అక్షర

పెద్దలకూ నచ్చే చిన్నపిల్లల కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపాయం - ఉపాయం
(బాలల కథలు)
-డా.వాసా ప్రభావతి
వెల: రూ.50/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
ఉమ్మడి కుటుంబాల సంప్రదాయంనుండి మనవాళ్లు నెమ్మదిగా దూరమయ్యాక పిల్లలకు కథలు చెప్పే పెద్దలూ దూరమయ్యారు. ఆధునిక పోకడలు, చదువుల్లో కథలకు పూర్వం ఉన్నంత ప్రాధాన్యం ఉండటం లేదు. కథలు చెప్పే ఓపిక, ఆసక్తి, పిల్లల మనస్సుకు నచ్చినట్లు చెప్పే తీరుబడి ఎవరికీ లేవు. పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పించాలన్న రంథి పెరిగాక కథల జోలికి వెళ్లడం తగ్గిపోయింది. ఒకవేళ చెప్పినా మన జీవన విధానానికి, సమాజానికి సంబంధించినవి తక్కువే. ఈతరం తల్లిదండ్రులకు పిల్లలకు తగినంత సమయం కేటాయించడం, కథలు చెప్పడం అనేది అరుదైపోయింది. పూర్వం ఇంట్లో ఉండే తాతయ్యో, అమ్మమ్మో, నాయనమ్మో ఏదో ఒక సమయంలో పిట్ట కథలనో, దేవుడి కథలనో, మాయలనో, మంత్రాలనో కథలు చెప్పేవారు. ఆ కథల్లో నీతి ఉండేది, రీతి ఉండేది, జాగ్రత్త ఉండేది, బుద్ధిబలం, సమయస్ఫూర్తి, భాషపై మమకారం, మానవ సంబంధాల విలువలు నేర్పే ఓర్పు, నేర్పు ఆ కథల ద్వారా పిల్లలకు చెప్పేవారు. ఒకప్పుడు నీతిచంద్రిక రాజ్యమేలితే ఆ తరువాత చందమామవంటి పిల్లల పత్రికలు ఆ బాధ్యతను తీసుకున్నాయి. ప్రస్తుతం పిల్లల పత్రికలు పెద్దగా లేవు. వాటిని చదివించే తీరికా చాలామందికి లేదు. ఆ కొరత తీర్చడానికా అన్నట్లు రచయిత్రి వాసా ప్రభావతి ప్రచురించిన ‘అపాయం-ఉపాయం’ కథల సంపుటి పిల్లలకు ఎంతో ఉపకరిస్తుంది. కథలు చెప్పే ఓపిక ఉన్నవారికి, వినాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకు ఇది ఓ మంచి కాలక్షేపం. అవసరం ఎలా సాహసాన్ని నేర్పుతుందో, నక్క గుణాలు ఎలా ఉంటాయో, వాటి నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో, పరోక్షంగా అలాంటి మనుషులతో ఎలా వ్యవహరించాలో కథల రూపంలో చిన్నపిల్లలకు నేర్పే జాగ్రత్తలు ఈ ఇందులో చాలానే ఉన్నాయి. దురాశవల్ల ఎంతటి నష్టం వాటిల్లుతుందో, కలసికట్టుగా ఉంటే విజయం ఎలా సాధ్యమవుతుందో చిన్నచిన్న కథల్లో చెప్పగలగడం ప్రభావతిగారి పిల్లల కథారచనలో పట్టును తేటతెల్లం చేస్తుంది. పదిహేను కథల సంపుటిలో పిల్లలే నేరుగా చదువుకున్నా అర్థమయ్యే రీతిలో సరళమైన, తేటతెనుగులో రచన కొనసాగింది. నిడివి తక్కువగా, అంటే కథ చెప్పినా రెండు మూడు నిమిషాల్లో పూర్తయ్యేలా రచనలు ఉండటం మరో విశేషం. 15 చిన్నకథలతో కూడిన చిన్న పుస్తకమే అయినా పిల్లలకు అమితంగా ఇష్టపడుతుందనడంలో సందేహం లేదు. కథలకు తగ్గట్లు వేసిన బాలి బొమ్మలు పిల్లల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. పిల్లలతోపాటు పెద్దలూ ఈ కథలు చదివితే తాము చిన్నప్పుడు విన్న ఎన్నో కథలు స్ఫురణకు వస్తాయి. చిన్నారులకు, పెద్దవారికి స్పష్టంగా కనిపించేలా పెద్ద అక్షరాలతో (్ఫంట్) వీటిని ప్రచురించి మంచిపని చేశారు. బాలబాలికలకు మంచిచెడులు చెప్పేందుకు వాసా ప్రభావతి చేసిన ఓ మంచి ప్రయత్నం ఇది.

-ఎస్.కె.కె.రవళి