అక్షర

బడుగు వర్గాల వెతలకు అద్దం పట్టే కథలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పు (కతలు)
సిద్దెంకి యాదగిరి
పేజీలు: 151.. వెల: రూ.120/-
ప్రతులకు: రచయత
19-44/2
టెలికాంనగర్,
సిద్దిపేట 502103
సెల్: 9441244773
**
‘మా తొవ్వ‘, ‘బతుకుపాఠం’ కవితా సంపుటాలతో సాహితీ లోకానికి పరిచయమైన సిద్దెంకి యాదగిరి...క్రమంగా కథలపై దృష్టిసారించారు. తన చుట్టువున్న సమాజంలోని సంఘటనలు కథకుడిగా మార్చాయని చెప్పుకునే ఆయన అచ్చమైన తెలంగాణ నుడిలో ‘తప్పు’ పేరుతో ఓ కథా సంకలనాన్ని ప్రకటించారు. సమకాలీన సంఘటనలకు పెద్దపీట వేస్తూ ఆయన ఈ గ్రంథంలో పొందుపరిచిన పదిహేను కథలు బడుగువర్గాల వెతలకు అద్దంపట్టేలా రూపుదిద్దుకున్నాయి. వివక్ష, విస్మరణ హేళనకు గురయ్యే జీవితాలను రచయిత తాను స్వయంగా అనుభవించాడు కనుక ఆయన కథల్లో దళితుల దుర్భర పరిస్థితులను ప్రతిబింబింపచేసారు. ఈ కథల్లో అస్తిత్వవాదం వుంది. సమాజంలో విలువలు కాపాడాలన్న సందేశముంది. ప్రజల జీవన విధానంలోని లోపాలను సరిదిద్ది చైతన్యపరచాలన్న ఆరాటం ఉంది. సామాజిక రుగ్మతలను రూపుమాపాలన్న ఉబలాటం ఆయన కథల్లో కానవస్తుంది. ఆదాయమే పరమావధిగా ప్రజలను దుర్వ్యసనాలకు ఉసిగొల్పుతున్న ప్రభుత్వ పోకడలపై కథకుడు యాదగిరి తమ కలాన్ని ఎక్కుపెడుతూ... పాలకుల్ని నిలదీసే నిరసన గళాన్ని ఆయన కథల్లో చూస్తాం.. మార్క్సిస్టు సిద్ధాంతాలపై అవగాహన ఉన్న ఆయన, కథల్లో సందర్భానుసారం తమ ప్రగతిశీల భావాలను పొందుపరిచి... సాంస్కృతిక విప్లవం ద్వారా సమాజంలో మార్పు తేవాలన్న ఆలోచనను ఇందలి కొన్ని కథల్లో మనం గమనిస్తాం! యాదగిరి కథల్లో తెలంగాణ సోయితోపాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. నక్సలైట్ ఉద్యమానంతర జీవిత చిత్రణ మరియు దళితోద్యమాన్ని చక్కగా నిక్షిప్తంచేసారు. తెలంగాణ వర్గీకరణోద్యమం.. అట్టడుగు వర్గాల వ్యధలు, మసకబారుతున్న మానవ సంబంధాలు ఇలా వేటికవే వైవిధ్యమైన కథావస్తువుతో యాదగిరి కథలను హృద్యంగా తీర్చిదిద్దారు. సమాజంలో మన చుట్టువున్న మనుషులు, వారిమధ్య వున్న వైరుధ్యాలు, భావోద్వేగాలు ఇందలి కథల్లో అడుగడుగునా కానవస్తాయి! యాదగిరి కథల్లో జీవితం ఉంది. జీవం ఉంది. మంచి సమాజం కావాలన్న ఆకాంక్ష ఉంది. అన్నింటికి మించి తెలంగాణ భాషపై మంచి పట్టువుంది. ఇందలి కథల్లో వాడిన తెలంగాణ మాండలిక పదబంధాలు ఆయన పరిశీలనా పటిమను సూచించేలా ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ భారతాన్ని పల్లె ప్రజల నాలుకలపై నాట్యంచేసే పరదాలను కథల్లో అందంగా ఆవిష్కరించారు. కథకుడు స్థానికతకు ప్రాధాన్యమిస్తూ ఆయా కథలయందు మెదక్ జిల్లాలోని గ్రామాలను చక్కగా ప్రస్తావించారు. కథాశిల్పం విషయంలో, కథాగమనం విషయంలో పాత్రల చిత్రణ, సన్నివేశాలు, సంభాషణలు సంబంధించిన అంశాలలో యాదగిరి చూపిన ప్రతిభ ప్రశంసనీయం! ‘విరిగిన కల’ కథలో ఊశయ్య పాత్రను ఉన్నతంగా చిత్రించారు.
