అక్షర

జన సాంస్కృతిక కళా మూలాల ఉద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు
(రెండవ భాగం)
-ఆచార్య జయధీర్
తిరుమలరావు
పుటలు: 252
వెల: రూ.150
ప్రతులకు: సాహితీ సర్కిల్
402, ఘరుండ
అపార్ట్‌మెంట్స్
ఉస్మానియా ప్రధాన
ద్వారం వీధి 1,
డి.డి.కాలనీ
హైదరాబాద్- 500 007.

నిర్లక్ష్యం నీడల్లో - ఒక విధమైన సాంస్కృతిక అస్పృశ్యత అలుముకొని ఉండగా దానిని ఎండగడుతూ - ఎవరిని చూసుకోవాలో, ఏం చేసుకోవాలో వేటిని రక్షించుకోవాలో, ప్రాధామ్యాలు వేటికిచ్చుకోవాలో, తెలిపే, కళ్లు తెరిపించే రచనలివి.
ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆంధ్రభూమిలో ప్రవహింపజేసిన ఆలోచనా ధారావాహికలివి.
లోగడ తొవ్వ ముచ్చట్లు మొదటి భాగం వచ్చింది. ఇప్పుడు మరింత ముచ్చటగా రెండవ భాగం వచ్చింది. రెండింటినీ సామాజిక కళా సంస్కృతుల బంధాలు కలుపుతాయి. దేనికదే చదువుకున్నా ప్రయోజనాన్ని పొందుతాం.
ప్రమేయం, వ్యాసం, వార్తాకథనం వంటి చాలా రచనా ప్రక్రియలను దాటుకుంటూ ఒక నూతన రచనా ప్రక్రియగా కూడా తొవ్వ ముచ్చట్లు కాలంలో నిలదొక్కుకునే అవకాశాలు లేకపోలేదు. పదిమందీ ఈ శీర్షికని ఉపయోగించుకుని రాసినట్లైతే, ప్రథమ భాగానికి, తిరుమలరావు తొవ్వ అడుగులలో తన అడుగులు వేసుకుంటూ వెంటే వెళ్లే ప్రగతి బాటసారి ప్రసిద్ధ రచయిత ఎ.కె.ప్రభాకర్ ‘తొక్కిన కొత్త పుంతలు’ అని రచయిత, రచనల ఆత్మాంశాలు ఆవిష్కరిస్తూ రాసిన మాటలు బాగున్నాయి. కొన్ని శీర్షిక నామాలు వంటివి తీసి రెండవ భాగంలోనూ దానిని వేయవలసింది. ప్రయోజనం ఇబ్బడి ముబ్బడిగా ఉండేదీ.
‘పాఠానికి పరిమితం కాకుండా, పాఠ్యాన్ని నోటపట్టి కాపాడుకొంటూ వస్తూన్న ప్రజల జీవితాల్లోకి రచయిత తొంగి చూశారు. పూట గడవని కళాకారుల సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవన పార్శ్వాలని ఆర్తితో తడిమారు. మరుగున పడ్డ సాహిత్యాన్ని వెలికి తెచ్చారు. మట్టివాసన లీనే మందితో ముచ్చటిస్తున్నారు. దారెంట తావిన్నవి, కన్నవి, తన పర్యటనానుభవాల్ని పదుగురికీ పంచుతున్నారు. మన సమాజం ఇవ్వాళ ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలకు శస్తచ్రికిత్స, రోగ విధానాన్ని తెలిపే ‘సైద్ధాంతిక జ్ఞానం’ అన్న ప్రభాకర వాక్యాలలో సత్యం పీట వేసుక్కూచుంది.
ముచ్చట అంటే సల్లాపం, కోరిక, ప్రేమ, వృత్తాంతం అని నిఘంటు అర్థాలు. ప్రభావతీ ప్రద్యుమ్న కావ్య ప్రకారంగా అయితే ఇష్టాగోష్టి సలిపే వ్యక్తిని ‘ముచ్చట కాపు’ అంటారు. ఇంటికొచ్చిన అతిథి కాళ్లూ చేతులు కడుక్కుని, గొంతు తడుపుకొన్నాక మంచి చెడ్డలు మాటలాడుకోవడాన్ని ‘ముచ్చట్లు’ అంటారని కేతన కవి వల్ల తెలుస్తోంది. ముచ్చట లిక్కడ తోవలో పరస్పర సంభాషణలే. వివాహాదులు అయ్యాక అచ్చట్లూ ముచ్చట్లూ బాగా జరిగాయా అనుకోవడం ఉండనే ఉంది.
