అక్షర

అనుబంధాల కథా మధురిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమలారాణి కథలు
(కథాసంపుటి)
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**

పది కథానికలు వున్న సంపుటి ఇది. కథలన్నీ ఇంతకు ముందు ఏ పత్రికలోనూ ప్రచురితం కానివి కావటం - ఒక విలక్షణత. విమలారాణి కథలన్నీ కుటుంబ వ్యవహారాల గురించీ, మానవ సంబంధాల్లోని వైచిత్రి గురించీ సాగాయి. అవన్నీ మనిషి తన మంచితనాన్ని నిలుపుకోవలసిన అవసరాన్ని చెప్పుకొచ్చాయి.
సాంకేతిక పరమైన వస్తువు, శిల్పం, శైలీ వంటి గుణ విశేషాల్ని పక్కనబెడితే, కథని ఇలాగే రాయాలి అనే నియమ నిబంధనలూ, చట్రాలూ ఏవీ లేవు. ఈ కారణంవల్లనే - రచయితల ఆసక్తి కొలదీ, వారి ఆత్మతృప్తి కోసమూ - పుంఖానుపుంఖంగా కథలు వస్తూనే ఉన్నాయి. వాటిలో - ఇతివృత్తాల భిన్నత్వమూ, నిర్మాణ వైవిధ్యమూ పోషింపబడుతున్నాయి. విమలారాణి కథలు కూడా ఈ వాస్తవానికి దర్పణం పడుతున్నాయి.
ఈ సంపుటిలో ‘మామిడిటెంక’ కథ మనిషి తన తోటివారికి పరిపరి విధాలుగా ఉపయోగపడటంలోనే బతుకు అర్థమూ, పరమార్థమూ ఇమిడి వున్నాయనే సందేశాన్ని అందిస్తుంది. కథలో ఈ సందేశాన్ని అందించే ప్రధాన పాత్ర - కరుణాకరం. ఆయన్ని ప్రవేశింపజేయటానికి కథ ఎత్తుగడలో పెద్ద సన్నివేశ సృజననే చేశారు రచయిత్రి. అలాగే, ఆయన ఆదర్శ కార్యాచరణ వివరణతో ముగింపుని కథావ్యాసం చేశారు. ‘ఈతరం పంపకాలు’ కథలో తండ్రి రాజగోపాల్‌రెడ్డి. ఆయన తన వీలునామా ద్వారా - అన్యాపదేశంగా - సామాజిక న్యాయాన్ని పాటించాడు. ఏ ఉద్యోగమూ లేని, ఇల్లూ లేని, జీవితంలో స్థిరపడని - నాలుగో కొడుక్కి ఆస్తి రాసిచ్చాడు. దీనికి మొదటి ముగ్గురు కొడుకులూ అంగీకరించి, తండ్రి కోరికని నెరవేర్చి కథని సుఖాంతం చేశారు. ‘నదీనాం సాగరో గతిః’ కథ స్నేహ బంధంలోని ఔన్నత్యాన్నీ, ఆత్మహత్యల నివారణ ఆవశ్యకతనీ జమిలిగా ఆవిష్కరించింది. ‘ముందడుగు’ కథలో సుమతికి 47 ఏళ్లు. భర్త చనిపోయాడు. ఆమె ఉద్యోగిని. అన్నా, తమ్ముడూ, మామల నిరాదరణకు గురయింది. సహోద్యోగి సుందర్రావు 49 ఏళ్ల వాడు. భార్య చనిపోయింది. ఒక పాప. తన సాన్నిహిత్యంతో ఆయన సుమతికి భవిష్యత్తు గురించిన ఆలోచనల్ని ప్రేరేపిస్తాడు. తన వారికి అవసరమైన ఆర్థిక సహాయం చేసి, బయటపడి, సుందర్రావుని వివాహం చేసుకుంటుంది సుమతి. ఈ దశాబ్దంలో కొన్ని వందల సంఖ్యలో వచ్చిన ఇలాంటి మూస కథల్లో ఇదీ ఒకటిగా కలుస్తుంది. ‘సౌందర్య రహస్యం’ ఒక మంచి కథ. శారీరకమైన అందం, ఆరోగ్యంకు మించి వ్యక్తికి మానసికమైన ఆరోగ్యం, శ్రేయోభావన అవసరమనీ, అవే అసలైన సౌందర్యదాయకాలనీ సందేశిస్తుందీ కథ.
విమలా రాణి కొన్ని కథల్లో కొన్ని పాత్రల పరిచయం, జీవిత వివరణ దీర్ఘంగా ఉంటాయి. పాత్రల మధ్య సంబంధ బాంధవ్యాల వివరణ కూడా అంతే దీర్ఘంగా ఉంటుంది. దీనివలన కథని ఎంత నింపాదిగా చదివినా, ‘ఎవరికి ఎవరు ఏవౌతారు’ అనిపిస్తూ ఉంటుంది. పాత్ర ప్రమేయాన్నీ, కథావసరాన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో స్పష్టతని పోషించాలి. రచయిత్రి కథలన్నిటా చదివించే గుణం ఉన్నది. కథానికని చదువరికి మరింత అనుభూతిప్రదం చేసే దిశగా తమ ఆలోచనని సాగించి, తెలుగు కథా సాహితికి మరిన్ని మంచి కథల్ని అందిస్తారని ఆశిద్దాం.

-విహారి