అక్షర

హృదయ విషాద వీచికల్ని పారద్రోలే తుషార గీతికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండే వర్ణాలు
సవ్యసాచి
వెల: రూ.125/-
ప్రతులకు: సవ్యసాచి, ప్లాట్ నంబర్:4, సప్తగిరి కాలనీ, వివేకానందనగర్, కూకట్‌పల్లి
సెల్: 8125793511
---
సముద్రంలో నిరర్ధకంగా ఎగిసిపడే తరంగాల్లో ఒక కొత్త అర్ధం స్ఫురించినట్టు, దుఃఖం శిఖరాగ్రం చేరినప్పుడు, తమ పరిసరాలు విచారంగా ఉన్నప్పుడు స్వార్ధాన్ని దాటి లోకం కోసం మమేకమైన వాడు, జన సమూహంలో తానూ ఒకడిననే స్పృహ కలిగిన వాడు అన్యాయాల్ని అరిగించుకోలేడు. దారుణాల్ని సహించలేడు. తన కర్తవ్యాన్ని గుర్తెరిగిన వాడు కవే అయితే కత్తివంటి కలంతో యుద్ధం చేయడానికి పూనుకుంటాడు. అగ్ని కనిపించనంత మాత్రాన అస్తిత్వం స మసిపోదు. కాల ప్రవాహ ధ్వనిలో వచ్చే విపరీత ధోరణుల్ని వినగల చక్షువులు కల ఇతడు కఠినతరమైన సంక్లిష్టమైన బాధ్యతను చేపట్టడంలో వెనకడుగు వేయడు. ఛేదించవలసింది ఎంతటి బలోపేత్తమయినదయినా ఒంటరిగా పోరాడడానికి జంకని ‘వీరత’ని కలిగి ఉంటాడు. అగ్నిలో కాలిన రాగిలా తళతళలాడిపోయే తత్త్వంతో వుంటాడు. దాహర్తుల దాహాన్ని గుర్తెరిగిన వాడు తన సుఖంకోసం, తన సౌఖ్యం కోసం చేతులు ముడుచుకుని కూర్చోలేడు.
ఇక్కడున్నవి రెండే వర్ణాలని ఉద్ఘాటించిన ‘రెండే వర్ణాలు’ కవితాసంపుటి కవి ‘సవ్యసాచి’. అవి శ్రామిక వర్గం, దోపిడీవర్గాలుగా చెప్తారు. అవిలాంటివంటే ఒకటి పొద్దు పొడిచేదని, ఇంకోటి ఆ పొద్దుని తుడిచేదని హృద్యంగా, ధ్వని ప్రధానంగా వినిపించిన వీరి పుస్తకాలలోని లోపలి పేజీల్లోకి అడుగుపెడితే...
ఎప్పుడో పరాకుగా ఉన్నప్పుడు ప్రచండ తేజస్సుతో ఒక ఉల్క ఒక్క క్షణం వెలిగి గగనమంతా పాకి వెలుతురునిస్తూ అంధకారం మింగివేయగానే విలీనవౌతోంది. ఏ కాలంనుంచో ఇలాంటి చీకట్లుండడం అలవాటయిన నిర్లిప్తతని తొలగించే ప్రయత్నం చేసే వీరులు పుడుతూ, అస్తమిస్తూ ఉంటారు. నిర్మలమైన ప్రకృతిలో నల్లని రేఖలు గీయబడ్డప్పుడు చీకట్లు చీల్చుకుని వేకువలై మొలచిన కాంతిరేఖలు కన్నులనంటిన అగ్నిరవ్వలూ వృధాపోవు. మళ్లీ మళ్లీ మొలచుకొస్తాయి. పుడమి కడుపున తూర్పు దిక్కును చీల్చుకుని వస్తాయంటారు ‘వేగుచుక్క’ కవితలో. ఇంకా...
ఘీంకారపు కంఠాలు/సంధించిన ప్రశ్నలు
ఎదురు తిరిగిన దేహాలు/తెగిపడుతూనే ఉన్నాయి
కొత్త మొలకలై యోధులు/పుడమి కడుపున
మళ్లీ మొలుచుకొస్తారు/తూర్పు దిక్కున చీల్చుకొస్తారు
అంటూ ప్రచండ వేగంతో శిలలను ఢీకొనే ప్రవాహాన్ని కాలాతీతమైనా కరుణార్ధ్రతతో చిప్పల్లిన కంటినీరుతో ‘కంచుగంట’ మోగేలా వినిపిస్తారు.
కమనీయమైన వసంత వెనె్నలలో కలలన్నింటినో మూటగట్టి తీరాల వెంట నడుస్తున్నప్పుడు కంటికి కనిపించకున్నా మనసు గ్రహించే మనోమయ స్థితిలో అంతరంలోని బడబాలనం ఉప్పొంగి, ఆ తీరాలను తడికళ్ల మేఘాలనుండి వర్షిస్తూ రాలిపడుతున్న కలల చప్పుడు ఆకులు రాలిన చెట్టులా జ్ఞాపకాలు దొంతరల్ని కూల్చేస్తున్నాయని చెప్పే అభివ్యక్తి దివ్య సందేశాన్ని ఇస్తుందనడంలో, ఆ కవిత్వరీకించిన పద్ధతికి కళ్లు చెమ్మగిల్లుతాయనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.
