అక్షర

వివిధ వస్తు రూపాల కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణ రేఖలు
(కవితా సంహిత)
-ప్రొ.ముదిగొండ శివప్రసాద్
వెల: రూ.200
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
కాచిగూడ, హైదరాబాద్-27.
**
ముదిగొండ శివప్రసాద్ గారు నిన్న మొన్నటి కవి, రచయిత కాదు. అలనాటి వారు. ఇంకా చెప్పాలంటే వెనుకటి తరం పండితులు. అయితే జాతీయవాది. ఆధునిక ధోరణుల కంటె నవ్య సంప్రదాయ ధోరణులపై మక్కువగలవారు. దేశభక్తి తన ధ్యేయంగా రచిస్తున్నవారు. ఎన్ని రాసినా చారిత్రక నవలల రచనలలో సిద్ధహస్తులుగా ప్రసిద్ధికెక్కారు. ముదిగొండ వారు రాసిన కవితలు ‘సువర్ణ రేఖలు’గా వెలువడ్డాయి. ఇందులో పద్యాలు, వచన కవితలు, గేయాలు, అనువాద కవితలు, మినీ కవితలు... అన్ని రూపాలూ ఉన్నాయి. దేశభక్తి ప్రధాన వస్తువైనా అనేక అంశాలపై కవిత్వం రాసి తమ గుండె బరువు దించుకున్నారు.
‘సాహిత్యంలో మగవేశ్య
రాజకీయ పక్క పార్టీల్లో దూరిన లాస్య
నిన్నటిదాకా నాస్తికుడు
నేడు నారాయణీయం వ్రాయడమేమిటి?
నిన్నటి ఎర్ర సిరాబుడ్డి
నేడు యతిగీతం పాడటమేమిటి?’
అంటూ కుహనా వాదులపై ధ్వజమెత్తుతారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ప్రశంసిస్తూ ‘కమ్మవిల్తుడన’ అని కులాన్ని ధ్వనింపజేయడం ఎందుకో? ద్రౌపది నవల రాయక ముందు ఈ ప్రశంస చేసి ఉంటారు. అప్పుడొక తీరు, ఇప్పుడొక తీరు.
మూడు వందల ఆటవెలదులతో శతకం రాసి ‘త్రిశతి’ పేరు పెట్టానని చెప్పారు. ‘వినుము శిప్ర వాక్కు వేదవాక్కు’ అనేది మకుటం. శిప్ర అంటే శివప్రసాద్. మొదటి పద్యంలో అమ్మనుడిపై గల భక్తిని ప్రకటించారు. అయితే ఛందస్సు గతి తప్పింది. అన్నీ ఆటవెలదులే లేవు. మకుట నియమమూ పాటించలేదు. మొత్తం 275 ఉన్నాయి. అంతా కలగాపులగమే. వివిధ వాదాలను నిరసిస్తూ రాసినప్పుడు శిప్ర కూడా తిట్లకు దిగారు.
‘శేషేన్ నీ కవిత చూశాన్
నీవొక భ్రష్టయోగివి
జీవితానికి కవిత్వానికి పొత్తులేని
ఆరాటానివి
నీ వామ భాగం గెరిల్లా దక్షిణ భాగం నెమలి’
‘దేవులపిల్లి ఆమ్రేడితాల జావళి’ అంటూ కలం జారిన చోట్లూ ఉన్నాయి అరవిందుని అక్కున చేర్చుకుంటారు.
‘అజయే భారత సంఘటనం
ఆజన్మాంతం మన లక్ష్యం
అదే జాహ్నవీ సంగీతం
అరుణోదయ శుభ సంకేతం’ అనటం,
‘రాలిన ప్రతి రక్త బిందువు
తల్లి కాలి పారాణి
కూలిన ప్రతి సమరయోధుడూ
జయ విప్లవ రాణి’
అనటం దేశభక్తికి సంబంధించినదే. అయితే ‘యోధుడు రాణి’ అనటం అర్థం కాదు. ఇందులో ఉన్న పొడుగు, పొట్టి, చిట్టిపొట్టి కవితల్లో కవిత్వం లాంటివీ లేకపోలేదు. ఎప్పుడో రాసినవి కొన్ని, ఏదో విధంగా చెప్పెయ్యాలనుకోవటం వల్ల కొన్ని కవిత్వాభాసలుగా కనిపిస్తాయి. మచ్చుకి-
‘మందికి చెప్పేందుకే నీతులు
నేను తాగేవి నేతులు
ప్రజాస్వామ్యంలో కొందరు నేతలు కోతులు’
ఇటువంటి ప్రాథమిక దశలో రాసేవి. శివప్రసాద్ గారు ప్రాచీనాంధ్ర సంస్కృత విద్వాంసులు. నవలలు రాయటంలో అందెవేసిన చెయ్యి. సాహిత్య విమర్శ వ్యాసాలు పుస్తకంగా రావలసి ఉంది. ఇప్పుడీ కవితా సంకలనం ఆత్మానందం కోసం, ముదిగొండ వారి ఆత్మాశ్రయత్వం కోసం ఉపకరిస్తుంది. ఈ పుస్తకం ‘శివప్రసాద్ కవి’ అని చెప్పటానికి తార్కాణం.

-ద్వానా శాస్ర్తీ