు కావ్యాలు రాసి గతకాలపు పునాదిమీద కీర్తిసౌధాలు నిర్మించుకొని అందులోనే వుండిపోతారు. కానీ గోపీగారు నిరంతర కవితాకృషీవలుడు. విరామమెరుగక ప్రతి ఏడాదీ ఒక కొత్త కవితా సంపుటితో పాఠకులను పలకరిస్తూ తెలుగు కవితారంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వైవిధ్యమైన కవితలతో గూడిన ఈ సంపుటి కవిత్వాభిమానులందర్నీ చదివింపచేస్తుంది.

-మందరపు హైమవతి