అక్షర

అందరికీ అక్కరకొచ్చే స్వర్ణ కుటీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణ కుటీరం
(నవల)
-పోలంరాజు శారద
వెల: రూ.120
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక విక్రేత కేంద్రాలు
**
సమాజ పరిస్థితులు త్వరితగతిని మారుతున్నాయి. ఎగువ తరగతి సంపన్న శ్రేణికి చేరుతోంది. మధ్యతరగతి స్థాయి పెంచుకుంటోంది. దిగువ తరగతి పైకి ఎదిగే యత్నాలు చేస్తూనే ఉన్నా దానితో తృప్తిపడే వైఖరి వదలలేదు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకో, ఇతర దేశాలకో వలసలు పెరిగాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చరిత్రలో భాగంగా మిగులుతోంది. అన్ని రంగాల మాదిరే వైద్యంలో అభివృద్ధి చోటు చేసుకుంది. జీవిత ప్రమాణం హెచ్చింది. వయోవృద్ధుల సంఖ్య నానాటికి అధికమవుతోంది. బిడ్డలు ఎవరి వీలునుబట్టి వారు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరే వుండవలసిన స్థితి ఏర్పడింది. ఒంటరితనం, భద్రతా రాహిత్యం మూలం వారు వేదనకు గురి అవుతున్నారు. వృద్ధాశ్రమాలు కొంతవరకు తోడ్పడుతున్నాయి. ఇటీవల ధనిక వృద్ధులకు ‘గేటెడ్ కమ్యూనిటీ’ సౌకర్యం లభిస్తోంది. ఈ నవలలోని పాత్రలు ప్రధానంగా సంపన్నులైనా కథనం సమాజ స్వరూపాన్ని చిత్రిస్తుంది. నవలకు నేపథ్యం చెబుతూ రచయిత్రి ముందు మాటలో ఇలా అంటారు: ‘వలసపోయిన కొడుకుల తల్లిదండ్రులు ఇప్పుడు కేవలం అరవై సంవత్సరాల దరిదాపులోనే ఉండి ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ అంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అసలైన సమస్యలు ఉత్పన్నవౌతాయి. రానున్న సంవత్సరాలలో ఈ సమస్య పెరిగేదే కాని తరిగేది కాదు.’ రిటైర్డ్ హోమ్స్, ఓల్డేజ్ కేర్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీస్‌ని ఆమె ‘స్వర్ణ కుటీరం’ అంటూ ‘ఎవరి తాహతు బట్టి వారు హోమ్స్ ఎన్నుకోవచ్చు’ అని సూచిస్తారు.
ఈ నవలలోని ముఖ్యపాత్ర కనక మహాలక్ష్మి. తెలివిగలది. జమీందారీ వంశం. డాక్టరవ్వాలని కోరిక. కాని కుటుంబ సంప్రదాయం వల్ల పెద్ద చదువు వీలులేదు. అయితే బాగా చదువుకునే యువకుణ్ణి పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టింది. ప్రతిభ వున్న పేదవాడు కేశవ శర్మతో వివాహమయింది. కేశవ శర్మ మెడిసిన్ చదివిన తర్వాత స్కాలర్‌షిప్‌పై లండన్ వెళ్లి ఉన్నత స్థాయిలో పై డిగ్రీలు పొందాడు. కనకమహాలక్ష్మి కోరిన ప్రకారం తండ్రి ఊళ్లో ఆసుపత్రి కట్టించాడు. కేశవ శర్మ పరిసర గ్రామాల వారికి కూడా వైద్యం చేసి అందరి మన్ననలందుకున్నాడు. కనకమహాలక్ష్మి దంపతుల కొడుకు, కూతురు మెడిసిన్ చదివి విదేశాల్లో స్థిరపడ్డారు. సవతి తల్లి బాధలకు తోడు అవిటివాడైన కృష్ణమూర్తి అన్నింటికి నిలబడి పైకి వచ్చిన కథనం యువతకు స్ఫూర్తిదాయకంగా వర్తిస్తుంది. కనక మహాలక్ష్మి అన్ని సదుపాయాలతో ఫార్మ్‌హౌస్, కాటేజీలు నిర్మించింది. కృష్ణమూర్తి దీని నిర్వహణలో తోడ్పడుతున్నాడు. ఒకసారి కనకమహాలక్ష్మి పార్కులో వృద్ధులను కలుసుకుంది. వారి వివరాలు తెలుసుకుంది. అక్కడికి వాళ్లని తీసుకువెళ్లి అవసరమున్న వారు అక్కడ వుండవచ్చునని చెప్పింది. అదే స్వర్ణ కుటీరం. స్థూలంగా ఇదీ ఇతివృత్తం. వస్తువు వృద్ధాప్యమైనా రచయిత్రి నవలలో ఎన్నో కోణాల నుంచి జీవిత సత్యాలు, సమస్యలు ఆవిష్కరించి పరిష్కార మార్గాలు చూపారు.
