అక్షర

నవ్య సంప్రదాయంలో శేషేంద్రజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక మహాభారతం
-వచన కవిత-
-గుంటూరు శేషేంద్రశర్మ
వెల: రు.400/-
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
**
ఆంగ్లంలో నియోక్లాసికల్ అనే శబ్దానికి సమానార్థకంగా నవ్యసంప్రదాయ వాదం అనే పదాన్ని విమర్శకులు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పదానికి నిర్వచనం ఏమిటి? ఈ వాద పరిధిలోకి వచ్చే కవులెవరు? అనే చర్చ కొంతకాలంగా సాగుతున్నది. సంప్రదాయ విలువలు ఆధునిక సంవేదన రెండింటినీ తనలో సంలీనం చేసుకున్న దృక్పథాన్ని నవ్యసంప్రదాయం అంటారు. ఈ ధోరణికి చక్కని ఉదాహరణ గుంటూరు శేషేంద్రశర్మ. వీరి షోడశి స్వర్ణహంస చదివినప్పుడు పూర్తిగా ప్రాచీనాలంకారిక ప్రక్రియకు చెందిన విమర్శకుడు దర్శనమిస్తాడు. వీరి రచన ‘నా దేశం నా ప్రజలు’ చదివినప్పుడు ఇతడొక విప్లవ ప్రజాకవిగా కన్పడుతాడు. వర్తమాన యుగంలో భారతదేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థను ఆధారంగా చేసుకొని కొందరు ఎలా ప్రజాపీడకులుగా మారారో చూచినప్పుడు కవి హృదయం ద్రవించింది. ఓట్ల రుతువును చూచి రుతుఘోష రచించిన కవి మనసు కలవరపడింది. ఆర్థిక అసమానతలు ఎందుకుండాలి? అని కవి వేసుకున్న ప్రశ్నయే ఒక నవ భారతంగా అవతరించింది. ఇదే ‘నా దేశం నా ప్రజలు’. శేషేంద్రజాలం అంటే కేవలం పదాల గారడీ కాదు అష్టాదశ వర్ణనల పరంపర కూడా కాదు. ఇదొక అనుభూతి కవిత్వం. వాక్చిత్రాల పరంపర నూతన పదబంధాల పోహళింపు. ‘‘శ్రీనాథుడి క్రీడల్లో అల్లసాని వాడల్లో కూడా దొరకని పద ఛిత్రం- ధుమాగా ఉంది ఇమేజి- రమారమి కవుల సమాధి’’ ఈ మాటలు శేషన్ కవితపై శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యానం. ‘‘ఒక విద్యార్థి శేషన్‌వద్దకు వచ్చి నన్ను సంప్రదాయ కవిత్వం వ్రాయమంటారా? లేక అభ్యుదయ కవిత్వం వ్రాయమంటారా? అని ప్రశ్నించినప్పుడు ‘‘కవిత్వం వ్రాయి’’ అని సమాధానమిచ్చాడు శేషేంద్ర. అంటే ఈయన జీవితమంతా అకవిత్వాన్ని కవిత్వం అని భ్రమింపజేసి అందలాలెక్కే అంగుష్టమాత్రుల మీద పోరాటంతో గడిచిపోయింది. శేషేంద్రగారి కుమారుడు తన తండ్రిగారి మరణానంతరం వారి రచనలనన్నింటినీ భక్తితో పునర్ముద్రణలుగా తీసుకొని వచ్చి పిత్రూణం తీర్చుకుంటున్నాడు. ఆ పరంపరలో లోగడ షోడశి వంటివి వచ్చాయి. ఇప్పుడు నా దేశం నా ప్రజలు వచ్చింది. ఇది చదివినప్పుడు రచయిత మార్క్సు ప్రతిపాదించిన సిద్ధాంతాలతో ప్రభావితుడై ఆర్థిక విశే్లషణ చేశాడా? అనిపిస్తుంది ఐతే వాస్తవం ఏమంటే శేషేంద్ర ప్రధానంగా మానవతావాది- నవతా వాది. రసవాది. పాదరసంలా పద సరస చిత్రాలు నిర్మించటంలో ఈయన సాటిలేని మేటి.
‘‘నాగలి భుజానికెత్తుకొని వస్తున్నాడు సూర్యుడు’’
‘‘్భమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటకుపెట్టి మొదట వచ్చిన రెండాకులను చేతులుగా జోడించింది’’ (పుట 95- ధరిత్రి ఒక ఇతిహాసం).
