అక్షర

పెనుకొండపై ప్రామాణిక పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ ప్రాచీన చరిత్ర
(పరిశోధన)
-కరణం సత్యనారాయణరావు
వెల: రు.50/-
ప్రతులకు: శ్రీమతి కె.త్రిపుర, 4-2-235 డి.బి.కాలనీ
హిందుపురం- 515201. (ఎ.పి.)
**
రాయలసీమలోని ఒక ప్రాచీన నగరం పెనుకొండ. దీనికే ఘనగిరి అని సంస్కృత నామము. విజయనగర సమ్రాట్టులకు హంపీ విజయనగరంతోబాటు పెనుకొండ కూడా రాజధానిగా ఉండేది. దీనిపై లోగడ కొన్ని పరిశోధనా వ్యాసాలు వచ్చాయి. తగిన శిలాశాసనాధారాలు కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు కరణం సత్యనారాయణరావుగారు పెనుకొండ ప్రాచీన చరిత్ర అనే పేరుతో ఒక చారిత్రక పరిశోధనాగ్రంథం వెలువరించటం ముదావహం. ఇందులో వారు నగర చరిత్ర విజయనగర రాజుల కాలమునాటి సంఘటనలు విరుపణ్ణ, తిమ్మరుసుల కథ, ఇంకా స్థల పురాణాలు, ఆనాటి న్యాయవ్యవస్థ పాలనావ్యవస్థ దేవాలయాలలో కోటల నిర్మాణం వంటి అంశాలతోబాటు లేపాక్షి కదిరి వంటి సంబంధిత చరిత్రలను కూడా ఇందులో చేర్చారు. ముఖ్యంగా పెనుకొండకు సంబంధించిన శాసన పాఠాలు ఇచ్చి అందలి పదాలకు విడిగా అర్ధములు ఇచ్చారు. ఈ గ్రంథ రచనకు వారు ప్రామాణిక చరిత్రకారుడైన ఓరుగంటి రామచంద్రయ్య, మెకంజీ కైఫీయత్‌లు, చిత్రదుర్గ జిల్లా నెర్లకెర తామ్ర శాసనములు న్యూఢిల్లీ ప్రచురణ బట్టర్‌వర్త్. వేణుగోపాలాచార్యగారి శాసన సంపుటాలు- ఇలా ఎనె్నన్నో రచయితలను సంప్రదించారు. ఇటీవలి కాలంలో పెనుకొండపై వచ్చిన రచనలలో ఇది తలమానికమైనదని చెప్పవచ్చు. శ్రీ ఆశావాది ప్రకాశరావు ఈ గ్రంథానికి తిలకం దిద్దుతూ ‘‘గురువరణీ ముడుపత్తి’’అని ప్రశంసించటంలో అతిశయోక్తిలేదు. పెనుగొండ రాజ్యానికి ఉత్తరాన పెన్నంబడి దక్షిణాన టెంకణము ఉన్నది. ననె్నచోడుడు టేంకణాదిత్యుడు అని గుర్తుండే ఉంటుంది. అనంతపురంలోని గిరిదుర్గాలల్లో పెనుకొండగల ప్రాధాన్యము విజయనగర రాజ్యపాలనలో పెరిగింది. కోటలో మనకు కన్నడ శాసనాలూ లభించాయి. 1354 బుక్కరాయలు వేయించిన శాసనము, శాతవాహన శకం 1276నాటి మరొక శాసనం క్రీ.శ.1544లో సదాశివరాయల కాలానికి చెందిన శాసనం 1577 శ్రీరంగరాయలు వేయించిన శాసనం ఇత్యాదులు ఉన్నాయి. క్రీ.శ.1359 శాసనం ప్రకారం జైన సాధువు మండలాచార్య మాఘనంది సిద్ధాంతి దేవర శిష్యుని వృత్తాంతం తెలుస్తున్నది. అంటే ఇక్కడ జైనం శైవం వైష్ణవం సహజీవనం చేశాయి అని అర్థం.
అళియరామరాయలు వేయించిన తామ్రశాసనం చారిత్రకంగా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కృష్ణరాయల నిర్యాణం వివరాలు దీనివలన లభిస్తున్నాయి.
కుందుర్తి ఈశ్వరదత్తు పుట్టపర్తి నారాయణాచార్యులవారి పరిశోధన ఇత్యాదులు ఈ రచయిత చక్కగా సంప్రదించారు. పుట్టపర్తివారి పెనుకొండ లక్ష్మి కవిత అందరికీ తెలిసిందే కదా! ఇక కొడాలి ఆంజనేయులుగారి ‘శిలలు ద్రవించి ఏడ్చినవి వంటి పద్యములు ఎంతో ప్రసిద్ధమైనవే.
పణ్యారాలు= నైవేద్యానికి ఉంచిన పదార్థములు/ పరివార దేవగళ్లు= ప్రధానాలయం చుట్టూ ఉన్న చిన్న దేవాలయములు/ తిరువారాధన= దేవతార్చన/ దివ్యాంగంభం= దీపస్తంభము/ దొరురెల్లు= ఊటబావి/
పోలిఉటు= గుడులకు మఠాలకు ఏర్పరచిన స్థితి/ ఇత్యాదులు. రాయలు గుర్రముపై పయనించేటప్పుడు గుర్రము బెదిరింది. అప్పుడు రాజుగారికి గొడుగు పట్టే గోపాలుడు రక్షించాడు. అందుకు ప్రతిఫలంగా అతడు ఒక రోజు విజయనగర సామ్రాజ్య పాలన కోరాడు. ఈ వృత్తాంతం విచిత్రంగా ఉన్నప్పటికీ పెనుకొండలోని గోరంట్ల గణపతి దేవాలయ శాసనం ద్వారా తెలుస్తున్నది.
కరణం సత్యనారాయణరావుగారు చేసిన పరిశ్రమ వ్యర్థం కాకుండా దీనిని అన్యభాషలలోనికి అనువదింపవలసి ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అధ్యాపకులకు కూడా ఇది విజయనగర రాజుల చరిత్ర తెలుసుకునేందుకు చిన్న కరదీపికగా ఉపయోగపడుతుంది.

-ముదిగొండ శివప్రసాద్