ఇంకా మారని మధ్యతరగతి మనస్తత్వం గురించి రచయిత్రి విమర్శ: ‘వద్దన్నా కూడా అవతలి వాళ్ల ఆరోగ్యం పట్టించుకోకుండా అతిథ్యమివ్వటం’ అంటారు. కనక మహాలక్ష్మి పార్కులో కలిసిన వారిని ఫార్మ్‌హౌస్‌కి తీసుకువెళ్లినప్పుడు వేదవతి అనే విదుషీమణి రామాయణం వచనం ముందు చేసిన సూచన: ‘అరణ్యంలో భర్తను అనుసరించిపోతున్న సీతమ్మ తల్లి అత్రి మహాముని ఆశ్రమంలో అనసూయా దేవి దగ్గర జరిపిన సంభాషణ ఈనాటి ప్రతి కోడలికి బలవంతంగానైనా చదివి ఆచరించేలాగా చేయాలి. అప్పుడే మన సంప్రదాయాలకు, సంసారాలకు తిరిగి ఊపిరి వస్తుంది’. కనక మహాలక్ష్మి ఔన్నత్యాన్ని కృష్ణమూర్తి ఇలా చెప్పాడు: ‘నా సర్వస్వం అమ్మనే నాకు, అమ్మకు రక్త సంబంధం లేదు. కాని నాకు జీవం పోసింది బంగారు తల్లిగారే. ఆవిడ నాకు తల్లి, తండ్రి, గురువు, వైద్యం అన్నీనూ’. వృద్ధుల్లో రావలసిన మార్పుపై కనకమహాలక్ష్మి అభిప్రాయం: ‘ఈనాటి వృద్ధుల్లో మూడొంతుల మంది ఈ కాలానికి అనుగుణంగా మారలేక పిల్లల్ని బాధపెడుతున్నారు. కొంతమంది పిల్లల నిరాదరణకు గురైన వాళ్లు కూడా లేకపోలేదు’
స్తోమత వుండి అసంతృప్తితో అవస్థ పడుతున్న వారికి స్వర్ణ కుటీరం ఒక ఆసరాగా ఆమె భావించి ఏర్పరచింది. కృష్ణమూర్తి మాటల్లో ‘మన స్వర్ణ కుటీరంలో వున్నవారంతా తమకు తాము కావాలని వచ్చి చేరినవారే. బలవంతంగా అంటే అందరూ అనుకుంటున్నట్టు ఇంట్లో ముసలివాళ్లను వదిలించుకోవటానికి వదిలేసిన అనాధలు ఎవరూ లేరు.’
వృద్ధులే కాక కుటుంబంలో అందరూ చదివి ఆలోచించి, ఆచరణ పెట్టవలసిన ఉత్తమ మార్గాలెన్నో ఈ నవలలో వున్నాయి.

-జిఆర్కె