అక్షర

ప్రేమం శరణం గచ్ఛామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌందరనందము
పింగళి లక్ష్మీకాంతం,
కాటూరి వెంకటేశ్వరరావు;
వెల: రూ.70/-;
దొరుకుచోటు: నవచేతన,
విశాలాంధ్ర, ప్రజాశక్తి,
నవ తెలంగాణ
బుక్‌హౌసులలో
**
గౌతముడు బుద్ధుడుగా మారాక కపిలవస్తు వస్తాడు. తల్లిదండ్రులు అతనికి శిష్యులై బౌద్ధం స్వీకరిస్తారు.
బుద్ధుని తమ్ముడు నందుడు. అతని భార్య సుందరి. వాళ్లు పరస్పర ప్రణయైక జీవనులు.
నందుడు అన్నగార్ని గౌరవపురస్సరంగా కలిస్తే, ఆయన అతనికి దీక్ష ఇస్తాడు. సుందరి నందుని ఎడబాటు సహించలేక తనకీ దీక్ష ఇమ్మంటుంది. బుద్ధుడు సరేనంటాడు.
ఒక దళిత బాలుడు అవసాన దశలోని తన తల్లిని చూడ్డానికి సుందరిని తీసికెళితె, అక్కడ నందుడు కలుస్తాడు. ఒకరినొకరు తమిదీరా చూసుకునేంతలో బుద్ధుడు వచ్చి సుందరి చేతిని ధర్మసోదరిగా నందుడి చేతిలోనూ, నందుడి చేతిని ధర్మసోదరుడిగా సుందరి చేతిలోనూ ఉంచి ఆశీర్వదిస్తాడు. ఇదీ కథ.
ఈ మాత్రం కథను 345 పద్యాలతో పఠితలకి రసానందం కలిగించేలా మలచారు పింగళి, కాటూరి జంట కవులు. నందుడు దీక్ష స్వీకరించాడన్న వార్త విన్న సుందరి మానసిక కల్లోలం, సుందరికి దూరం కావలసి వస్తుందన్న నందుడి మానసిక సంఘర్షణా ఆర్ద్రంగా చిత్రించారు.
‘‘బుద్ధిగతమైన పెనుభక్తి ముందులాగ/ వెలదిపై రక్తిలాగె వెనె్వనుకకతని/ ఊర్మికల మధ్య హంసనా నొప్పెనపుడు/ నిశ్చయమ్మున కదలక నిలువకతడు’’అంటారు. ‘‘కలయ నల్దెస పన్ను వలజిక్కి బయటకు/ ఉరికి పారదలంచు ఉడుతవోలే’’ఉన్నదట నందుడి అప్పటి పరిస్థితి. ఉడుతను ఉపమానంగా చెప్పడంలో మంచి సహజోక్తి ఉంది. ఉడుత కదలికల్ని గమనిస్తే అది మామూలుగా గూడా ఏదో హడావిడిలో ఉన్నట్లు అటూఇటూ దుముకుతుంటుంది. ఇక వలలో చిక్కితే చెప్పాలా?
ఇక తనను భర్తనుండి బుద్ధుడు వేరుచేశాడన్న దుఃఖంలో సుందరి బుద్ధుణ్ణి ఉద్దేశించి ఇలా అనుకుంటుంది.
‘‘కాలముచెల్లి పశ్చిమ ముఖమ్మున ప్రాయపు ప్రొద్దొకింతలో వ్రాలగలనున్న పెద్దల’’కు నీ ధర్మమార్గం ఉపదేశించు, బాగుంటుంది. కాని ఇదేంటి ‘‘మొగ్గను కోయుట పిందె త్రుంచుటల్’’ న్యాయమా’ అని తన ఎదుట లేని సిద్ధార్థుణ్ణి నిలదీస్తుంది. నీకు స్వాగతం పలకలేదన్న కోపం ఒకవేళ ఉంటే,
‘‘పిట్టలుగా మృగములుగా/ పుట్టుండని శాపమిచ్చి పోగూడదొ/ మేమట్టే జంటం బాయక/చెట్టులు పుట్టలనుబట్టి జీవింతుముగా’’ అంటూ వాపోతుంది.
