అక్షర

జీవన గమనానికి అద్దం పట్టిన ‘సమాంతర రేఖలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సమాంతర రేఖలు’
ఉదయం (నవలలు)
పసుపులేటి మల్లికార్జునరావు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
’60-70 దశకంలో పాఠక లోకంలో ప్రాచుర్యం పొందిన రచయితల్లో పసుపులేటి మల్లికార్జునరావు ఒకరు. తన 16 ఏళ్ల వయసులోనే ఈ నవల ‘సమాంతర రేఖలు’ని రాశారు. తన ముందు మాటలో చెప్పుకున్నట్టు ‘జీవితాన్ని గురించి చిత్రమైన అభిప్రాయాలూ, సిద్ధాంతీకరణలూ, నిర్వచనాలూ వుండే వయసు నుంచీ; బరువు బాధ్యతలని యోచించని మెదడు నుంచీ నిజ జీవితాన్ని ఎరుగని ఆలోచనలనుంచి-ఈ నవల వచ్చింది’. రచయిత అనుభవ నేపథ్యం రచనకు ప్రేరణగా నిలుస్తుంది. వనారంభ దశలోని ఆకర్షణల ప్రభావం, ఆదర్శాల ఆరాధన ప్రచోదనం ఈ రచనలోన కనిపిస్తాయి. సమాజ నేపథ్యంలో మనిషి సమగ్ర జీవన చిత్రణ మంచి నవలలో కనిపించాలంటారు. వస్తువు, ఇతివృత్తం, నిర్మాణం, పాత్ర చిత్రణ, వర్ణనలు, వాతావరణం, కథనం వంటివి విశే్లషణలకి అందాలని అంటారు. అయితే పత్రికల్లో వచ్చే సీరియల్‌లో వీటన్నింటి సాంద్రతని, గాఢతనీ ఒక స్థాయిలో మించి ఆశించలేము. ‘సమాంతర రేఖలు’ కూడా 1966-67లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది.
నవలలో ఇతివృత్తాన్ని చూస్తే-
వేణు, సునీత కాలేజీలో సహాధ్యాయులు. చిత్రమైన పరిస్థితుల్లో వేణుకి సునీతపట్ల ప్రేమ జనించింది. ఆ ప్రేమ ఆరాధనగా గాఢతరమైంది. కథాక్రమంలో ఆమె ‘ నా ఆరాధ్య దైవం-నా ప్రభువు-నా స్వామి-అన్నీ మీరే అని (చాకుతో వేణు మణికట్టు మీద గాయంచేసి)రక్తంతో అతని డైరీలో రాసింది. కథ ఇంకా ముందుకు సాగిన తర్వాత ఆమె ఉన్నత వ్యక్తిత్వంతో, ఆదర్శప్రేమ మూర్తిగా రూపు దిద్దుకుంటుంది. చివరికి వేణును- రాధకోసం త్యాగం చేసి వెళ్లిపోతుంది. వీరిచుట్టు అల్లుకున్న కథలో అనేక పాత్రలు, అనేక మలుపులు, అర్థాలూ, అపార్ధాలూ, అనర్ధాలూ, పశ్చా త్తాపాలూ, ఆశ్రమం.. వస్తాయి. బరువైన సన్నివేశాలతో, సంభాషణలతో, వ్యాఖ్యలతో ‘రాధలో సునీతను చూసుకోండి, మీరు ఉన్నారు నేను లేను’ అంటూ రాసిన సునీత ఉత్తరంతో ఆ నవల ముగుస్తుంది. కథనంలోని ఉత్కంఠ నిర్వహణ ఎంతో నైపుణ్యంతో సాగడంవలన నవల పత్రికా పాఠకుల ఆదరణని పొందింది.
