అక్షర

వికసించిన మానవీయ విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరాగభూమి’ కథలు
రచయిత: కలువకొలను సదానంద
పేజీలు: 220. వెల: 150
ప్రతులకు: పలమనేరు మిత్రసాహితి,
6-219,
గుడియాత్తం రోడ్డు,
పలమనేరు - 517408
చిత్తూరు జిల్లా.
సెల్ : 9440995010
విశాలాంధ్ర, ప్రజాశకి
పుస్తక కేంద్రాలు.
**
‘జీవి ఆశ్రయం పొందగలిగిన ఒకే ఒక్క లోకం భూమి. జీవికి చావు పుట్టుకలున్నాయి కానీ జీవజాతికి మరణం లేదిక్కడ. చెట్టు పుష్పిస్తుంది, పరాగం ఫలిస్తుంది. యుగాలు గడిచినా దాని గుర్తులు పచ్చగా పల్లవిస్తూనే వుంటాయి. లేకపోతే ఆ అంచె తెగిపోదూ! పరాగభరితంగా పరిమళించడం కోసమే ప్రాణి పుట్టుక. ఆనందం పంచుకునే ఈడు జోడు లేకపోతే జీవితం ఎందుకు?’. ‘పరాగభూమి’ పేరుతో ప్రముఖ సీనియర్ రచయిత కలువకొలను సదానంద వెలువరించిన కథా సంకలనంలో ఆవిష్కృతమైన అందమైన భావనకు పై వాక్యాలు ఓ మచ్చుతునక.
‘కారణం లేకపోతే కథ లేదు. కదలిక లేకపోతే అది పాత్ర కాదు’ అని స్వయంగా రచయితే ముందుమాటగా రాసిన ‘నా కథా ప్రపంచం’లో చెప్పుకున్నారు. అందుకే నిత్యజీవితంలో మనం చూసే ఎందరో వ్యక్తులని, ఎదురయ్యే ఎన్నో సంఘటనలనే కథాంశాలుగా తీసుకుని ఆలోచింపజేసేలా అక్షర రూపంలో మనముందుంచారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా చోటుచేసుకున్న అనేక పరిణామాలను అర్థం చేసుకోవడంలో రచయితగా సదానందకు వున్న సామాజిక స్పృహ, వాటిని కథలుగా మలచడంలో ఆయనకున్న రచనా నైపుణ్యం ఈ పుస్తకం ద్వారా మనకు ప్రస్ఫుటమవుతుంది. ఐదు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానంలో సదానంద వెలువరించిన ఐదు సంపుటాల్లో ఒకటిగా తాజాగా పాఠకుల ముందుకు తెచ్చిన సంకలనం ‘పరాగభూమి’. వాస్తవికతకు అద్దంపట్టే అంశాలను ఎంచుకొని అత్యద్భుతమైన రచనా శిల్పంతో అందించడంలో అందెవేసిన చేయిగా ప్రముఖుల ప్రశంసలందుకున్న సదానంద కలం నుండి ఇలాంటి మానవీయ విలువల కథనాలతో కథలు రావడం కొత్తేమీకాదు. పాఠకులకు ఆయన రచనా శైలి సుపరిచితమే. పలమనేరు మిత్రసాహితి ప్రచురణల ద్వారా తాజాగా వెలువడిన ‘పరాగభూమి’ సంకలనంలో చోటుచేసుకున్న కథల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.
అమరిన అందమైన జీవితాన్ని పరాయి స్ర్తి వ్యామోహంలో పడి కాలదన్నుకుని ఇంటికి దీపం లాంటి ఇల్లాల్ని, బిడ్డను కూడా దూరం చేసుకుని అవసాన దశలో నానాఅవస్థలు పడి పశ్చాత్తాపంతో కన్నుమూసిన పూలవ్యాపారి సుందరయ్య కథ ‘స్వయం కృతం’. ‘స్వహస్తాలతో అందమైన పూలదండలు కోకొల్లలుగా అల్లిన సుందరయ్య తన జీవిత సమాహారాన్ని కూర్చి కట్టుకోలేకపోయాడు’ అని ఏకవాక్యంలో కథా సారాంశాన్ని చెప్పడం బాగుంది. ‘కడుపులో చల్ల కదలకుండా, శాంతికి లోటులేకుండా బతికేవానికే తప్ప ఇతరులకు నాటక రంగం గోరుచుట్టు మీద రోకటిపోటే కాగలదు’ అంటూ అర్జునరావు అనే ఓ శిష్యుడు తన అనుభవసారాన్ని లేఖ ద్వారా గురువుకు తెలియజేసిన కథే ‘అర్జున విషాదయోగం’. ‘నువ్వు నల్లగా వుంటేనేం, నా కంటికి ఎంతో అందంగా వున్నావు. ఆ నల్లరంగే నీకు అందం’.. అంటూ తొలిరాత్రి తన అర్థాంగిని దగ్గరికి తీసుకుంటూ ఆమెలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టే భర్తగా సుందరం చెప్పిన మాటలతో అందమనేది ఆస్వాదించే హృదయాన్ని బట్టి వుంటుంది గానీ, బాహ్యరూపాన్ని బట్టి కాదు’ అని ‘నల్ల కలువలు’లో తెలియజెపుతారు. అప్పటివరకు తన అందం పట్ల ఆత్మన్యూనతా భావం వున్న పాత్ర ద్వారానే అలా