అక్కడ నందుడుగూడా అన్నతో మొరబెట్టుకుంటాడు. ‘ప్రణయమాధురి గ్రోలిన బ్రతుకు దివసమాత్రమేనియు చాలు, ప్రేమమ్ములేమి కన్న నిప్పచ్చరము వేర కలదె దేవ!’అని బుద్ధుణ్ణి ప్రశ్నిస్తాడు.
దానికి సమాధానంగా బుద్ధుడు బౌద్ధ్ధర్మం వివరిస్తాడు.
‘‘ఉన్మాదముగాక ప్రేమమగునా పరువంపు నిగారపుం బసల్?’’ అంటాడు.
‘పరువమిది నీకు మాత్రము తిరమటోయి?’ అంటాడు.
‘‘కామవికార మించుకయు కల్గదయేని, కుమార చెప్పుమా/ ప్రేమకు నాటపట్టయిన ప్రేయసికై ఇటులేల పొక్కెదో?’’ అని గూడా అంటాడు.
తరువాత వ్యక్తిగత ప్రేమకన్నా, జీవకారుణ్యం ఎలా గొప్పదో వివరిస్తాడు.
‘‘ప్రేమ తలపులు మొదలంట త్రెంపుమనుచు/ హృదయసూనమ్ము త్రుంచుమంచే వచింప/ ప్రేమ శూన్యము కాదొయి భిక్షుగణము/ జీవకారుణ్యమే మాకు జీవగర్ర’’ అని ప్రబోధిస్తాడు.
చివరి సర్గలో సుందరీనందుల్ని ఒకరి చేతిలో మరొకరి చెయ్యి ఉంచి ధర్మసోదరిగా సుందరిని నందుడికీ, ధర్మసోదరుదిగా నందుణ్ణి సుందరికీ అప్పగిస్తాడు.
ఈ సందర్భంలో ఆ కాలంలో రాయప్రోలు ప్రవచించిన ‘అమలిన ప్రేమ- ప్లెటోనిక్ లవ్’ను బౌద్ధసమాజపు విశ్వప్రేమతో ముడిబెట్టడానికి రచయితలు ప్రయత్నించినట్లు తోస్తుంది. (నిజానికి ఎన్నో శతాబ్దాల పూర్వమే భవభూతి ఉత్తర రామచరిత్రలో సీతారాముల అలౌకిక ప్రణయాన్ని.
‘కిమపి కిమపి మందం మందమాసక్తియోగాత్/ అవిరల కపోలం జల్పతేరక్రమేణ/ అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణోః/ అవిదిత గతయామా రాత్రిరేవం వ్యరంసీత్’’అని వర్ణించాడు) బహుశా సీతారాముల అలౌకిక ప్రణయాని, బౌద్ధ్భిక్షువుల విశ్వప్రేమతో అనుసంధానించడానికేనేమో, ఈ సర్గ ప్రారంభం ‘‘అద్వైతం సుఖదుఃఖమోః’’అనే భవభూతి శ్లోకంతో ప్రారంభించారు.
ఒక వంక విప్రలంభప్రణయాన్నీ, మరోవంక నిర్వాణ సోపానాల్నీ సమానమైన ప్రతిభతో నిర్వహించిన పింగళి కాటూరి కవీంద్రులు, ఈ కావ్యం ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక అమూల్యమైన అలంకారాన్ని సమకూర్చారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ‘పింగళి కాటూరి ముంగరుల్ సవరింప’ అని కరుణశ్రీ అన్నట్లు, ఈ కావ్యం ఆంధ్ర కవితాకుమారి ముంగురులు సవరించినంత సుకుమారంగా ఉంటుంది, అని ఘంటాపథంగా చెప్పొచ్చు.

-నిశాపతి