అక్షర

సరికొత్త శోభను సంతరించుకున్న మాండలీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నెల పొడుపు’’
(కవితా సంపుటి)
టి.చరణ్‌దాస్,
పంచశీల ప్రచురణలు,
ఆదిలాబాద్.
వెల: రు.50/-
పేజీలు: 64,
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు.
**
తెలుగులో మొట్టమొదటిసారిగా మాండలిక కవితా సంపుటాన్ని వెలువరించిన ఘనత రంధి సోమరాజుగారికే దక్కుతుంది. వీరు ఉత్తరాంధ్ర మాండలికంలో రాసిన ‘పొద్దు’ కవితా సంకలనానికి సి.నారాయణరెడ్డి తెలంగాణ మాండలికంలో పీఠిక రాయడం విశేషం. తర్వాత దేవరాజు మహారాజు, పంచరెడ్డి లక్ష్మన్న, తెలిదేవర భానుమూర్తి, కృష్ణమూర్తియాదవ్‌లు తెలంగాణ మాండలికంలో తమ కవితా సంపుటాలను వెలువరించారు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో చాలామంది కవులు మాండలికంలో కవిత్వం రాస్తున్నప్పటికీ, వాటిని సంకలనాలుగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అదిలాబాద్ జిల్లా మాండలికంలో కవి టి.చరణ్‌దాస్ తన కవిత్వాన్ని ‘‘నెలపొడుపు’’ పేరుతో తీసుకురావడం ఆహ్వానించదగింది. వీరి కవిత్వం తెలంగాణ ఉద్యమ పోరాటం, రైతుల వెతలు, అణగారిన వర్గాల వేదన, వ్యక్తులు- వస్తువులు- ఊరికి సంబంధించిన జ్ఞాపకాలతో నిండి వుంది.
ప్రత్యేక తెలంగాణకోసం ‘‘...దీక్షలు పట్టినం/ పానాలిచ్చినం, మానాలు తీసుకున్నం/ రైళ్ళాపినం, సడక్ బందులు చేసినం’’అయినా ‘‘ముంగిస బాటలు మూతినాకుళ్ళ మాటలు/ పూటకో మాట, యాటకో జూట/ రాజకీయం రంకులు...’’అన్నీ కలిపి ఎన్ని వెర్రివేషాలేశారో, ఉద్యమాన్ని అణచాలని చూశారో వివరిస్తారు. ‘‘అంగట్ల పిసోన్నిదెచ్చి ముఖ్యమంత్రిని జేసిండ్లు’’ అంటూ కాంగ్రెస్‌లోని కుమ్ములాటలు, కేతిగాడు లాంటి ముఖ్యమంత్రులు, తెలంగాణ పట్ల వారి దృక్పథాన్ని ఎండగడతారు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. విడిపోదాం అని పోట్లాడుతుంటే, పట్టుకుని పాకులాడే వాడ్ని చూస్తూ ‘‘మానం లేనోడ’’ని ఎద్దేవా చేస్తాడు. ‘‘ఆడు, తోడపుట్టినోడు గాడు/ ఎంబడచ్చినోడు గాడు/ నడమగలసిన నక్కజిత్తులోడు’’అని గుర్తుచేస్తారు. ‘‘బట్టల, పొట్టల, కట్టల, సుట్టల అన్ని ఫరాకె’’ ఎందుకంటే ‘‘జిత్తులోడు ఆడు-నాదానుగాన్ని నేను’’ అందుకని ‘‘ఇత్తేసి పొత్తుజేసినోన్ని, పజీతు చెయ్యాలని/ పది మందిని పిలిచిన పంచాదేపిచ్చిన/ ఓళ్ళ కాళ్ళయితెనే కయ్యంగాదని పంచాది దెగింది/ ఉన్నమాటనద్దు, ఊళ్యుండద్దు అన్నట్లు/ లంగతనమెత్తిండ్లు, రచ్చరచ్చ జేసిండ్లు’’ చివరకు ‘‘రేషం జెడిపోయింది ధర్మం గెలిసింది’’ అలా ‘‘కొత్తపొయ్యి’’వెలిసింది. ‘‘రాష్టమ్రొచ్చెనని సంబురాలు/జేసుకొనుడు సగమెత్తు ఎగురుడుకాదు’’అన్ని వర్గాలకు మంచిరోజులు రావాలి. అందుకే ‘‘బంగారు తెలంగాణ కాకున్న మంచిదే/ తెలంగాణోళ్ళ బతుకులు ఆగంకాకుంటే సాలు’’అని కోరుకుంటారు. పువ్వులన్నింటిలో కంటే తంగేడు పువ్వు విశిష్టతను తెలియజేస్తూ, అది ‘తెలంగాణ రాష్ట్ర పుష్పమై/రాజ్యమేలుతున్నద’ని ఉప్పొంగిపోతారు.
