అక్షర

అమలిన ఆథ్యాత్మిక పథం ఈ ఏకాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటరితనము... ఏకాంతము
-నీలంరాజు లక్ష్మీప్రసాద్
వెల: రూ.80/-..పేజీలు: 120
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్
ఎదురు వీధి, కాచిగూడ, హైదరాబాద్-500 027
040-24652387
**
‘్భగవంతుడు అందరిలో ఉన్నాడు.. కాని అందరూ భగవంతుడిలో లేరు.. అందుకే వాళ్లు బాధపడ్తున్నారు’ అన్న రామకృష్ణ పరమహంస వాక్యాలలోని అంతరార్థం అర్థమైతే తప్ప ఈ పుస్తకానికి నీలంరాజు లక్ష్మీప్రసాద్ ‘ఒంటరితనము.. ఏకాంతము’ అనే పేరు ఎందుకు ఎంచుకున్నారో అవగతం కాదు. మెదడుకే పరిమితమైతే పది తలల రావణాసురుడు మనలోనే తిష్టవేసే అవకాశమున్నప్పుడు భగవంతుడిలో మనం ఉండే ఛాన్స్ లేదు కాక లేదు.. అలాకాక హృదయ వైశాల్యాన్ని సాధించగలిగితే కనక మనమూ భగవంతుడిలో భాగస్థులమే అవుతాం- ఇదీ నీలంరాజు వారి ‘మేధపై హృదయ విజయం’ అన్న శీర్షిక సారాంశం.
మనలో ‘అసలు’ లేదు.. ఉన్నదంతా సెకండ్‌హాండే. వారూ వీరూ చెప్పిందే మన జ్ఞానం. అంటే మనం అరువు జీవులం. అలజడులకి ఆరడుగుల మూర్తులం. స్థిరంగాను, నిశ్చలంగాను ఉంటే తప్పితే, ఆలోచనల అభిప్రాయాలు తప్పితే తప్ప మనకేమీ ‘కనిపించదు’, ‘వినిపించదు’. ఇలా కనిపించాలి, వినిపించాలి, అర్థమవాలి అంటే తల నుండి కిందికి, ఇంకా కిందికి, అంటే మెదడు నుండి హృదయంలోనికి దిగాల్సిందే...
అప్పుడు గానీ, ఒక్కొక్క ఆలోచనలోని మన భారం తెలిసిరాదు. భారం లేని మనం, భారం కాని మనం మిగిలితే, తప్ప మనం ఏమిటో తెలిసిరాదు. అది తెలియటమంటే ‘అదే మనం అయిపోవటం’.. తెలుసుకునేవాడు, తెలుసుకునేది అంటూ ప్రత్యేకంగా లేని స్థితికి చేరుకోవటమే మన ఏకాంతం. అప్పుడు ఎటు చూసినా జీవం, సంతోషం, నవ్వులే! ఇదీ నీలంరాజు వారి ‘ఏకాంత’ కథనం!!
అన్నట్టు, మనం మేధలో జీవిస్తున్నంత కాలం ‘కోర్కెలు తీరే స్థలాలు’ కావాలి. ఆ ‘స్థలం’ ఆలయమా? నిజానికి, నిత్య జీవితాన్ని తపస్సుగా మార్చుకుంటే ఈ ఆలయాలతో పనేముంది? ప్రకృతి ఒడిలో ఎక్కడో పడి వున్న రాయిని తీసుకువచ్చి దానిని మానవాకృతితో మలిచి, తాను రూపొందించిన దానినే పూజించే మనిషికి ఈ విశాలమైన ప్రకృతి యావత్తూ పూజనీయమైనదే అనే విషయం ఎందుకు అర్థం కాదో తెలియదు. ఆ మహాశక్తిని మునులు, యోగులు కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవులలో, మహానదుల్లో దర్శించిన కాలంలో ఈ ఆలయాలు లేవు. కాలానికి అతీతంగా ప్రకృతిలో మగ్నమైన అటువంటి మునులు, యోగులు ఈనాటికీ ఆలయాలకు అతీతంగానే ఇంకా ఆ అడవుల్లోనే, మహా నదుల్లోనే, లోయల్లోనే, నదుల్లోనే మహాశక్తిని అందుకుంటున్నారు. కాబట్టి మనం చేయాల్సింది సుజ్ఞానాన్ని వెలికితీయటం.. ఇదే నీడ్ ఆఫ్ ది అవర్.
