అక్షర

మార్పుని ఆశించే చైతన్య రేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోల్ల ముంబయి కతలు
కథల సంపుటి -అంబల్ల జనార్దన్
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
రాష్ట్రేతర ప్రాంతం నుండి తెలుగులో విరివిగా, ఉరవడిగా కథలు రాస్తూ ప్రాచుర్యం వహించిన రచయిత అంబల్ల జనార్దన్. జనార్దన్ రాసిన 56 కథల సంపుటి ఇది. అన్నీ ‘మనోల్ల ముంబై కతలు’. అంటే, అన్ని కథానికల స్థల నేపథ్యం - ముంబాయి. కథలన్నిటా కనిపించే ప్రధాన వ్యక్తులందరూ తెలుగువారు. ఇతివృత్తాలన్నీ మన మనుషుల జీవితాలు కేంద్రంగా సాగినవి. అందుకనే ఈ కథలన్నిటా తెలంగాణ ప్రాంతం నుండి ముంబయి వెళ్లి ఒదిగి ఎదిగినవారూ, నిలిచి గెలిచిన వారూ పరిచయవౌతారు. వారిలో - అనేక వృత్తుల వారూ, వ్యవహారాల వారూ, చిన్నాచితకా చిల్లర వ్యాపారాల వారూ, చాలీచాలని జీతాల ఉద్యోగులూ, కొందరు పెట్టుబడిదారులూ తటస్థపడతారు. మిల్లుల్లో పనిచేసే వీవర్లూ, జాబర్లూ, ఆకాశహర్మ్యాల నిర్మాణాల్లోని తాపీ మేస్ర్తిలూ, మామూలు కూలీలూ, డిటిపి జాబ్ వర్కర్లూ, వాచ్‌మెన్‌లూ.. ఇలా చాలామంది కార్మికులూ, మధ్యతరగతి వారు మనల్ని పలకరిస్తారు. వీరందరి కలల సాఫల్య వైఫల్యాలూ, బతుకు గీతల వొంపు వాటాలూ మన ఆలోచనల్ని మథనం చేస్తాయి. ఆ విధంగా జనార్దన్ కథల్లో అనంతమైన వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. ఈ కథలన్నీ మనకు అంతగా పరిచయం కాని జీవిత పార్శ్వాల్నీ, కోణాల్నీ చూపుతాయి.
‘కష్టపడితే గాని సుఖం రుచి తెలియదు’ కనుక పిల్లలకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువ, సర్దుబాటు తత్త్వం అలవర్చాలి - అనే హితోక్తిని ‘జీవిత సత్యం’ గల్పిక అందిస్తుంది. కార్మికుడుగా ముంబైలో అష్టకష్టాలూ పడుతూ, నికృష్ట జీవితం గడపటం కంటే పల్లెకు పోయి ఆరోగ్యంగా, తృప్తిగా తనవారి మధ్యన బతకటం మేలనుకుంటాడు తాగుబోతు భీమన్న - ‘సారం సంసారం’ కథలో. కానీ, ఆ నిర్ణయం అమల్లోకొచ్చేనా అన్నది జవాబులేని ప్రశ్న! ‘సమ్‌బంధాలు’లో మేనమామ యజమాని; మేనల్లుడు ఉద్యోగి. ఆశ - అత్యాశ - దురాశ ఫలితంగా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు మేనల్లుడు. విశ్వాసం - విశ్వాస ఘాతకం మధ్యన, బాంధవ్యం - బాధ్యతల మధ్యన తిరుగుతుంది కథనం. మనిషిలో తాత్కాలిక వ్యామోహాల పాత్రనీ, విలువల పతనాన్నీ చర్చిస్తుంది నిబద్ధత ఆవశ్యకతని వాంఛిస్తుంది. చక్కటి సంఘటనాత్మక శిల్పంతో, చిక్కని శైలితో చదివించే గుణాన్ని సంతరించుకున్న మంచి కథ. మనిషి ఒక అననుకూల వాతావరణం నుంచీ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకుని గెలుపు బాట పట్టుకోగలడని చెబుతుంది ‘్భతల స్వర్గం’ కథ. ఈ కథలోని రాజు తన ఆదర్శాన్ని, మిత్రుడితో ఇలా చెబుతాడు. ‘కొందరు నిరుద్యోగులకైనా ఉపాధి కల్పిస్తాను.. ఏదీ సులభంగా సాధ్యం కాదు. ప్రతి ప్రాబ్లెమ్‌కూ సొల్యూషనుంటుంది. కీలెరిగి వాతపెట్టాలి. కష్టపడాలి. సాధించాలి’ ఇదే జనార్దన్ సమాజానికిస్తున్న సందేశం. ఇలాగే ‘శ్రీకారం’ కథ కూడా చక్కని సందేశాన్ని అందిస్తుంది. ముంబయి నగర జీవితంలో - యాంత్రికమైన పళ్ల చక్రంలో ఇరుక్కుని, తెలుగు నేర్వని ఒక యువకుడు తన రాష్ట్రానికి, అందునా తాను పుట్టిన ఊరుకు ప్రయాణమైతే భాషాపరంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చిందో వివరిస్తుందీ కథ. చివరికి ఎక్కడో అమెరికాలో ఉంటూ కూడా మాతృభాషని చదవటం, రాయటం నేర్చిన మిత్రుడి ద్వారా జ్ఞానోదయమై తెలుగు నేర్చుకోవటానికి ‘శ్రీకారం’ చుడతాడు!
