అక్షర

రాష్ట్ర ఆవిర్భావం... ఒక మైమరపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త చరిత్ర (తెలంగాణ రాష్ట్రం- అస్తిత్వ చైతన్యం)
బి.ఎస్.రాములు
నవచేతన పబ్లిషింగ్ హౌస్,
వెల: రు.200/- పేజీలు: 303.
**
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ళలో అది ప్రజల్లో కలిగించిన ఆశలు, ప్రభుత్వం నూతన ప్రణాళికలతో ముందుకు సాగిన తీరు, అడ్డంకులను ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఎప్పటికప్పుడు పత్రికల్లో రాసిన వ్యాసాల సంపుటి ఇది. ఈ వ్యాసాల్లో రాష్ట్ర ఆవిర్భావ, ఆనంద పారవశ్యం వుంది. తెలంగాణ దృష్టికోణం వుంది. తెలంగాణ అవసరాలు వున్నాయి. తెలంగాణ అభివృద్ధికి సూచనలు వున్నాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు వున్నాయి. భవిష్యత్ తెలంగాణ కర్తవ్యాలున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతోపాటు, తక్షణ అవసరాల ప్రాధాన్యత వుంది. బంగారు తెలంగాణ స్వప్నం సాకారంకోసం ఎలా ముందుకు సాగాలో, అన్ని వైపులనుండి, అన్ని రంగాలకు సూచనలు- ప్రతిపాదనలు అన్ని కోణాల్లో ఎంతో అవసరం అని భావించిన రచయిత, తనకు తెలిసిన-తెలియని అనేకానేక అంశాలను గుదిగుచ్చి పెద్దపెద్ద జాబితాలు తయారుచేసి ముఖ్యమంత్రికి అందజేశారు. కుదరనప్పుడు పత్రికలకు ఇచ్చారు. అలా ‘‘తెలంగాణ భాషలో పాఠ్యపుస్తకాలు’’ పేరిట 21 వివరణాత్మక ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే ‘‘తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి’’కి సూచించిన 19 ప్రతిపాదనలు కూడా వున్నాయి. ఇందులోని అంశాలనే తీసుకుని విడివిడిగా చర్చించిన వ్యాసాలున్నాయి.
ఈ వ్యాసాలను చదువుతుంటే సామాన్యుడిలా కోర్కెల చిట్టాను విప్పుకుంటూ పోవడమే కనిపిస్తుంది తప్ప ఒక మేధావిలా కానీ, తత్త్వవేత్తలా విశే్లషణ కానీ, దూరదృష్టి కాని, ఆచరణయోగ్యమా అని కాని ఆలోచించలేకపోవడం ఆశ్చర్యం. రచయిత సూచించిన ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వమే కాదు, దేశంలోని ఏ ప్రభుత్వము కూడా అమలుచేయడం సాధ్యంకాదు. చివరకు రచయిత స్వయంగా గద్దెనెక్కినా అతను కూడా అమలుపరచలేడు. ప్రతిపాదనల పేరిట రచయిత ఇచ్చిన ఉచిత సలహాలు ఈ పుస్తకం నిండా వున్నాయి. మచ్చుకు:
‘‘ఏటా కనీసం నూరు కిలోమీటర్ల రైల్వేలైను స్వయంగా ఏర్పాటుచేసుకోవాలి. అందుకు వెయ్యి కోట్లు చాలు’’ (పే.22) అంటున్నారు. అవి ఎక్కడినుండి తేవాలో చెబితే బాగుండేది.
‘‘ఇరవైవేల కోట్లతో పది లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమిని కొని పేదలకు ఇవ్వవచ్చు. ఇలా అయిదేండ్లు చేయాలని (పే.102) సూచిస్తాం.
తెలంగాణ సినిమాలు తీయడానికి గాను చిత్రానికి రెండు కోట్ల రూపాయల చొప్పున ఏటా యాభై చిత్రాలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించమంటున్నారు. కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా వినోదపు పన్నును మినహాయించాలి’’ (పే.107) అని కూడా సూచిస్తాం.
