అక్షర

నచ్చిన వాదానికి అనుగుణంగా మార్చి రాసిన చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితుల సామాజిక సాంస్కృతిక చరిత్ర
-డా.కత్తి పద్మారావు
లోకాయత ప్రచురణలు
వెల: రూ.250
పే.255
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
పురావస్తు - చారిత్రక ఆధారాలతో నిర్మింపబడిందే చరిత్ర అని తెలిసి కూడా కొంతమంది తమ తమ వాదాలు, సిద్ధాంతాల కనుగుణంగా చరిత్రను వక్రీకరించి తమదైన రీతిలో తిరగరాసుకుని, దాన్ని ప్రత్యామ్నాయ చరిత్రగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ కోవలో వచ్చిన మరో పుస్తకమే కత్తి పద్మారావు ‘దళితుల సామాజిక సాంస్కృతిక చరిత్ర’.
నన్నయ ఆంధ్ర మహాభారతం రాయక ముందే దళిత భాషే తెలుగు భాషగా చెలామణి అయిందట. అయినా కూడా చారిత్రక ఆధారాలుగా చెబుతున్న శాసనాలు, నాణెలు, పురాణాలు, ఇతిహాసాలు, లౌకిక వాఙ్మయం, విదేశీ యాత్రీకుల రచనలు, వాస్తు నిర్మాణాలు - అన్నీ కూడా దళిత చరిత్రకు భిన్నంగా రూపొందాయి. చరిత్ర పేరిట అనేక అసత్యాలు ప్రచారం అయ్యాయని రచయిత వాదిస్తున్నారు.
ఆర్యుల విధ్వంసాన్ని ఎదుర్కొన్న మూలవాసులను అణచివేసి, వింధ్య పర్వతాలను దాటి బ్రాహ్మణ వాదం విస్తరించింది. ఆ ఆధిపత్య వాదాన్ని అన్ని రాష్ట్రాల్లో భూస్వామ్య కులాలు అందుకున్నాయి. వారు దళితుల పట్ల ద్వేషాన్ని పెంచుకుని, వారిని రాక్షసులుగా చిత్రీకరించారు. చరిత్రను వక్రీకరించడానికే రామాయణ భారతాల సృష్టికి పూనుకున్నారు అంటూ ధర్మశాస్త్రాల్లో, సాహిత్యంలో బ్రాహ్మణవాద విస్తరణ ఎలా కొనసాగిందో వివరించారు. హిందూ సమాజం మైల అనే ఆచారాన్ని పాటించడం ప్రారంభించాక, అది క్రమంగా బయటి వ్యక్తులకు కూడా ఆపాదించడం మొదలయింది. అస్పృశ్యత స్థిరీకృత సమాజం, గ్రామ బహిష్కరణ, గ్రామేతర సంస్కృతి రూపకల్పన వాటికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. క్రీ.శ.3వ శతాబ్దంలో (?) గుప్తులు హిందూ యుగాన్ని పునరుద్ధరించిన తర్వాత వర్గ సమాజం స్థిరీకృతమైంది. హిందూ జీవన విధానంలోని అసమానత, నిచ్చెన మెట్ల సమాజంగా కులాలతో ఊళ్లు చీలిపోయి కనిపిస్తాయి. గ్రామీణ భారతంలోని అస్పృశ్యత విశ్వవిద్యాలయాలకు కూడా పాకిందని తెలియజేస్తూ, కర్మవాదం ఎలా పుట్టిందో వివరిస్తారు. హిందూవాదం త్రిమతాచార్యుల మాయావాద, భక్తివాదాల ద్వారా దళిత వాడల్లో ప్రవేశించి అస్పృశ్యులుగా వుండటం పూర్వజన్మ సుకృతం అనే భావన కల్పించింది. శంకరాచార్యుల మాయావాద ప్రభావం దళిత వాడల్లో వున్న బౌద్ధవాదాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది. బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే హిందూ వాదం. బ్రాహ్మణ వాదాన్ని ఎదిరించడానికి ఎస్సీ, బీసీల ఐక్యత అవసరం. విద్యావంతులు కావాలి. దళిత సంస్కృతి- చరిత్ర - భాషలు అధ్యయనం చేయాలి.
బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రభావం నుండి బయటపడిన బ్రాహ్మణ స్ర్తిలు సమాజంలో వచ్చిన నూతనమైన సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ వంటి వాటిని గమనిస్తూ, ఎలక్ట్రానిక్ మీడియాలోకి, సైన్స్ సబ్జెక్టుల్లోకి వెళ్లగలుగుతున్నారు. దళిత విద్యార్థినులు కూడా ప్రభుత్వోద్యోగాలకే పరిమితం కాకుండా ముందుకు పోగలిగిన సామర్థ్యాన్ని పొందవలసి ఉంది. దీనికి ఇంగ్లీషు భాషాధ్యయనంతో పాటు వేగంగా అనేక తరగతులతో మిళితం కాగలిగిన పరిస్థితులను సంపాదించుకోవలసి ఉంది. సిటీల్లో నివాసమే గాక ఇంటర్‌నెట్ వాడగలిగే సామర్థ్యం, ఫేస్‌బుక్‌లు మొదలైన అంశాల పట్ల అవగాహన దళిత విద్యార్థినులకు అవసరం. అప్పుడే వాళ్లు అగ్రవర్ణ స్ర్తిలతో పోటీ పడగలలుగుతారని రచయిత విశ్వసిస్తున్నారు. ఇందులో అధ్యాయాల శీర్షికలన్నీ చూసి చరిత్రకు సంబంధించి ఏవో కొత్త విషయాలను చెబుతున్నారని అనుకుంటారు. లోపల మాత్రం వర్తమాన రాజకీయాలు, దళితవాదం, పురాణాలు, మతం, చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు కలగాపులగంగా కనిపిస్తాయి. పాఠకులు ఓపికగా, జాగ్రత్తగా చదివితే తప్ప రచయిత ఏం చెబుతున్నాడో, ఏం చెప్పదలచుకున్నాడో ఓ పట్టాన అర్థంకాదు.

-కె.పి.అశోక్‌కుమార్