ఊళ్ళలోకి వచ్చిన ఎరువుల కంపెనీవాళ్ళు ‘‘పదిమంది పక్కన కూసుండి/ మీటింగువెట్టి కంపెనీ కాయితం సేతులవెట్టి/ఈసారి ఇది గొట్టి సూడుండ్రి/ మళ్ళీ మీరే జెప్పతారు, అని/ నమ్మించి మోసంజేస్తున్నరు/ నడిగంగల ముంచుతున్నర’’ని తెలియజేస్తారు. ‘‘లైకిలోల్ల కడుపుగొట్టిన గడ్డిమందులు/ కంపెనోళ్ళ బొర్రలు వెంచుతున్నయి’’అని వారి దోపిడీని వివరిస్తారు. వేకువజామునే పొలం పనులకుపోయిన రైతు అలసిపోయి ఆకలితో ఎదురుచూస్తుంటే, కొడుకు తెచ్చిన సద్దికి ప్రాణం ఎలా లేచి వస్తుందో ‘‘శెల్కలసద్ది’’లో చూడవచ్చు. తనను ఆశ్రయించుకున్న వాళ్ళందరి బాగోగులను చూసుకునే వ్యవసాయదారుని ‘దానగుణా’న్ని కొనియాడతాడు. ఊరుఊరుగా లేదన్న విమర్శకు నిరసనగా పల్లె బతికివున్నదని ‘ఎవుసదారు ఉగాది’లో నిరూపిస్తారు. ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగించిన ఎడ్లను ఇంట్లో మనుషులుగా చూసుకునేవారు. ఇప్పుడు ముసలిఎడ్లను కట్టికోని అమ్మివేస్తున్నారు. వాటి ‘రాజాబతుకు కుక్కసావు’లా తయారయిందంటారు. ఒకప్పుడు అందరూ వాడుకున్న ‘వాగును’ ఊళ్ళోంచి మురికికాలువలను అందులోకి తోలి దాన్ని మురికివాగుగా తయారుచేయడాన్ని ఒక కవితలో వర్ణిస్తారు. వేయికళ్ళతో ఎదురుచూసినా వానలు పడడంలేదు. పర్యావరణాన్ని నాశనం చేసుకున్నాక వానలు ఎక్కడినుండి వస్తాయని ప్రశ్నిస్తారు.
‘‘నేను శిన్నగున్ననాడు/ ఎంతో గమ్మత్తుగా వుండే ఉగాది/ పెద్ద పెరిగినంక గమ్మత్తు గయాబైంది’ అంటారు. పండుగలే కాదు, మనుషుల పట్ల ప్రేమలుకూడా పోతున్నాయి. నానమ్మ జ్ఞాపకాలలోనుండి ‘ఆమె నషం డబ్బీ’ ప్రాముఖ్యతను వివరిస్తారు. బతికి వున్నప్పుడు ఆమె ప్రేమను, చనిపోయింతర్వాత ఆమె సొమ్ములను పంచుకున్న వైనాన్ని తెలియజేస్తారు. ద్రవ్యోల్బణంవల్ల నాణాలకు విలువ లేకుండాపోయి, చలామణిలోనుండి తప్పుకున్నాడు. ఉన్నవికూడా చిక్కి శల్యమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాల్యంతో ముడిపడి వున్న నాణాల జ్ఞాపకాలను ‘సముద్రం సందమామ’ కవితలో గుర్తుచేసుకుంటారు. వీటితోపాటు బొంత, కొడవలి, గడ్డిపార, పిడక’లాంటి వస్తువులను వాటి తయారీని- ఉపయోగాలను వివరిస్తూ, అవి ఎలా కనుమరుగవుతున్నాయో తెలియజేస్తారు. సామల ‘సదాశివుని’ ఇంటికెళ్ళిండంటూ రాసిన ఎలిజీకి అరిపోని ‘యాది’అని పేరుపెట్టడం చాలా బాగా వచ్చింది.
ఉన్నోనికి తిన్నదరక్క ఆపసోపాలు పడుతుంటే, వ్యవసాయ కూలీలకు కడుపు నిండటమే కష్టమైపోతుందని ఒక కవితలో తెలియజేస్తే, స్వాతంత్య్రం వచ్చి 65 ఏండ్లయినా గిరిజనుల బతుకుల్లో ఎలాంటి మార్పురాలేదని ఇంకో కవితలో వివరిస్తారు. దూర ప్రాంతాలనుండి, దూరదేశాలనుండి కుటుంబాలను వదిలి కట్టుబానిసల్లా కాంట్రాక్ట్ లేబర్ పేరిట తరలివచ్చి ఇటుక బట్టీలలో పనిచేస్తూ, చాలీచాలని జీవితాలు గడుపుతున్న ఎందరో నిర్భాగ్యుల గురించి తెలియజేసిన కవిత బాగుంది.
కవికి ఊరన్నా, ఊరి జీవితమన్నా, ఊరి సంస్కృతి అన్నా అమితమైన అభిమానం వున్నట్లు వీరి కవితల ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ భాష, ఆదిలాబాద్ యాస, పల్లెజనాల శ్వాసతో నిండిన ఈ కవిత్వంలో ‘‘అంగట8్యఔ్ల పిసోని తెచ్చి ముఖ్యమంత్రి జేసిండ్లు, కమిటి పెట్టిన కుముటుకు తుమ్మురాలె, దగ్గురాలె’’ వాక్యాలతో మంచి వ్యంగ్యాన్ని పండించారు. ‘‘మెహనత్ కరా ముర్గా, అండా ఖాయఫకీర్, పోశవ్వ పొతం జేత్తే మైశివ్వ మాయంజేసినట్టు, బోలతనాలబోతే బోకెలు శేతివచ్చాయి, గాడ్పుకు గడ్డపారలు లెవ్వయి, ఎగిరెటోనికి పందిరి కురసగాదు’’లాంటి సామెతలతో, ఈ మాండలికం కొత్త శోభను సంతరించుకుంది. ఈ పుస్తకానికి డా.ఉదారి నారాయణ రాసిన ముందుమాట మరింత ఆకర్షణను తెచ్చిపెట్టింది.

-కె.పి.అశోక్‌కుమార్