‘‘కవిత్వం కవి మరణించిన తర్వాత ఆకాశంలోకి లేచే నిర్మాణం మొలిచే నాగరికత- అడుగుపెట్టే వసంతం’’ (190 పుట) అంటే మానవాళికి నాగరికతను నేర్పినవాడు కవి అని శేషేంద్ర ప్రగాఢాభిప్రాయం. హోమర్ షేక్స్పియర్ కాళిదాసు అల్లసాని పెద్దనలు ఆ పని చేశారు. వాల్మీకి వ్యాసుడు మానవులకు కవితామృతం ద్వారా రసశిక్షణను ఇచ్చారు. అందుకే వీరందరి మీద శేషేంద్రకు గౌరవం ఉంది. ఐదో సర్గలో ఈ పంక్తులు చూడండి ‘‘ఆ గులాబీ సైతం నీ చిరునామా కాపీ కొడుతోంది ఒక నాజూకు శాఖ నెక్కి’’ (377) ‘‘నీ హృదయం ఒక జాబైనా చేతిలో వాలుదామనుకుంటోంది ఒక రైలెక్కి’’
‘‘నీవువెళ్లినతర్వాత ఎవరి పెదవులనుండి ప్రతీకలు రాలడం లేదు’’ ఈ అభివ్యక్తి అనన్యసాధ్యం. కవి తన భావాభివ్యక్తికి ప్రతీకలు వాడుకోవటం సహజం. ఇక్కడ శేషేంద్ర వాడిన వాక్యాలు నవ్య సంప్రదాయ ప్రతీకలు.
‘‘తూర్పు గుడిసెమీద గొంతెత్తిన ఎర్రటి కోడిపుంజులా లేచాడు సూర్యుడు’’ ఈ పంక్తి అత్యాధునిక విప్లవ భావనలా కన్పడుతుంది.
‘‘ఆవిడతో కలిసి నేను పోతుంటాను ఆబిద్ రోడ్డులో
చీరెల దుకాణాల్లోకి.. ఏ ఇంద్రజాలం చేతనో అప్పుడు బాలుణ్ణయి ఎగురుతున్న ఇంద్రధనుస్సుల్లో కురుస్తున్న నక్షత్రాల చినుకుల్లో ఎప్పుడో ఫలించని స్వప్నాలలో తేలి తేలిపోతాను’’ (301- జ్యోత్స్నాపర్వం). ఇందులో 20వ శతాబ్దపు మధ్యంతర భావకవిత్వం ఉంది. ఇది పూర్తిగా గుడిసెమీది ఎర్రకోడిపుంజుకు విరుద్ధమైన కవిత్వం. దీనినిబట్టి విమర్శకులు ఏమని విశే్లషిస్తారు? అంటే ఆధునిక సంవేదన ఉన్నంతమాత్రాన శేషేంద్రను అతివాద రాజకీయ సిద్ధాంతాల సమర్థకునిగా భావించకూడదు. అతడొక కళాతపస్వి. ఋతుఘోష నాటినుండి ఆయనలో సామాజిక సంవేదన కన్పడుతూనే ఉంది. వానకు తడిసిన గుడిసెలు చూచి దేవుణ్ణి నీవు శిలవా- కలవా ప్రభూ! అని ఆనాడు పద్యాలల్లో ప్రశ్నించాడు. ఈనాడు వచన పద్యాలల్లో ఉపాలంబనం చేస్తున్నాడు. అంటే ప్రాథమికంగా శేషేంద్రను ఒక మానవతావాదిగా అంచనావేస్తే సరిపోతుంది. అంతకుమించి సైద్ధాంతిక ఇంద్ర ధనుస్సులు ఈ ఇంద్రునికి అద్దనక్కరలేదు. ‘‘నా ఆత్మను గురించి నాకేభయమూ లేదు. నేను చస్తే దానికేమీ నష్టం లేదు కనుక- పాపం జీవిత పర్యంతానా సుఖ దుఃఖాలు పంచుకున్న నా శరీరానికేమవుతుందో అనే నా భయం’’ (131వ పుట.) శేషేంద్రలోని రసహృదయానికి ఈ పంక్తులు చూడండి.
‘‘పొద్దునే్న స్నానమాడి ఒక తామరపువ్వు సరస్సునంతా స్మృతులలో పరీమళ భరతం చేసింది’’ ఇదొక విశుద్ధ సంప్రదాయ అభివ్యక్తి. ‘‘నేను ఘనీభవిస్తే ఒక నామరూపాత్మక దేహం, నేను ద్రవీభవిస్తే ఒక జ్ఞాపకాల ప్రవాహం’’ ఇదొక ఉపనిషద్భావన.
సామాన్యవాదంనుండి మానవతావాదానికి సామాజిక స్పృహనుండి రసస్పృహకు ఒక ప్రయాణం సాగింది. ఈ సంధియుగంలో ఆధునిక మహాభారతం అవతరించింది.
ఈ గ్రంథ రచన జరిగినప్పుడు కవిగారు ఒక సైద్ధాంతిక సంఘర్షణలో ఉన్నట్లు సుస్పష్టం. ఒక దశలో తన అస్తిత్వాన్ని తానే ప్రశ్నించుకొని క్రాస్ రెడ్‌క్రాస్‌ల మధ్య ఉయ్యాలలూగాడు!
‘‘నా పాటకు మాటల్లేవు మధురిమే ఉంది- నా లేత మాటల నీలినీడల్లో నక్షత్రాలు సేదతీర్చుకుంటాయి. మృదువైన ఎర్రటి తోడేళ్లూ వెండి ముద్దల్లాంటి శిశువులు, రెక్కలకు కాలిరంగునద్దుకున్న పక్షులు’’.

-ముదిగొండ శివప్రసాద్