అక్షర

పాఠకుణ్ణి కట్టిపడేసే సునిశిత విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాలోకనం
- (సాహిత్య వ్యాసాలు)-
చందు సుబ్బారావు
వెల: రూ.150/-
మొజాయిక్ ప్రచురణలు,
ఎం.ఐ.జి. 88, సీతమ్మధార ఎన్.ఇ.
విశాఖపట్నం- 530 013

నిరంతర సాహిత్య అధ్యయనశీలి, విశే్లషకులు అయిన చందు సుబ్బారావుగారి ముప్ఫైఆరు సాహిత్య వ్యాసాల సంకలనం ‘నవ్యాలోకనం’. విమర్శ రంగంలో వౌలికమైన అభిప్రాయాల వ్యక్తీకరణ చేయగలవారు తక్కువే. ఇతరుల ఏకీభావమే లక్ష్యంగాకాక, నిజమైన నిశిత చర్చ, పరామర్శ చేయడం చందు సుబ్బారావుగారి విమర్శలోని వైశిష్ట్యం. ఆయన సాహిత్య వ్యాసాల్లోని ప్రసంగ వైఖరి పాఠకుడిని ఆసాంతం నిలబెట్టి చదివిస్తుంది. ‘విమర్శ’ ‘నిజం’ ‘చుట్టూ పరిభ్రమించాలి’అని విశ్వసించిన విమర్శకుడాయన.
‘‘ఉన్నాలేకున్నా ఈ వాక్యాల అర్థమిదీ అని చెప్పే వ్యాఖ్యాత విమర్శకుడు కాడు. కేవలం భాష్యకారుడే. భాష్యకారునికి నిజంతో నిమిత్తం లేదు. ఉన్న విషయాన్ని విశదపరిచి ఉల్లేఖించటమే కర్తవ్యంగా భావిస్తాడు. అందుచేతనే ఆధునిక యుగంలో ‘విమర్శ’కు ప్రత్యేక ప్రతిపత్తి నిజనిర్ధారణ కృషివల్లే జరిగింది.’’ అంటారా వ్యాసంలో.
‘పదునెక్కిన పాట’ కవితా సంకలనం గురించి- ‘దళిత కవిత్వంలో నూత్నకోణం అనే వ్యాసం రాస్తూ’ చివరగా- జాతీయతను వెలార్చిన వైఖరి కానవస్తుంది. ‘‘,,,,- సమస్త మత విశ్వాసాల సమష్టి మణిహారమీ భూమి.. శరీరంలో గాయాలుచేసిన మచ్చలు అందంకన్నా ముందుగా కనిపించినట్లు తప్పులూ, దోషాలూ, బలహీనతలు బయటకు కన్పిస్తాయి. బలం కనుమరుగవుతుంది. లోటుపాట్లు మిట్టపళ్ళు. సుగుణాలు దానిమ్మ గింజలు.
ఈ నేలకాక మరే దేశంలో మత సహనం మణికిరీటంలా భాసిస్తుంది? ఏ దేశంలో ‘ఈశ్వర్‌అల్లా తేరేనామ్’అనే గీతం పాడుతున్నారు. ఏ దేశంలో ఇంతమంది లౌకికశక్తులూ, వ్యక్తులూ నిర్భయంగా సంచరిస్తున్నారు. ఈ దేశబలాన్ని సైతం కవులు విస్మరించరాదు. తండ్రి పార్శీ, తల్లి హిందువు, భార్య క్రైస్తవురాలు, మరదలు సిక్కుల ఆడపడుచుగా ఉద్భవించిన రాజీవాలు విలసిల్లిందీ నేలలోనే’’- అనడం నిజంగా గొప్పగా వుంది.
‘కథలెలా రాస్తారు?’అన్న వ్యాసంలో కథకులకు ఆయన చెప్పిన విషయం గుర్తుంచుకోదగింది- ‘‘తెలియని విషయాల గురించి ఎలా రాయకూడదో, తెలిసిన విషయాల్లోకూడా అనర్హమైన అంశాలను ఇతివృత్తాలుగా స్వీకరించకూడదు. అల్పిష్టి సంఘటనలు సాహిత్య స్థాయికి పనికిరావు. ఒకవేళ రాసినా పాఠకుడు తక్షణం మరచిపోతాడు. జీవితం గురించి ఎంత ఎక్కువగా తెలిస్తే, కథకుని చేతినుంచి అంత కథలొస్తాయి. ప్రత్యక్షంగా చూసినది, పరోక్షంగా విన్నది, కళ్ళతో చదివినది అనే అనుభవత్రయం నుండి కథలు ఉద్భవిస్తాయి.’’
ఈ సంకలనంలో అబ్బూరి, రోణంకి, సోమసుందర్, నారాయణబాబు వంటి సాహితీ ప్రముఖులపై రాసిన వ్యాసాలున్నాయి. ‘కవిత్వంలో అకవితా ఛాయలు’, ‘పద్య కవితలో అభ్యుదయం’, ‘్భరతీయ కవితాత్మ ఏమంటోంది’ వంటి వ్యాసాలలో కవిత్వం గురించిన విభిన్న పార్శ్వాలను నిశితంగా విశే్లషించడం కానవస్తుంది.
‘సమీక్షపై ఇది సమీక్ష’ అనే వ్యాసం ప్రత్యేకించి పేర్కొనదగినది. ‘గ్రంథంపై ప్రసరించే వెలుగు గొప్పదై, పాఠకులకు కరదీపికై, విషయ చర్చకు కాగడాగా భాసిస్తే, సమీక్ష ధన్యమవుతుంది.... పుస్తకాలను మస్తిష్కాలకు ఎలా అందించాలో జన బాహుళ్యానికి సూచించని సమీక్ష పుటల వ్యయం తప్ప అన్యం కానేరదు’ అంటారు చందు సుబ్బారావు. అలాగే- ‘గ్రంథం తొలి పాఠకుడిగా, స్థాయిగల పరిశీలకుడిగా సమీక్షకుడు తన మలి పాఠక లోకానికి తీర్పు వెల్లడించాలి. ఆ తీర్పుపై ఆధారపడి తదనంతర పరిశీలనకు పాఠకులు సమాయత్తమవుతారు.’’ అంటారు. పుస్తక సమీక్షలను చదివి, తద్వారా ఆయా గ్రంథాలను చదివే పాఠకులు వుంటే, పెరిగితే నిజంగా సంతోషించాల్సిన విషయమే!

-సుధామ