అక్షర

వైవిధ్యానికి ప్రతీకలు ఆత్రేయ నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయ నాటక ప్రస్థానం
రచన: డా.పైడిపాల
ప్రతులకు: డా.పి.యస్.రెడ్డి,
11 20, కొంకాపల్లి,
అమలాపురం
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
మనసుకవిగా తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్న మనసైన కవి ఆచార్య ఆత్రేయ కేవలం కవే కాదు, నాటక రచయిత కూడా అని అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాసిన ఎన్‌జీవో, ఈనాడు, కప్పలు వంటి సుప్రసిద్ధమైన నాటకాల గురించి మాత్రమే చాలామందికి తెలుసు. ఆయన నాటక రచన ప్రారంభంనుంచీ ఎన్ని నాటకాలు రాసారు, ఎలాంటి ఇతివృత్తాలు ఎన్నుకున్నారు, ఎన్ని ప్రదర్శించబడ్డాయి అనే విషయాలేకాక ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం, ఆయనకున్న అనుబంధాలు, సినిమా పాటల ప్రస్థానం మొదలైన అన్ని విషయాలను కూలంకషంగా చర్చిస్తూ, వివరిస్తూ సాగిన డా.పైడిపాల రాసిన ఈ ఆత్రేయ నాటక ప్రస్థానం ఎంతో విలువైనది.
ఆత్రేయని కవిగా విద్యార్థి దశనుంచీ అభిమానిస్తూ వచ్చిన రచయిత ఆయన నాటక సాహిత్యం పట్ల ఎంతోమంది చేసిన పరిశోధనల్లో వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలనూ ఖండిస్తూ సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన పుస్తకాన్ని వెలువరించాలనే చిత్తశుద్ధితో ఈ గ్రంథం రచించారు. ఆత్రేయతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ఆయన ద్వారా, ఆయన సహధర్మచారిణి పద్మావతి ద్వారా తెలుసుకున్న అనేక విషయాలను ఈ గ్రంథంలో యథాతథంగా పొందుపరిచారు.
మొత్తం తెలుగు నాటక రంగంలో స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం వచ్చిన మార్పులను కూడా ప్రస్తావిస్తూ 1940లో నాటి నాటక రంగం గురించి ఆనాటి నాటక రచనలు, రచయితలు, నాటక సమాజాలు, నాటక ప్రదర్శనలు కూడా ఇందులో వివరంగా పొందుపరిచారు.
ముద్రణకు నోచుకోని ఆత్రేయ రాసిన పది నాటకాలను, రచనా కాలాన్ని, రచనావస్తువులను కూడా పైడిపాల ఇందులో భద్రపరిచారు.
ఆత్రేయ తన రచనల్లో స్వీకరించిన కథావస్తువులు, పాత్ర చిత్రణ, రచనా సంవిధానం, నాటకాల్లో మధ్యతరగతి జీవితాల సమస్యలను, సంఘర్షణలను ఇతివృత్తాలుగా స్వీకరించడం ఆత్రేయతోనే ప్రారంభమైందని చెప్పారు. నిత్యజీవితంలో తారసపడే సన్నివేశాలు, ఆలోచింపచేసే పదునైన సంభాషణలు, విసుకుకు తావులేని నాటక వేగం ఆత్రేయ నాటకాల్లోని ప్రత్యేకతలు అంటారు ఈయన.
ఆత్రేయ నాటకాల్లో కనిపించే వస్తు స్వీకరణలో వైవిధ్యానికి, విస్తృతికీ అతని నాటకాలన్ని ప్రత్యక్షసాక్షులు.. అద్దెఇళ్లలో మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు, మేధావుల్ని ప్రలోభపెట్టి, వారి మేధాశక్తిని సొంతం చేసుకునే ధనిక వర్గం దౌర్జన్యాలు, మత దురహంకారంతో సాగుతున్న మారణహోమాలు, వరకట్న దురాచారాలు, నిజాయితీపరులకు గుర్తింపులేని నీచ రాజకీయాలు, హేయమైన ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగుల కడగళ్లు, దొరలకంటె దుర్మార్గులైన దొరల దోపిడీ ఇలా వివిధ సమకాలీన సాంఘిక సమస్యలకు స్పందించి రచనలుచేసిన ఆత్రేయ నాటక రచయితల సామాజిక బాధ్యతను గుర్తుచేసారు. ముఖ్యంగా ఆత్రేయ శాంతికాముకుడు, శాంతి, గౌతమబుద్ధ, అశోక సామ్రాట్, విశ్వశాంతి, ప్రగతి వంటి నాటకాలన్నిటిలో శాంతి ఒక్కటే మానవ కళ్యాణానికి సాధనమని నిరూపించారు.
ఇందులో అనేక పత్రికలలో రచయిత ఆత్రేయని స్వయంగా పరిచయంచేసిన వివరాలు పొందుపరచబడ్డాయి. ఆత్రేయ భగ్నప్రేమ, ఆ ప్రేమ కలిగించిన బాధ ఆయన కవిత్వంలో వ్యక్తమైన తీరు, ఆయన వివాహం, ఆయన భార్యకి చేసిన అన్యాయం పట్ల ఆవేదన అన్నీ ఎంతో చక్కగా రాశారు రచయిత.
భవిష్యత్తులో ఆత్రేయ నాటక సాహిత్యంపైన పిహెచ్‌డి చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుందీ గ్రంథం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

-అత్తలూరి విజయలక్ష్మి