అక్షర

జీవన గమనంలో జరుగుబాటు మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారిపోయెరా కాలము
(టైలర్ల జీవితాల్లోని
కష్టసుఖాలను
చర్చించిన నవల)
-వి.వెంకట్రావు
పేజీలు: 216
వెల: రూ.80/-
ప్రచురణ: ఎన్.కె.పబ్లికేషన్స్
విజయనగరం.
*
జీవితం ఎప్పుడూ ఒక్క మాదిరిగా ఉండదు. మంత్రగాడి చేతిలో కర్రలాగ అనేక మెలికలు తిరుగుతూ ఉంటుంది. మానసిక విధానం వల్ల, బుద్ధి కుశలత వల్ల మనుషులు తమ జీవన విధానంలో అనేక మార్పులు ప్రవేశపెట్టుకుంటారు. ఈ మార్పులు తాత్కాలికంగా ఇబ్బందికరంగా వున్నా, ముందు ముందు సుఖకరం చేస్తాయి జీవితాన్ని. అది అందరికీ తెలిసిన విషయమే అయినా, మొదట అభివృద్ధికి ఆనకట్టలు వేయడం, ఆపైన వాటిని వంతెనలుగా మార్చుకుని ముందుకు వెళ్లడం అలవాటు అయిపోయింది.
వృత్తిపరంగా మార్పులు వస్తున్న పరిస్థితులు అన్ని తరగతులలోనూ వున్నాయి. ‘బస్సు పుట్టింది. బళ్ల వాళ్ల కడుపు కొట్టింది’ అని లోగడ ఒక పాట వుండేది. బస్సులు ఎంతో మార్పులు పొందాయి. ప్రయాణ సాధనాలుగా కార్లు, కాబ్‌లు వచ్చాయి. రైళ్లు, విమానాలు సరేసరి. అయినా కొందరు తమ స్వంత ప్రయోజనాల కోసరం ఇంకా పాదయాత్రలు చేస్తూనే వున్నారు. సైకిల్ రిక్షా, జట్కా బండి లాంటివి పూర్తిగా మాయం అయిపోతున్నాయి. కుల వృత్తులను నమ్ముకున్న వాళ్లు కూడా తమ వృత్తులు వదిలి కొత్తకొత్త జీవనోపాధులు వెదుక్కుంటూ మనుగడ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైలర్స్ (దర్జీ వాళ్లు) కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకోవలసి వస్తోంది. వీటిలో వున్న ఇబ్బందులు, సుఖాలు చెప్పే నవల ఇది. కథానాయకుడు ‘నారాయణ’ అనే టైలర్. అతని తండ్రి రిక్షా కార్మికుడు. కొడుకు కూడా తన మాదిరి కాకూడదని అతన్ని దర్జీ దుకాణంలో పని నేర్చుకోవటానికి ప్రవేశపెడతాడు. నారాయణ స్వతహాగా సృజనాత్మకత, లోకజ్ఞానం ఉన్నవాడు గనుక అతి త్వరలోనే ఈ వృత్తిలో వున్న మెళకువలు, తళుకులు తెలుసుకుని మిన్న అయిన ‘దర్జీ’గా రూపు కట్టుకుంటాడు. విజయనగరంలో నివాసం. ఇక్కడ ఎక్కువ బేరాలు లేవు. ఒరిస్సా నుంచి దసరా పండుగ కోసం ఎక్కువ పని వస్తుంది గనుక అక్కడి టైలర్ దుకాణదారులు ప్రతి యేటా విజయనగరం వచ్చి ఇక్కడి పనివాళ్లను తాత్కాలిక వేతనం మీద తీసుకుపోతారు. ఎంత తక్కువగా చూచుకున్నా ఈ పది రోజుల సీజన్‌లో ప్రతి పనివాడికీ ఆరు నుంచి పది వేల దాకా లబ్ధి