చెప్పించడం విశేషం. ‘పరకాంతా వ్యామోహంలో పడిన భర్తను కాపాడుకోలేక తానే తనువు చాలించిన స్ర్తి ఒకరైతే, అదేబాటలో నడవబోయిన మగడిని చాకచక్యంగా తప్పించి తనవాడిగా నిలుపుకున్న ఓ ఇల్లాలి కథ ‘యజమానురాలు’. ఒకే సమస్యపై విభిన్నంగా స్పందించిన మహిళల ఉదంతాన్ని ఈ కథలో మనం చూడొచ్చు. జీవితంలో మధురానుభూతుల్ని నిలిపేది తొలి అనుభవాలే. తలచుకున్నప్పుడల్లా పైరగాలంత స్వచ్ఛంగా అవి మనసును ఆహ్లాదపరుస్తాయని ‘తొయ్యలి కట్టిన తొలిచీర’ చెప్పకనే చెబుతుంది. ‘ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికిందట’ అనే సామెతలా కంటికి కనబడకుండా పోయిన బిడ్డకోసం ఓ తల్లి పడే ఆరాటాన్ని తెలిపే కథ ‘ఊరంతా ఉయ్యాల’. ‘తప్పిపోయింది మొగుడు కాదుకదా అలక తీరగానే అతడే వస్తాడులే అనుకోవడానికి.. అనే వాక్యంతో ఈ కథని ఎత్తుకోవడం బాగుంది. ఆరు పదుల వయసులో నైనా ఒంటరి జీవితానికి ఓ తోడు కావాలను కోవడం తప్పుకాదు గానీ, ఆ తోడు ఎంపికలో వయో విచక్షణ పాటించాల్సిన అవసరం కూడా వుందని ‘తోడొకరుం డిన అదే భాగ్యము’ అనే కథలో ఓ వృద్ధ ప్రేమికుని పాత్ర ద్వారా సందేశమిచ్చారు రచయిత. పదహారేళ్ల ప్రాయంలోనే మోడువారిన తన జీవితాన్ని చిగురింపచేసుకోవడంలో బిడ్డను సైతం వదిలివెళ్లిన ఓ తల్లి కొన్నాళ్ల తర్వాత యాదృచ్ఛికంగా కలిసిన ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని అంతకాలం దిక్కులేనివాడిగా కుమిలిపోయిన ఆ కొడుక్కి కొండంత అండగా నిలబడి, అతను కోరుకున్న తోడుని దక్కేలా చేసి అతని జీవితాన్నీ ఫలవంతం చేయడం సంకలనం శీర్షిక ‘పరాగభూమి’ కథలో చూస్తాం. ఈ కథకి ఆ పేరు పెట్టడంలోని ఔచిత్యాన్ని ఈ వ్యాసం ప్రారంభంలో పేర్కొన్న వాక్యాలే నిదర్శనం. ఇక, ఇంటి నుంచి పారిపోతుండగా రైలులో కలిసిన వ్యక్తి తన మారుటి తండ్రి కావడం, అతని ద్వారా తన తల్లిని కలుసుకోవడం, ఎప్పుడో దూరమైన ఆ తల్లీ కొడుకుల చేతుల మీద వున్న పచ్చబొట్ల ఆధారంగా ఒకరినొకరు గుర్తుపట్టడం వంటి ఘటనలు సినిమాటిక్‌గా అనిపించాయి. అష్టకష్టాలు పడి పెంచి పెద్దచేసిన కొడుకు చేతులమీదుగా కడతేరిపోవాలనుకున్న ఆ తల్లి కోరిక నెరవేరకపోగా తన చేతులమీదుగానే బిడ్డను కాటికి పంపాల్సి రావడం ఎంతటి విషాదం! అంతటి కడుపుకోతలోనూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ తల్లి తన బాధ్యతల్ని ఎంతలా నెరవేర్చింది చెప్పే దయనీయ కథే ‘హాయమ్మ హాయి ఆపదలు కాయి’.
కొందరు రచయితలు తమ కథల్లో సమస్యలను ఎత్తిచూపి పరిష్కారాలను మన విజ్ఞతకే వదిలేస్తారు. మరికొందరు రచయితలు పరిష్కారాన్ని కూడా స్ఫురింపజేసేలా కథల్ని ముగిస్తారు. సదానంద కథలు ఈ రెండో కోవలోకే వస్తాయి. కథలు రాయడం వల్ల గానీ, చదవడం వల్ల గానీ ఒరిగేదేముంది?.. అని సందేహించే వాళ్లుంటారు గానీ అవి కనీసం మానవత్వం గురించి, మంచి సమాజం గురించి కలలు గనడానికైనా దోహదపడతాయి. ఆ మాత్రం కనిష్ఠ ప్రయోజనం చాలు అని రచయితే స్వయంగా పేర్కొన్నారు. ఆ విధంగా చూస్తే ఈ కథల ద్వారా ఆ ప్రయోజనం నూటికి నూరుపాళ్లు నెరవేరిందనే చెప్పాలి. ఈ పుస్తకంలో కేవలం కథలే కాకుండా ‘నేనెందుకు రాశాను’ అని చెబుతూ ‘శైలిని బహూకరించిన తొలి రచన’ని గురించి వివరిస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులను ‘ముందు నడచిన చందమామలు’గా వర్ణిస్తూ రచయిత సదానంద తన సాహితీ ప్రస్థానాన్ని కూడా సవివరంగా తెలియజేశారు. అలా మరికొందరు రచయితలకు తానే స్ఫూర్తిగా నిలిచారు.
*

-డి.స్వాతి