‘పనితోడిదే లోకం’లో భూదెవ్వ శ్రమ విలువ తెలిసిన కర్మయోగి. నెలకు నాలుగు వేలు పగారు (జీతం) తెస్తున్న కొడుకు ఉన్నాడు. అయినా భూదెవ్వ బీడీలు చేస్తూ శ్రమిస్తూ ఉంటుంది. ‘పనిలనే పరమేసుడున్నడు. ఈ మాట యాది మరకు’ అనేది ఆమె జీవన తాత్త్వికత. ‘వైశాల్యం’ కథలో సునీత భర్త వివేక్ తరఫు ఆత్మీయులు ముంబయి వస్తే వారిని ఆదరించక విసుక్కుంటుంది. పుల్లవిరుపు మాటలతో తన వ్యతిరేకతని విసురుతుంది. కానీ వారు పల్లెలో వివేక్ తల్లిదండ్రుల బాగోగుల్ని చూస్తున్నవారు. మంచి మనసున్న వారు. వారి పట్ల ఆమె అనుచిత వైఖరికి నొచ్చుకుని తన మనసులోని బాధని భార్యతో పంచుకుంటాడు వివేక్. సునీతకి జ్ఞానోదయం కావటం ముగింపు. ‘నేను తాతనయ్యానోచ్!’ ‘శ్రీ సత్యనారాయణ వ్రతం’ ‘అనుబంధాలు - అనురాగాలు’ వంటి కథలు కుటుంబ సంబంధాల్లోని అనురక్తిని ఆవిష్కరించి మానవ సంబంధాల్లో ఆవశ్యకమైన మమత, ఆప్యాయతల పాత్రని విశదం చేశాయి. సంపుటి మొత్తానికీ వనె్న తెచ్చిన మరో మంచి కథ ‘అణచబడిన అలలు’. గొప్ప మనస్తాత్విక కథ. ముంబయిలో ఉద్యోగం చేస్తున్న చక్రవర్తికి ఇల్లాలైంది వరంగల్ జిల్లాకు చెందిన అవని. రెండేళ్ల తర్వాత కూతురు పుట్టింది. అతనికి మధ్యప్రదేశ్‌కి బదిలీ అయింది. భార్యాపిల్లలు ఇక్కడ, అతనొక్కడూ అక్కడ. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు కలిగారు. పాతికేళ్లు గడిచాయి. ఒంటరి బతుకుతో విసిగి, ఆరేళ్ల సర్వీస్‌ని వదులుకొని వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని, కుటుంబంతో ఉండాలనీ, అవని సాన్నిహిత్యాన్ని ఆశించీ ఇంటికి వచ్చాడు చక్రవర్తి. అవని అతనికి దగ్గర కాలేదు. అంతేగాక, కాలేనని నిష్కర్షగా చెప్పేసింది. ‘నా వనవంతా అడవిగాచిన వెనె్నలైంతర్వాత, ఇప్పుడు ఈ నడివయస్సులో మళ్లీ వసంతాన్ని ఆహ్వానించలే’ననీ, తన మనసంతా ఆధ్యాత్మికతతో, భక్తి శ్రవణ పారాయణతలలో నిమగ్నమై పోయిందనీ, ఆ ‘యావ’ చచ్చిపోయిందనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. చక్రవర్తి హతాశుడైనాడు. అవనికి తెలిసిన లతాభాభీ, కాశీబాబా ఆమె మనసుకి నచ్చచెప్పారు. వారి బోధలు ఫలిస్తాయనే చక్రవర్తి ఆశాభావంతో కథ ముగిసింది. ‘కులములో నొకండు గుణవంతుడుండిన కులము పెరుగు వాని గుణముచేత’ అన్న సూక్తిని నిజం చేసిన లింబగిరి కృషినీ, ఆ కృషిఫలాన్నీ చిత్రించిన కథ ‘తరాల తరంగాలు’. ‘బుడగలు’ కథ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మాంద్యం - యువతీ యువకుల భవిష్యదాశల మీద ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందో వివరించింది. ‘ఊరికి ఉత్సవం’లో గ్రామస్థుల ఐకమత్యం, సమష్టి కార్యాచరణ ఒక ఊరిని ఏ విధంగా ప్రగతిపథాన నడిపించగలదో చిత్రించారు రచయిత. ఇలా కథలన్నిటా - కృషి వుంటే మనుషులు ఋషులై, మహాపురుషులై, సమాజ నిర్దేశకులు కూడా అవుతారనే - తన జీవన తాత్త్వికతనీ, ప్రాపంచిక దృక్పథాన్నీ అంతస్సూత్రంగా కూర్చారు జనార్దన్.
జనార్దన్ కథారచనకి వనె్న తెచ్చిన ప్రధానాంశం -క్లుప్తత. ప్రతి కథా జీవితానుభవంలోని శకలంగా ఉంటుంది. సాగదీసిన పురిలేని తాడుగా ఉండదు. ఇతివృత్తానికి అనువైన కథనం చదువరి ఉత్కంఠని పట్టి నిలుపుతుంది. తెలంగాణ మాండలిక శైలి తీయదనం, స్వాభావికత కథని ఆహ్లాదపరుస్తూ మెరుస్తాయి. కొన్ని కథల్లోని వాతావరణ వర్ణన, నేపథ్య చిత్రణ గాఢమైన దృశ్య స్పృహని అందిస్తాయి. ‘మనోల్ల ముంబయి కతలు’ నిక్కంగా మనోల్ల వాడినీ, వేడినీ రసవత్తరం చేసిన మంచి రచన.

-విహారి