అవుతుంది. దీని కోసం ఎదురుచూస్తున్న నారాయణ ఆ సంవత్సరం నుంచి ఈ గిరాకీలు లేవని తెలుసుకుని నీరసపడిపోతాడు. అప్పుల భారం ఒకటి, పండుగ కోసం వచ్చే కొడుకు, కోడలు, కూతురు అల్లుడిని మర్యాదగా చూడడం ప్రత్యేక బాధ్యత. అతను ఇలా కుములుతూ వుండగానే దురదృష్టం అతన్ని మరింత దౌర్భాగ్యుడిని చేస్తూ ఒక రిక్షా యాక్సిడెంట్‌లో చిక్కుకుపోయి చేతి ఎముకలు స్థాన చలనం చెందుతాయి. తప్పనిసరిగా అతను కొడుకు దగ్గరకు హైదరాబాద్ చేరుకుని అక్కడే పూర్తిగా నయం అయ్యేదాకా ఐదారు నెలలపాటు ఉండిపోవలసి వస్తుంది. పూర్తిగా నయం అయిన తర్వాత తిరిగి విజయనగరం వెళ్లిపోయి వెనుకటి దుకాణంలో పనివాడుగా చేరతాడు. ఇదీ కథ. హైదరాబాద్‌లో వున్నప్పుడు అతను చూచిన వింతలు, కలుసుకున్న కొత్త మనుషులు, వాళ్ల పరిచయాలు, ఆలోచనా ధోరణిని మార్చివేసే సన్నివేశాలు నవలను బహు పుష్టికరంగా తయారుచేసి, చదువరికి కూడా అనేక కొత్త విషయాలు తెలుపుతాయి. పిల్లల కుటుంబాలు పడుతున్న పరిశ్రమలకు తోడుగా తను కూడా పని చేసి కొంత ఆర్థిక సహాయం చేయాలని అతని ఆరాటం. హైదరాబాద్‌లో అతనికి ‘ఆచారి’ అనే ఒక బంగారు నగలు తయారుచేసే మనిషి; అతని భార్యకు ‘మంగ’ అనే స్నేహితురాలు దొరుకుతారు. వీళ్ల వల్ల ఈ దంపతులు అనేక కొత్త విషయాలు తెలుసుకో గలుగుతారు. బట్టలు కుట్టించుకోవడం మానివేసి, ప్రతి పల్లె ప్రాంతంలో కూడా రెడీమేడ్ దుస్తుల దుకాణాలు రావడం; అలాగే నగలు చేయించుకోకుండా - తయారైన వస్తువులను జ్యువలరీ షాపుల్లో కొనుక్కోవడం అభివృద్ధి. ఈ అభివృద్ధిలో కార్మికుడి అదనపు శ్రమను పెట్టుబడిదారు ఎలా లాభదాయకంగా ఉపయోగించుకుంటాడో సోదాహరణంగా సంభాషణలు వున్నాయి. బట్ట - షర్ట్ లాంటిది కూడా ఒక్క చేతి మీదుగా కుట్టడం కాకుండా స్పేర్‌పార్ట్స్ లాగ తయారుచేసుకునే యంత్రాలు రావడం, మగ - ఆడ సంబంధాలలో పెళ్లికి ప్రత్యామ్నాయంగా ‘లివింగ్ రిలేషన్ షిప్’ వంటి వ్యవస్థ రావడం, వాటి అనుకూల ప్రతికూలాల చర్చలు నవలలో విడదీయరాని భాగంగా ఇమిడిపోతాయి.
ఎన్నో సాంకేతిక వివరాలు తెలుపుతూ వున్నా, కథా గమనానికి అవి ఏ మాత్రం అడ్డు కాకుండా రచన సాఫీగా సరళ రేఖ లాగ సాగిపోతుంది. వృత్తిపరమయిన నవలలు మనకు తెలుగులో బహు తక్కువ. వీటిలో ఈ నవల నీలాకాశంలో చుక్కలాగ మెరుస్తుంది. సాహిత్యాభిమానులందరూ విడవకుండా చదవవలసిన నవల ఇది.
*
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-శ్రీవిరించి