‘బుద్ధిమాట’ కథలో హన్మంతు తీసుకున్న నిర్ణయం బాగుంది.. ‘కులం తెలివికంటే కాయిదం చదివిన తెలివి గొప్పదని’... ‘బోధ’కథ ద్వారా తెలియజేసిన తీరు బాగుంది.
‘తేలని లెక్కలు’ కథలో తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎలా జరగాలో.. ప్రజల ఆకాంక్షలేమిటో రచయిత తెలియజేసే క్రమంలో ఇప్పుడు రావలసింది అగ్రవర్ణ తెలంగాణ కాదు అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో మమేకమై బహుజన ప్రజాస్వామ్య తెలంగాణకోసం కలలు కనాలని లేకపోతే లెక్కలు తేలవని వీరేశం పాత్ర ద్వారా చెప్పించడం బాగుంది. అలాగే ‘కీలెరిగిన వాత’ కథలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బలంగా సమర్ధిస్తూ రచయిత ప్రస్తావించిన అంశాలు బాగున్నాయి.
‘సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తుందన్న’ సందేశంతో కథను కొనసాగించారు. ‘రేపటి సూర్యుడు’ కథలో ఎంపిక చేసుకున్న కథ వస్తువు వైవిధ్యంగా ఉంది. సైనికుల కొలువంటే.. పిల్లనివ్వడానికి ముందుకు రావడానికి జంకే మనుషుల తీరుతెన్నులను చిత్రించిన తీరు అభినందనీయం! సైన్యంలో చేరిన సైనికులు తమ వ్యక్తిగత జీవితాలను త్యాగంచేసే క్రమంలో వారు పడే పాట్లను ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. ఈ కథ ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు బాగుంది.
‘మార్పు’ కథలో రోడ్డుపై మరియు బయట రైల్వేస్టేషన్‌లలో అనాధలుగా కన్పించే అమాయక బాల బాలికలను, బాల కార్మికుల వ్యథలను చిత్రించారు.
‘ఎంతకంతే’ కథలో తెలంగాణ గ్రామీణ ప్రజలు మాట్లాడే పదాలు అడుగడుగునా కనిపిస్తాయి. తిట్లదండకంతో సాగే ఈ కథలో పోలీసోల్ల అకృత్యాలను దృశ్యమానంచేసే యత్నంలో రచయిత యాదగిరి సంయమనాన్ని కోల్పోవడం గమనిస్తాం. ప్రమీలపై పోలీసులు జరిపే అత్యాచార ఘట్టాన్ని వివరించే సన్నివేశంలో శృంగారం పాలు శృతిమించింది. అలాగే పోలీసుస్టేషన్‌కొచ్చిన ఎల్వవ్వ, ప్రమీలలను పోలీసు కానిస్టేబుళ్లు మనసులో చెడుగా ఊహించుకోవడాన్ని కూడా కథకుడు యాదగిరి వర్ణించిన తీరు పాఠకులను కొంచెం ఇబ్బందిపెట్టేలా ఉంది!
ఇక చివరి కథ ‘తప్పు’ కథలో నేడు సమాజంలో వేళ్లూనికునిపోయిన కుల వివక్షను చూడగలం! మహనీయుడు అంబేద్కర్ బాటలో ఆత్మగౌరవంతో ఆందరు నడవడానికి ‘తప్పు’ చేసుకోవడం బాగుంది.
ఇలా ఈ గ్రంథంలోని కథలన్నీ తెలంగాణ భాషలో నడవడం వెనుక రచయిత యాదగిరికి వున్న సోయి అంతాఇంతా కాదు కొండంత! దోస్త్‌ను, నాయినమ్మను నోస్టాల్జియాగా యాది జేసుకున్నడు..కథల ద్వారా ‘కీలెరిగి వాత’ పెట్టిండు. ‘పంచుకోండ్రి’ అంటూ ‘బుద్ధిమాట’ చెప్పిండు.. ‘అంతర్మధనాన్ని’ అక్షరాల్లోకి ఒంపిండు. ‘అమరులను యాది’ చేసుకున్నడు... ‘లెక్కలు’తీసి ‘బోధ’చేసిండు.. అన్నింటికి మించి రచయిత యాదగిరి ఈ కథల ద్వారా ‘సందిగ్ధం’ నుంచి ‘మార్పు’కు పయనిస్తూ ‘తప్పు’ చెప్పిండు.. సామాజిక తెలంగాణ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని తన కథల ద్వారా తేల్చి చెప్పారు.
*

-దాస్యం సేనాధిపతి