అక్షర

కవి ఒక్కడే... పాళీలు మూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు పాళీలు
(కవిత్వం)
-వి.ఆర్.గణపతి
పేజీలు: 84, వెల: రూ.60
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
040-27678430
*
పదాల కూర్పునకు ప్రాణం రావాలంటే రచనలో కావ్య ప్రతిభనైనా తొణకిసలాడాలి లేదా ఎంచుకున్న అంశమైనా హృదిని స్పృశించాలి. రెండూ లేని మామూలు వస్తువు, చప్పని వ్యక్తీకరణ రససిద్ధిని సాధించలేవు. అయితే రచయితకున్న స్వతంత్రాన్ని ఎవరూ కాదనలేరు. రాసిన దాన్ని విశే్లషించే అధికారం మాత్రం చదివిన వారందరికీ ఉంటుంది. అది రాయి అయినా పూవు అయినా రచయిత స్వీకరించాల్సిందే.
సమాజ రీతులను అవలోకిస్తూ, పౌరుడిగా తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి, తన ఆలోచనలను అక్షరాల్లో సంధించిన కవి వి.ఆర్.గణపతి. కావ్య నిర్మాణంలో తగిన పరిణతి సాధించకున్నా తనకున్న పరిజ్ఞానంతో వచన కవిత, గేయం, పద్యం ఇలా మూడు కావ్య ప్రక్రియల్లో రచనలు చేసి ‘మూడు పాళీలు’ అంటూ సంకలనం వెలువరించారు.
వచన కవితల్లో విరుపులు, మెరుపులు ఎక్కువ. సాధారణ పాఠకుడిని అలరించే గుణం వాటికుంది.
‘పెరుగుతున్న పెట్రోలు ధరలకు/ తడిసి ‘మోపెడైం’ది నా కారు’ అనడంలో నాలుగు చక్రాల నుండి రెండు చక్రాల బండికి జారిన బతుకు కనిపిస్తుంది.
‘మొదట్లో పెండున్నోని, చేతుల ‘పార్కర్’ పెన్నుపెడ్తే ఏం రాస్తరు/ తలకాయల ‘మాలు’ ఉన్నోడు సుర్మ దొరికినా సూర్యున్ని మొలిపిస్తడు’ ఇదో చురక పెట్టే పొట్టి కవిత.
రాజకీయ వ్యంగ్యం ‘గొర్రె’ కవితలో చూడవచ్చు. ‘రెండంతస్తుల బంగుల కట్టిస్తనంటడు/ నమ్మకు!/ గెలువంగనే రోడ్డు ఇరుకుటమయిందని పెంకుటిల్లు కూల్చేస్తడు..’ తెలంగాణ యాస ఇంపు ఆకట్టుకుంటది.
‘పార్టీల ఎన్నికల మానిఫెస్టోలు/ పాముల్ని దాచిపెట్టి/ నిచ్చెనల్ని మాత్రమే చూపించే/ మాయ వైకుంఠ పాళీలు’ చక్కటి కవితా స్టేట్‌మెంట్.
పొట్టి కవితల్లో తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని చెప్పగలిగినా పెద్ద కవితల్లో వాచ్యం హద్దుమీరింది. కార్యలక్షణాలు లుప్తమై, శుద్ధ వచనమై, శిల్పం కొరవడింది. సమకాలీన సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న కవి గణపతి కవిత్వ నిర్మాణంలో ఇంకా కసరత్తు అవసరం.
గేయ కవితల విషయానికొస్తే అవి గేయాలు అనుకుంటే అందులో పల్లవి, చరణం విధానం కనిపించదు. గణపతి వచన కవితలకు, గేయ కవితలకు పెద్ద తేడా కనిపించదు.
‘అన్నా! ఈ నీ దేశం/ ఎన్నటికీ నీది కాదు/ మన్ను మాత్రవే నీది!/ అన్నం వేరొక్కనిది’ అన్న భావం బాగుంది. అయితే ఈ నాలుగు వాక్యాలు గేయమనిపించుకోదు. కనీసం పల్లవి, మూడు చరణాలైనా లేనిదే గానయోగ్యం పొందదు.
మూడు పాళీలుగా వచన కవితలు, గేయ కవితలు, పద్య కవితలు అంటూ ఇందులో విభాగాలున్నాయి. అయితే వచన కవితలుంటాయి గాని గేయ కవితలు, పద్య కవితలుండవు, గేయాలు, పద్యాలు అని మాత్రమే పిలుచుకుంటాం.
కవి గణపతికి పద్య రచనలో మంచి ప్రవేశం ఉందనవచ్చు. ఆధునిక అంశాలపై చక్కనైనా పద్యాలను ఇందులో చూడవచ్చు. తాను నివసించిన కరీంనగర్ జిల్లా ప్రాశస్త్యాన్ని ప్రశంసిస్తూ రాసిన పద్యాలు చదువరులను అలరిస్తాయి. ‘పారెడు గోదావరి, మా/ నేరుల పీయూషతుల్య నీరము భువికిన్/ పైరుల, పంటల సిరులిడ/ ‘గౌరమ్మ’కు రూపమన్న కరి నగరమ్మే’ అంటూ రాసిన కంద పద్యాలు రూపసారాల్లో నిండుతనాన్ని కనబరుస్తాయి.
‘మధ్యమధ్య మద్యనిషేధం’ శీర్షికలో రాసిన సీస, తేటగీతి, ఆటవెలది, కంద పద్యాల మాలిక కవి కావ్య ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.
‘మూడు’ పాళీలు కాకున్నా, మినీ కవితల్లోని మెరుపుల్ని, పద్యాల్లోని సొగసును ఆస్వాదించేందుకు కొంత ఆస్కారం ఉంది.
పుస్తకం అట్ట చివర ఉన్న కవి గురించి రాసిన వాక్యాలు పుస్తకం లోపల కనిపించవు. రాసిందెవరో తెలియదు.
*

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-బి.నర్సన్