ఈ సంపుటిలోని రెండవ చిన్న నవల ‘ఉదయం’. ‘సమాంతర రేఖలు’ నవలకి పూర్తిగా భిన్నమైన నవల. వస్తు శిల్పాలు రెంటిలోను రచయిత మేధాపరిణితిని ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఎంతోగొప్ప నవలా తేజోరేఖ-ఈ ‘ఉదయం’. లక్ష్మీపతి అనే వ్యాపారవేత్త పాత్రద్వారా -మనిషి కేవలం బతుకుతు వుండడానికీ, జీవించటానికీ మధ్యన గల భేదాన్ని, అతని అంతస్సంఘర్షణలనీ, సమాజంలోని తన పరిచితులతో అతని బాహ్య సంఘర్షణలని-స్పష్టమైన నేపథ్యంతో, ప్రకాశవంతమైన కేన్వాస్ మీద చిత్రించిన సామాజిక, మనస్తాత్విక నవల ఇది. భార్య గురించి అతననుకుంటాడు, ‘ఆకర్షణ ఏనాడో లుప్తమైపోయింది. ఒకర్నొకరు స్నేహం గా, ప్రేమగా పలకరించుకునే ఓపికల్లేవు. తనకు తన వ్యాపారాలు, ఆమెకి మహిళా సంక్షేమాలు, ఉపన్యాసాలూ, ఫోటోలు... భార్యభర్తలమన్నదానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. అంతే. ఏమీ లేదిక!’ అని. అలా, జీవితంలో వెలితిని అనుభవిస్తూ తన స్వభావ సిద్ధమైన స్ర్తి వాంఛాలౌల్యం వలన టైపిస్ట్ గ్రేసీ పట్ల శాడిజంతో, గర్వాహంకారాలతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఆమె తన భర్తకి బ్లడ్ కేన్సర్ అని, ఆ కారణాన అడ్వాన్స్‌ల్ని తీసుకోవాల్సి వస్తున్నదనీ చెప్పినా ఆమెపట్ల ఉదారత చూపలేడు. చివరికి ఆమె భర్త మరణించిన మర్నాడు తానూ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన ఉత్తరం లక్ష్మీపతిని, అతని మనస్తత్వాన్నీ తీవ్రమైన కుదుపునకు గురి చేస్తాయి. ఆమె రాస్తుంది, ‘మీ మనసులో మెదిలే కోరిక అర్థం చేసుకున్నాను. కానీ సర్ నేను అశక్తురాలిని. ఎందుకంటే ఈ శరీరం అనిల్‌ది. దీన్ని మరొకరికి అప్పగించలేను’ అని! అలా డబ్బుతో దేన్నయినా కొనగలననుకున్న అతని అహంమీద పెద్ద దెబ్బతగులుతుంది. అయితే ఆ తర్వాతి దులుపుల్లో- ‘డబ్బు ఒక్కటే నిత్యసత్యం. మనిషిని అనాదిగా నడిపే శక్తి అది. అదిలేని చోటు భూమీద లేదు. ఏదో రూపాన మనిషిని శాసిస్తుంది’ అనే సూత్రీకరణ కూడా వాస్తవజీవితంలో యధార్థమని తెలిసొస్తుంది. మానవ మనస్తత్వాల్లోని వైరుధ్యాన్ని పాత్రగతం చేసి, సంఘటనాత్మక కథన శిల్పంతో-పాఠకుల్ని ఎంతో అలజడికి గురిచేస్తూ, ఆలోచనాత్మకంగా ఈ నవలని నడిపారు రచయిత. వస్తువులో మనిషి నైజం గురించిన తాత్విక చింతన ఇమిడి వుంది. మనిషి స్వయం కృతాపరాధాల వలన ఎంతటి శూన్య భావనలో కూరుకుపోతాడో, ఎలాంటి పర్యవసానాన్ని అనుభవిస్తాడో దృశ్యమానం చేసిన విశే్లషణ ఉంది. సంక్లిష్టమైన మనిషి జీవన గమనాన్ని ఉత్తేజకరమైన రీతిలో స్పష్టం చేసిన కథనం ఉంది.

-విహారి