అక్షర

భయాన్ని అర్థం చేసుకోండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయం
ఓషో రచన
వెల: రూ.180 లు
విశాలాంధ్ర బుక్ హౌస్
నవచేతన పబ్లిషింగ్ హౌజ్,
బుక్ సెలక్షన్ సెంటర్
**

జీవితానికి అర్ధం, పరమార్ధం తనదైన కోణంలో ఆవిష్కరించి మానవ సహజమైన బలహీనతలను ఎలా జయించాలి, ఎలా జీవితంలో ముందుకు సాగిపోవాలి, ఎలా గమ్యాన్ని చేరాలి? అసలు మనిషి గమ్యం ఏవిటి? అనే విషయాలను ఎంతో చక్కగా వివరిస్తూ ప్రతి మనిషికీ దిశానిర్దేశం చేయగలిగిన ఒక గొప్ప తత్వవేత్త ఓషో.
జీవితం అంటే మమకారం, జీవితం అంటే భయం, జీవితం అంటే ఆరాటం, జీవితం అంటే ఆట, జీవితం అంటే పోరాటం అనుకుంటూ ఎన్నో బంధాలను తగిలించుకుని, బాధ్యతలను మోస్తూ, ఆనందాలకు, మోహాలకు వశమైపోతూ, అష్టకష్టాలు ఎదురైనా అధిగమిస్తూ, పోరాటం సలుపుతూ, విజయంకోసం తపిస్తూ, ఆరాటంతో, ఆవేశంతో, ఆగ్రహంతో, జీవన పోరాటం చేసే వాళ్లకి ఓషో బోధలు అసలు జీవితం అంటే ఏంటి అనే వాస్తవాన్ని తెలియచేస్తాయి.
సాధారణంగా మనిషి పుట్టిన దగ్గర్నించి పోయేవరకూ అనేక రకాల భయాలతో పెరుగుతూ, ఎదుగుతూ సాగిపోతూ ఉంటాడు. జననం భయం, జీవితం భయం, మరణం భయం. ఆ భయం యొక్క విశ్వరూపాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తాం.
భయాన్ని అర్ధంచేసుకోండి., మృత్యు భయం మూలాలు అనే్వషించండి, అనిశ్చితి, అజ్ఞాతాలే నమ్మకంలోని మర్మం, ప్రేమించండి భయపడకండి, నిర్భయత్వానికి దారి వెతకండి అంటూ వెన్నుతట్టి ధైర్యాన్నిస్తాడు. భయం అంటే ధైర్యానికి మృత్యువు అంటాడు ఓషో.. కొండ అంచున ఉన్న కనుమదారిలో నడుస్తున్న ఒక వ్యక్తి కాలుజారి లోయలో పడిపోతూ చేతికి దొరికిన కొండ అంచునే ఉన్న చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కిందికి చూడగా ఎక్కడో పాతాళంలోఉన్న అగాధం అతనికి లీలగా కనిపించింది కానీ, కాళ్లకింద ఉన్న బండరాయి చీకట్లో కనిపించలేదు. అతను ప్రాణభయంతో రక్షించమని కేకలువేసినా ఎవరూ రక్షించేనాధుడు కనిపించలేదు. రాత్రంతా అలాఉండిపోయిన అతను తెల్లవారి వెలుగులో కిందకు చూడగా అతని కాళ్లకు ఆరు అంగుళాల కింద పెద్ద బండరాయి కనిపించింది. ఈ సంఘటన ప్రస్తావిస్తూ భయం లోతు కేవలం ఆరు అంగుళాలు మించి ఉండదని చెబుతూ భయం అనేది మనిషిని కర్తవ్య విమూడిడిని చేస్తుందని, భయం వదిలేస్తే ఎవరైనాసరే ఏ ఆధారంలేకున్నా హాయిగా జీవించగలరని చెప్తాడు ఓషో.
అందుకే భయాన్ని అర్ధంచేసుకోమన్నాడు. భయం నీడలాంటిదని, నీడకు ఉనికిలేకపోయినా ఎలాఅయితే మనతో ఉంటుందో భయంకూడా అలాగే ఉంటుందని చెప్తాడు. పసితనంలో ముద్రపడిన భయాలన్నీ జీవితాంతం కొనసాగుతాయి కాబట్టి, భయాన్ని జాగ్రత్తగా గమనించి, దానిని వదిలించుకోండి. అప్పుడే మీరు అసలైన దారిలోకి వచ్చినట్లు అసలైన ఉత్సవ ప్రయాణం ప్రారంభమైనట్లు.. జీవితాన్ని ఆనందిస్తే భయం అదృశ్యమవుతుంది లేకపోతే భయం మొదలవుతుంది.. భయం మిమ్మల్ని నూతన జీవన విధానాలను, నూతన శక్తిమార్గాలను, నూతన ప్రదేశాలను, నూతన దిశలను తెలుసుకోనివ్వకుండా, మళ్లీమళ్లీ పాతదారిలోనే రవాణా రైలుమాదిరిగా ముందుకు, వెనక్కి వెళ్లేలా చేస్తుంది. ఎక్కడికి వెళ్లినా, ఏమిచేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీకు హాయి దక్కుతుందని అంటాడు.
బాధలను అంగీకరిస్తే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఎలాంటి బాధలనైనా అంగీకరించి, అనుభవించటానికి సిద్ధపడమంటాడు. ఒక సమస్యను మీరు అంగీకరిస్తే అది అదృశ్యమవుతుంది. దానితో మీరు ఘర్షణపడితే అది మరింత జటిలమవుతుంది.. జీవించేందుకు రెండు మార్గాలే ఉన్నాయి ఒకటి ప్రేమిస్తూ జీవించడం, మరొకటి భయపడుతూ జీవించడం, ప్రేమమార్గం తెలుసుకునేదాకా భయం దారిలో బతకాల్సిందే అంటారు. అలాగే ప్రేమ గురించి చెబుతూ తన గురించి తను తెలుసుకునేందుకు ప్రేమే ఉత్తమమైన మార్గం అంటాడు ఓషో. సత్యం ఒకటే అసత్యాలు అనేకం అసత్యాన్ని అనేక రకాలుగా చెప్పచ్చు కానీ సత్యాన్ని అనేకరకాలుగా చెప్పలేరు సత్యం సహజమైనది దానికి ఒకే ఒక మార్గం చాలు, అసత్యం అసహజమైనది అందుకే దానికి అనేక మార్గాలు అవసరం, జీవితం ఉత్సవమైతే మరణం అంతకుమించిన అంతిమ వేడుక అవుతుంది అంటారు. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు. కాబట్టి కాలాన్ని వృధాచేయకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి అంటాడు చివరలో..
ఈ నవలని అనువదించిన భరత్ అక్షరం సత్యమైతే మాట వేదమవుతుంది, మనిషికి జ్ఞానోదయమైతేనే అక్షరం సత్యమవుతుంది. ఇలా ప్రతి అక్షరంలో సత్యాన్ని నింపి ప్రతి మాటను వేదం చేసిన మహనీయుడు ఓషో, ఆ వేదంలోకి ఒక జ్ఞాన తుషారమే ఈ గ్రంథం అన్నాడు భరత్..

-అత్తలూరి విజయలక్ష్మి