ఆంగ్లంలో ఇటువంటి రచనలు కొన్ని వచ్చి ఉండవచ్చు. కళాకారుల స్థితిగతుల్ని, జీర్ణదశకు చేరే కళల్ని, భాషా విషయం గోండీ రాత ప్రతుల్నీ, గోండీ సాహిత్య ప్రక్రియల గురించి వీరుల విస్మృత కోణాల గురించి ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు అడపాతడపా రాసి ఉండవచ్చు. వాని పరిధులు, పరిమితులు వేరు. వీటన్నిటినీ ఒక ఉద్యమశీలంతో రచనోద్యమంగా అంకిత భావంతో మమేకమై రాసిన రచనలు తిరుమల రావు గారన్నది రెండు మూడు దశాబ్దాల కాల పుస్తకాలు, పత్రికలే చెబుతాయి. అందులోనూ అవసరమైన సందర్భాలలో పాలక వర్గాలకూ, ఆధిపత్య పీఠస్థులకూ చురకలు పెట్టడం కూడా రచనల్లో భాగమే. ఇలా చేసినవారు తక్కువ మంది. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా అంబేద్కర్ రచనల తెలుగు అనువాదాలు జాతికి అందించడంలో ఒక సంచాలక పాత్ర, జానపద వాఙ్మయ పరిశోధనలో వౌలిక కృషి చేయడం, రాతప్రతులపై సాధికార గ్రంథ రచన, ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగార రాష్ట్ర సంచాలకునిగా మహనీయుడు పరబ్రహ్మ శాస్ర్తీ వంటి వారి రచనలు వెలుగులోకి తేవడం, ప్రజా సాహిత్య కోణం నుంచి గ్రంథాలు వెలువరించడం. అరణ్యనేత్ర కవిత్వ రచన - ఇటువంటి ఎన్నో జ్ఞాన పార్శ్వాలలో సముపలబ్ధి అనుభవం ఇన్నింటిని మించి ‘చేతి చమురు భాగోతాల’కు వెరవకపోవడం వంటి గుణాల వల్ల ఆయన రచనలు బహుకోణ గుణాలకు ఆస్కార వేదికలయ్యాయి. ఆయా వేదికల నుండి ప్రజలతో జననాడీ జ్ఞానిగా ముచ్చటించడాలే ఈ తొవ్వ ముచ్చట్లు.
ఏమిటి ఈ గుణగాన ప్రదర్శన అతిశయోక్తులేమో అనుకుంటే దయచేసి ఇందులోని ‘మహాకవులా - ప్రజా కవులా’ అనే మూడుంబావు పుటల్ని ధ్యానంతో చదవండి. అందులోని వాక్యాలు కళ్ల నుండి రక్తంలోకి ఇంకి మెదడులో ప్రవేశించి ఆవేశాన్ని కలిగించి ఆలోచించేటట్లు చేయవా చెప్పండి.
సంస్కృతిలో భాషా లిపుల పాత్ర ముఖ్యమైనది! పెనుగులాటలో గోండీ రాత ప్రతులు’లో ఆదిలాబాద్ జిల్లా గుంజాం గ్రామంలో - గోండీ పాత రాత ప్రతుల గురించి, గోండీ జాతి గురించి, వివరాలిస్తూ ఆదిలాబాద్ గోండులపై బ్రిటీష్ శాస్తవ్రేత్త హెమన్ డార్ఫ్ ఓ పుస్తకం రాసిన అంశాన్ని వెల్లడిస్తారు. రచయిత ఆయా ప్రజలతో ముచ్చటించి అనేకం గ్రహించి తొవ్వ ముచ్చట్లు ద్వారా మనతో ముచ్చటిస్తూ జ్ఞాన శాఖల ఆదాన ప్రదానాలు నిర్వర్తిస్తారు
‘పక్షుల్ని ప్రేమించే సమయమిది’ ఒక ప్రాకృతిక విలక్షణమైన మెత్తనైన మానవీయ రచన.
‘ఇవ్వాళ పత్రికల్లో రాజకీయాలకే అధిక ప్రాధాన్యత. సమాజ సంబంధాలు, మానవీయ విలువలు, ప్రకృతి, జీవ వైవిధ్యం వంటి అంశాలు అప్పుడప్పుడు ఓ మూలకి నెట్టివేయబడి కనిపిస్తాయి’ అంటూ ‘ఒక జాతి పక్షులు అంతరించి పోతున్నాయనేది వార్తే. రాసే వాళ్లు ఏరి? అంతరించిందనుకున్న పక్షి జాతి కనిపిస్తే మరింత పెద్ద వార్త. అది పాఠకుడికి ఎలా అందుతుంది? ఆ పక్షి పత్రికా ప్రకటన పంపలేదు. మనని వేల ఏళ్లుగా పలకరించే పక్షులు మనని వీడిపోతున్నా గుర్తించలేక పోతున్నాం. పక్షులు లేని జీవితాన్ని గడిపే వృక్షాల నిశ్శబ్ద విచారాన్ని గమనించలేక పోతున్నాం’ అన్న తిరుమలన్న వాక్యాలు చదివించి, భావించినప్పుడు మానవులుగా మన కళ్లు చెమరుస్తాయి.
తాను ప్రగతిశీల భావజాల వాది అయినా రావు అవసరమైనప్పుడు, ఇటువంటి సందర్భాలలో వారిని సైతం సహేతుకంగా విమర్శిస్తారు. సమయ సందర్భ రచనల్లో కొన్ని సూక్తులు వంటివి కూడా కనపడతాయి. మొత్తం మీద ఈ తొవ్వ ముచ్చట్లు జన సాంస్కృతిక కళామూలాల ఉద్ధరణలుగా ప్రజా ప్రయోజనదాయకంగా ఉన్నాయి. కేవలం చదివింపజేయడమే కాదు, ఆలోచింపజేస్తాయి. ఇవి బహుళార్థ సాధక రచనలు.

-సన్నిధానం నరసింహశర్మ