అక్షర

మధురం... మధురాక్షరమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం

అయల సోమయాజుల
నీలకంఠేశ్వర
జగన్నాథ శర్మ
వెల: రూ.500/-
పేజీలు: 512
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని కేవలం కథ మాత్రమే ప్రధానమైన రచనలు కావు. ఇవి వేదానికి ఉపబృంహణంగా చేసిన రచనలు.
వేదాలలో మానవుడి కర్తవ్యాలనీ, జ్ఞాతవ్యాలనీ క్లుప్తంగా చెప్పారు. వాటిని సామాన్యులకు అందేలా వివరించి చెప్పడమే ప్రధాన లక్ష్యంగా చేసిన రచనలని వేదాలకి ఉపబృంహణములు అంటారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని కుశలవులకు ఉపదేశించే సందర్భంగా వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః అన్నారు. అప్పటికే సాంగవేదాధ్యయనం చేసి ఉన్న కుశలవులకు వేదాలలో ఉన్న విషయాలు ఒంటబట్టేందుకు రామాయణం చెప్పారు.
అయితే రామాయణం కేవలం వేదోపబృంహణమైన గ్రంథం మాత్రమే కాదు. ఇది అత్యంత రమణీయమైన కావ్యం. మధురం మధురాక్షరమ్ అని ప్రఖ్యాతి పొందిన కావ్యం.
ఈ కావ్యంలో ఎక్కడా గ్రంథగ్రంథులుండవు. వాల్మీకిది పరమకోమలమైన శైలి. ఆయన పాఠకుణ్ణి చెయ్యి పట్టుకుని ఎంతో సున్నితంగా అడుగులు వేయిస్తూ తనతో నడిపించి తీసుకువెళ్తాడు. ఆయన వాచ్యంగా చెప్పిన మాటలే పరమాద్భుతం గా ఉంటాయి. ఇక ధ్వనిగా చెప్పిన వాటి గురించి ఏమని చెప్పాలి!
శివ ధనుర్భంగం ఘట్టంలో రెండు సర్గలలో 29 శ్లోకాలు ధనుస్సు గురించి చెప్పారు. అన్నీ చెప్పి, ‘‘దేవతలూ, రాక్షసులూ కూడా కదపలేని ఈ ధనుస్సుని కదపడం మానవులకు సాధ్యమవుతుందా!’’ అన్నాడు జనకుడు.
జనకుడు చెప్పిన కథ అంతా విని విశ్వామిత్రుడు రెండు ముక్కల్లో తేల్చేసాడు. ‘‘వత్స! ధనుః పశ్య ఈయనేదో చెప్తున్నాడు, ఆ ధనుస్సు సంగతేమిటో చూడు.’’ అన్నాడు. రాముడు ధనుస్సు దగ్గరికి వెళ్తాడు. ఎత్తాడు, నారి బిగించాడు, ఎక్కుపెట్టాడు. ధనుస్సు విరిగిపోయింది. ఇదంతా రెండంటే రెండే శ్లోకాలలో చెప్పాడు!
ఆయన చెప్పినదే చూడాలా? చెప్పకుండా వదిలేసినదే చూడాలా? భావుకులైన ఎందరో కవులు ఆ ఘట్టాన్ని అందమైన రీతులలో, హృద్యమైన పదబంధాలతో చెప్పి తరించారు.
ఇదీ రామాయణం విశిష్టత! ఎందరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా రామకథ చెప్పేవారికి కొదవ లేదు. వినేవారికి విసుగు లేదు. చదివేవారికి లోటు లేదు.
జగన్నాథశర్మగారు చెయ్యి తిరిగిన రచయిత. గొప్ప కథకుడు. మంచి భావుకుడు. ఇప్పటికే మహాభారతం, భాగవతం వ్రాసి ఉన్న సిద్ధహస్తుడు. ఇప్పుడు రామాయణంలోకి వచ్చారు. సాధారణంగా క్రమం ఇటునుంచి అటుంటుంది. అయితే ఆయన రామాయణం వ్రాయడం ఆశ్చర్యం కాదు.
నాకైతే రామాయణం ఒక అయస్కాంత క్షేత్రం అనిపిస్తుంది. అయస్కాంత క్షేత్రంలోకి ఇనుము, ఉక్కు వంటి సారవంతమైన పదార్థాలు ప్రవేశిస్తే అవి ఆ క్షేత్రాన్ని వదలలేవు. అలాగే రసజ్ఞుడైన రచయిత కూడా రామాయణాన్ని ముట్టుకుంటే దానిని వదలలేదు.
శర్మగారు వ్రాసిన రామాయణం ఆనందంగా చదివించే గ్రంథం. ఆయన కథ తెలిసినవాడు. కథనం మీద పట్టున్నవాడు.
ఆ ప్రజ్ఞే రామాయణం వ్రాయడంలో ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టిందేమో అనిపిస్తుంది. రామాయణం చదివి పరవశించి ఒక్కోసారి భావుకతలో వాల్మీకితో పోటీ పడ్డారా అనిపిస్తుంది.
కొన్ని సందర్భాలలో కథ చదివి మురిసిపోయి కొసరులద్ది అందించారనిపిస్తుంది. శాప విమోచనం తరువాత అహల్యని వర్ణిస్తూ మధ్యే...ంభసో దురాధర్షం దీప్తాం సూర్యప్రభామివ నీటిలో ప్రతిబింబించిన సూర్యకాంతిలా చూడడానికి సాధ్యంకాని మహాతేజస్సుతో ఉంది అన్నాడు వాల్మీకి. శర్మగారు అంత తీవ్రతని తట్టుకోలేకపోయారు. దానిని చల్లగా మార్చారు. ‘‘నీటిలో ఎండలా చల్లగా కనిపించింది’’ అని సుకుమారంగా చెప్పారు.
పుష్పక విమానానికి చోదకుణ్ణి నియమించి రాముడికీ అతడికీ సంభాషణ పెట్టడం, బ్రహ్మాస్త్రాన్ని శుద్ధిచెయ్యడం వంటివి ప్రవేశపెట్టి కొన్ని సందర్భాలలో పాఠకుణ్ణి ఆశ్చర్యపరిచారు.
సులభమైన శైలిలో, ప్రవాహినీ లక్షణంతో సాగిన జగన్నాథశర్మగారి రామాయణం ఆనందంగా చదువుకోదగిన గ్రంథం. పరమ పురుషుడైన రాముడి కథ సర్వదా శ్రేయోదాయకమే కదా!

-ఉప్పులూరి కామేశ్వరరావు