‘మనం పెద్దగా మారాల్సింది ఏమీ లేదు. కొన్నింటిని వదిలించుకోవటం తప్ప’ అని నేను నా ‘మనకే తెలీని మన రహస్యాలు’ అన్న పుస్తకంలో అన్నట్టుగా నీలంరాజు లక్ష్మీప్రసాద్ ‘ఓపిక పట్టిన రాయి’ అన్న శీర్షికలో ‘బండరాతిలో విగ్రహ స్వరూపం మొదట్నించీ ఉండనే ఉన్నది.. శిల్పి చేసిందల్లా అనవసర భాగాలను చెక్కి వేయడమే. అలా చేసేసరికల్లా స్వరూపం బయటపడింది.’ అని అంటారు. అలా అంటూ ‘స్వ స్వరూప జ్ఞానం కలిగిన క్షణాన, అంతకు ముందు పడ్డ కష్టం యావత్తూ, ఇట్టే తుడిచిపెట్టుకు పోతుంది’ అనీ అంటారు. అవును, ఎనిమిది పదులు దాటిన జీవితానుభవం వారిది. ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక అవతార్ మెహబాబా, ఒక అరవింద మహర్షి, ఒక రజనీష్ -ల తాత్వికతను మధించిన ఏకాంతవాసి నీలంరాజు లక్ష్మీప్రసాద్ జీవనసారం ఈ ‘ఒంటరితనము... ఏకాంతము’ పుస్తకం.
ఈ పుస్తకంపైని ముఖచిత్రంలో మోకాళ్లలోకి తల దించిన యువకుడు, వంగిన అతడి వెన్ను- ఒంటరితనానికి ప్రతీక అయితే, వెన్ను నిటారుగా నిలిపి, మోకాళ్లపై యోగముద్రలో చేతులను నిలిపి, తల తిప్పని స్థిరముద్రలో ఉన్న యువకుడు ‘ఏకాంతా’నికి సంకేతం. మొత్తానికి ఈ పుస్తక అందమైన ముఖ పత్రం నీలంరాజు వారి వసివాడని అక్షరాల సుగంధ లేపనమే.
ఈ పుస్తకం నిండా కథలు కథలుగా మహాత్ముల ఆధ్యాత్మిక పథ సవ్వడులు ఎన్నో, ఎనె్నన్నో. నీలంరాజు వారి మాటల్లో కొన్ని ఆ సుజ్ఞాన గుళికలు-
* అతీంద్రియ శక్తులూ, సిద్ధులూ ఎప్పుడో ఎక్కడో ఒక స్వప్రయోజనం సాధించడానికి ప్రయోగించదగినవే కానీ నలుగురి ముందూ ప్రదర్శించి చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచడానికి ఉపయోగించరాదు.
* ఒకసారి మనుషుల దృష్టి అద్భుతాల మీదికి మళ్లిందంటే, అసలైన ఆధ్యాత్మికత వైపు వారి దృష్టిని మళ్లించడం అసాధ్యం.
* వాస్తవం అమిత సూక్ష్మమైనది. నేను మీ అజ్ఞానాన్ని విచ్ఛేదం చేయడానికి తోడ్పడగలనేమో కానీ, వాస్తవాన్ని గురించి నేర్చుకోవడం మాత్రం మీరే చేయాల్సి ఉంటుంది.
* లోనికి వెళ్లే మార్గంలో నీకు చీకటీ, శూన్యమూ తారసిల్లలేదంటే నువ్వు చేసింది ధ్యానం కాదు. మార్గమధ్యంలోనే ‘నీవు’ అనే ఈ ఉపరితల అజ్ఞానం ‘కల్ల’ అని నీకు తెలియరాలేదంటే అది ధ్యానం కానేరదు.
* మనలో చాలామంది మోస్తున్నది బతుకుభారాన్ని కాదు.. మనసు భారాన్ని.
ఇలా ఈ పుస్తకంలోని నీలంరాజు వారి ఏకాంత సుజ్ఞానాన్ని గురించి ఎంతని చెప్పేది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి సుజ్ఞాన రహస్యమంతా ‘ఆధ్యాత్మిక రంగంలో మరొకరిపై ఆధారపడడం కన్నా అనర్థం వేరొకటి ఉండదు’ అన్న స్టేట్‌మెంట్‌లో లేదూ! అందుకే ఆయన అన్నట్లుగా ‘డీ హిప్నటైజ్ యువర్‌సెల్ఫ్’ అప్పుడు కానీ ఒంటరితనానికీ, ఏకాంతానికీ ఉన్న భేదం తెలీదు. ఔన్నత్యం తెలీదు. మనసుతోకాక హృదయంతో ఈ పుస్తకాన్ని చదివితే తప్ప ఏకాంతంలోని మహాశక్తి అందిరాదు.
***

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-వాసిలి వసంతకుమార్