లోటు బడ్జెట్‌లో మునిగిపోయి, రాష్ట్రోద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోవున్న ప్రభుత్వానికి- వారు సూచించిన ప్రతిపాదనలకు గాను నిధుల సేకరణ, డబ్బు ఎలా సేకరించుకోవాలో రచయిత సూచిస్తే, ప్రభుత్వానికి మహోపకారం చేసినవారవుతాం. పైగా రచయిత సూచించిన ప్రతిపాదనలలో మద్యపాన నిషేధం కూడా వుంది. ప్రభుత్వాలే ఆబ్కారీ ఆదాయం మీద నడుస్తున్నప్పుడు మద్యపాన నిషేధం ఆత్మహత్యా సదృశ్యమే కదా! ఇక ‘‘రిజర్వేషన్ల గురించి కొత్తగా ఆలోచించడం అవసరం’’ అంటూ ‘‘రిజర్వేషన్లకు క్రీమిలేయర్ ఆదాయ పరిమితి అన్నివర్గాలకు వర్తింపజేయాలి’’. ‘‘రిజర్వేషన్ వ్యతిరేకులను జాతి వ్యతిరేకులుగా, నేరస్థులుగా, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వంటి కేసులను, నాన్ బెయిలబుల్ కేసులను నమోదుచేయాలి’’ అంటారు. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఈ రెండు సలహాలు చాలు. రచయిత ఎలాగూ బి.సి. కమీషన్ ఛైర్మన్ అయ్యారు కాబట్టి వారు సూచించిన ప్రతిపాదనలు అమలుచేయాల్సిన బాధ్యత ఆయన పైనే వుంది.
ఇక మూడవ భాగంలో ‘‘తెలంగాణ తల్లి-రూపకల్పన చరిత్ర’’ వివరిస్తారు. తెలంగాణ రచయితలు ఎలా వుండాలో- వుండకూడదో చెబుతూ ఏమిరాయాలో- ఏమి రాయకూడదో వివరిస్తూ, వాళ్ళ మైండ్‌సెట్ మార్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు. తెలంగాణ తెలుగు వాచకాలు ఎలా వుండాలో ఒక వ్యాసం, తెలంగాణ రాష్ట్రం రూపొందించిన తెలుగు వాచకాల విశిష్టతను ఇంకో వ్యాసంలో తెలియజేశారు. అలాగే ‘తెలంగాణ చరిత్ర రచనలో లోపాలు’ను వివరించే వ్యాసం కూడా వుంది.
కేసిఆర్ దార్శనికతను కొనియాడడం నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది. కేసిఆర్ విజన్‌లో అనేక అంశాల సమగ్ర పరిశీలన కనబడుతుందంటూ తెలంగాణ రూపురేఖలు మార్చే ఇరిగేషన్ విభజనను ప్రస్తుతించడం కొన్ని వ్యాసాల్లో కనిపిస్తుంది. ఉపాధి కల్పించే తునికాకు, పొగాకు, బీడి పరిశ్రమలకు అపాయం తేవద్దంటారు. వీటితోపాటు న్యాయవ్యవస్థ, ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు, సంపద పంపిణీ, వృత్తివిద్య, సహకార రంగం అభివృద్ధికి సూచనలిస్తారు. సంచార ఉద్యమాలు, సహకార కుల సంఘాలు, అకాడమీల ఆవశ్యకతను తెలియజేస్తారు. ఇలా అన్నిరంగాల్లో నూతన దిశా నిర్దేశనంచేస్తూ ఈ క్రాంతిదర్శిత్వంతో ఇలాగే కొనసాగితే బంగారు తెలంగాణ సాకారం కావడం ఎంతో దూరంలో లేదని తమ ఆశాభావాన్ని వెల్లడిస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిస్థాయిలో సాధించుకోవాల్సిన కర్తవ్యాలు ఇంకా మనముందు సవాలుగా నిలిచి వున్నాయి. ఇవి వదిలి సందు దొరికింది గదా అప్పుడప్పుడే నడక నేరుస్తున్న మన స్వంత ప్రభుత్వాన్ని మనమే విమర్శించడం కర్తవ్యాన్ని వదిలేసిన పలాయనవాదమేనని హెచ్చరిస్తారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరిగింది? ఏం ఒరిగింది’’అని అడిగితే ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆత్మగౌరవం పెరిగింది. ఉద్యమాలతో ఏదైనా సాధించవచ్చు అనే ధైర్యం పెరిగింది. ఒక జాతిగా, ఒక రాష్ట్రంగా దేశంలో తలెత్తుకొని నిలబడి మాది తెలంగాణ రాష్ట్రం అని నినదించే సాధికారత వచ్చింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంకా సాధించడానికి కంకణం కట్టుకుందాం అంటున్నారు. మొత్తానికి తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ చేయలేని పనిని ఈ రచయిత తన వ్యాసాల ద్వారా చేయగలిగారు. ప్రభుత్వంవారు రచయిత సేవలను ఆ రంగంలోనే వినియోగించుకుంటే ఇంకా బాగుండేది.
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-కె.పి.అశోక్‌కుమార్