కొన్ని నిశిరాత్రుల తర్వాత/వేకువపై/ఎదురుచూపు కల
మోడువారిన చెట్టునుండి/మొలకెత్తే సూర్యోదయాలకై
ఎండిన నేల/చినుకు రాకకై/నిరంతరం కనే కల
అదో ‘స్వేచ్ఛ కల’ అంటూ ‘స్వేచ్ఛా కల’ కవితలో తన అక్షరాల మధువులొలికించారు.
‘‘లేత మంచు పూలు ధరించిన/పచ్చని ప్రకృతి ప్రేయసి
ఆ మహిమన్నద/ఎద సొదలను
నా హృది లయలతో/పంచుకుంటున్నవి’’
‘‘చినుకు రాగ సంగీతాన్ని పల్లవించి/శిశిర వేదన కన్నీళ్లను పేర్చి ఈ జగతికి జీవం పోస్తాయి/చతుర్ముఖుని హస్తాలు. తనివి తీరని ఈ ప్రకృతి కాంత అవనిని అంతటినీ పరుచుకున్న/గంధం’’ అంటూ...
నిర్లక్షిస్తే...సర్వం తుడిచేసే భీకర విలయకారిణో, ప్రేమిస్తే అమృతం కురిపించేనని చెప్తూ-తాను ప్రకృతి ప్రేమికుణ్ణని, నిరంతర ఆరాధకుణ్ణని చెప్పడం ప్రేయసి మొదటి సంతకం అనే కవితకే సర్వాంగ సుందరమైన వనె్న తె చ్చింది. వీరి మాటలు, అక్షరాలు, కవిత్వరీకించిన పద్ధతి అత్యంత సహజత్వాన్ని సంతరించుకోవడం విశేషం. ప్రకాశిస్తున్న సూర్యుడు హృదయ విషాద వీచికల్ని పారద్రోలే తుషార గీత మంటారు ‘సవ్యసాచి’.
‘నేలతల్లి బిడ్డలో/ఎండిపోయిన వరి కంకులో
కన్నీరెండిన కళ్లతో/నీ కళ్లముందు జీవులు
ఎక్కడ తిన్నారో/పసిగుడ్డులు
ఎంగిలి కుక్కల కాట్లాడుతున్నారో
పీల్మెంట్లని పరుచుకున్న ఈ పువ్వులు
తల్లిలేక కడుపు తలదాచుకున్న గువ్వలో!’’
ఇటువంటి కవిత్వం చదువుతున్నప్పుడు ఏ మనిషైనా హృదయం ద్రవించి రాలి పడలేని రక్తాశ్రువులు కళ్లల్లోనే ఎర్ర జీరలై నిలిచిపోతాయి. సమాజంవైపు దృష్టి సారించి పరికించినవారిని చెత్త కుప్పల్లో విదిల్చిపారేసిన ఎంగిలాకుల్లోని మెతుకుల్ని ఏరుకుని అదే పరమాన్నంగా తినే అనాధుల ఆర్తనాదాల్ని అక్షరాల్లో కళ్లముందుంచి అణగారిపోతున్న మానవత్వాన్ని మేల్కొలిపే దిశగా కదుల్తూ పాఠక లోకాన్నంతటినీ తనతో తీసుకెళ్లి నిత్యసత్యాల్ని కళ్లముందుంచిన సవ్యసాచి గారి కవితాక్షరాలు, దృష్టి అతి పదునైనవి. పెట్టుడు అలంకారాలు లేని ఈ కవిత్వం అతి సహజంగా సాగుతుంది. దానికో గొప్ప ఉదాహరణ...
‘‘ఆడు మొగ్గైనా తొడగని చిగురమ్మా
నేలతల్లిని ఇప్పుడే చీల్చుకొచ్చిన చిరుమొలకమ్మా
పాలబుగ్గల్లో పాలింకని బిడ్డమ్మా
నీ కళ్లముందు కదలాడు పసిగుడ్డమ్మా! అంటూ అద్భుత ప్రయోగం చే సారు ‘మలముఖాల చారికలు’ కవితలో.
యుద్ధ భూమిలో/తెగిపడ్డ/అమాయకత్వం
కనిపించని శత్రువుతో/ఎలా సమరం చేయాలని అడిగింది
నగ్నంగా నర్తిస్తున్న ఉన్మాదం/జీవన వర్గాలను తినేసి
శిశిరాల్ని చిత్రించింది!’’
‘నెత్తురు చిత్రం’ కవితలో తన అంతులేని ఆవేదనని ఒక్కొక్క అక్షరంలో తానో అక్షరమై, అక్షయమై నిలిచిన సవ్యసాచి నిశ్శబ్ద బ్రహ్మాండ శబ్దకారి. మనిషి ఎంత శాంతిని కావాలనుకుంటాడో అంతటి భయంకరమైన యుద్ధాలు బయటపడుతున్నాయి. ప్రస్తుత ఉత్పత్తి యంత్ర విధానమొక్కటి చాలు సమస్తాన్ని నాశనం చేసే దుష్టశక్తిలా.
వ్యవస్థలో ఆర్థిక, రాజకీయం ‘మనిషి’ అనే పరిమళాన్ని మాయం చేసింది. అంతా వర్తక సమాజమైనప్పుడు విషాదాన్ని వెలిబుచ్చే దిశగా అక్షర యుద్ధానికి సిద్ధమైన కవి ‘సవ్యసాచి’.

-బులుసు సరోజినీ దేవి