అక్షర

కులం పుట్టుమచ్చలు చెరిపేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుమచ్చ
-ఖాదర్ మొహియుద్దీన్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

** ** ** **

పుట్టుమచ్చ మనిషి గుర్తింపు చిహ్నం. ఎక్కడా పారేసుకోలేని ఎన్నటికీ పోగొట్టుకోలేని ఎప్పుడూ సవరించుకోలేని తొలి తరం ఆధార్ కార్డ్. ఆ చిహ్నాలు మన వొంటిపై తోబుట్టువులు.. అక్షరాభ్యాసం నాడే అధికారిక ముద్రలు, సంక్రమిత డీఎన్‌ఏ లైన నిర్ధారిత పుట్టుమచ్చలు పౌర నిరూపిత గుర్తింపునిస్తాయి..
ఇంతవరకూ ఆమోదనీయమే కానీ.. కొన్ని సామాజిక పుట్టుమచ్చలు వ్యక్తులను వేధిస్తాయి. వెక్కిరిస్తాయి. వెలివేత వివక్షకు గురిచేస్తాయి. కుక్కలు పసిగట్టే వాసనాల ప్రపంచ ఎడారి ఇసుక జనరాసిలో ఉన్నా సరే బయటేస్తాయి. పుట్టక మునుపే మునుపటి కుట్రలకు భాగస్వామివని చరిత్ర నేరాలకు వారసుడివంటూ.. అమ్మ కడుపులో ప్రాణం పోసుకుంటుండగానే అభియోగిత వారసత్వమిస్తాయి.. పేరు పెట్టకముందే ఏదో పేరు పెడతాయి.
అవి వ్యక్తి గౌరవాన్నిచ్చే పుట్టుమచ్చలు కావు. సామాజిక క్షోభను రగిలించే మచ్చ పుట్టులు.. ఏమైతేనేం ఆ మచ్చ పేరు మెజార్టీ దేశంలో మైనారిటీ కులం.. హిందూ, బౌద్ధ దేశాల్లో ముస్లింలు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ తదితర ముస్లిం దేశాల్లో హిందువులు మచ్చ పుట్టుల పుట్టుమచ్చలు.
పరిశ్రమల్లో వస్తువుల్లా సామాజిక వర్గాల మూసల్లో జనం ఉత్పత్తిని లెక్కకడుతుంటే పుట్టే ప్రతి ఒక్కరు మనువు శాసించిన కుల వారసులే కానీ విశ్వ నరులు కారు. ఆక్షేపిత వర్గాల్లో పుట్టినందుకు కులం కలువలు బలి శిలువలు ఎక్కక తప్పటంలేదు. చీడ చేరితే ఆ ఆకులను లేదా కొమ్మల్ని తొలగిస్తాం.. చెట్టును సమూలంగా నాశనం చెయ్యం.. ఆ చెట్టు విత్తనాలను చీడ పేరుతో నిషేధించం. కానీ ఒక సామాజిక వర్గంలో కొందరు అతివాదులను.. ఉగ్ర జాడలను చూపి ఆ జాతినంతటినీ నేరస్థులుగా పరిగణించే అన్యాయం కుల ద్వేషపూరిత కొన్ని దేశాల్లో చోటు చేసుకుంటుండటం శోచనీయం. బాధితులకు శోకనీయం.
కుల వివక్ష అనాదిగా వస్తున్నట్టుగానే ఈ ఆవేదనా ఈనాటిది కాదు.. బాధ వ్యక్తం సహానుభవం కన్నా స్వీయ అనుభూతి ఎక్కువ ఆవేదనాభరితంగా ఉంటుంది.
1991లో ఖాదర్ మొహియుద్దీన్ రచించిన పుట్టుమచ్చ కవిత్వం ఈ ఆక్రోశపు అక్షర సమూహమే. సామాజిక తిరుగుబాటు కోణంలో ధిక్కార స్వరం వినిపించిన ఈ అభ్యుదయ కవిత్వం సాహిత్యంలో సంచలనాన్ని గుర్తింపును సంతరించుకుంది. జన్మతః ముస్లిం సామాజిక వర్గమైన కవి తన కులానికి వాటిల్లిన వివక్ష ఉపద్రవాన్ని ఎలా పారించాడో చూడండి.
- నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నా పేరు నమోదయ్యింది.
- ఒక కట్టుకథ నన్ను కాటేసింది/ ఒక వక్రీకరణ నన్ను వంచింది -ఎంత ఆవేదనాభరిత వాక్యాలివి ఎంత ఆర్ద్రవంత కవిత్వమిది.
- కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించిన చరిత్ర.. అన్నదమ్ముల్ని చీల్చి నన్ను ఒంటరిని చేసింది చరిత్ర/ చరిత్రలో పుట్టినందుకు చేయని నేరానికి శిక్షకు గురవ్వటంపై పెల్లుబికిన నిరసన రూపం.
- చరిత్రను మతంగా మతాన్ని చరిత్రగా చిత్రిస్తున్న పాలకుల ముంగిట కావలి కుక్కల మొరుగుల్ని విని నేను నవ్వుకుంటాను.. నిజానికి నాది నవ్వు కాదు నేను అనునిత్యం అతి సునాయాసంగా దిగమింగే ఆర్తనాదం/ ఎంత పదునైన గాయం ఎంత బరువైన విషాదం.. అయినా సహనం సామరస్యం.. కులం పేదోడి కోపం పెదవికి చేటన్న సత్యం...
- వక్రీకరణకు వత్తాసుగా పద బంధాన్ని సృష్టించి నన్ను వెక్కిరించటానికి వెనుదీయని మహాకవిని నేను మన్నించలేను.. రాజుకు పేదకూ మధ్య భేదాన్ని చూడలేని ప్రజాకవి ఉద్రేకానికి నేను ఉర్రూతలూగలేను/ ఒకటి రెండు సందర్భాల్లో శ్రీశ్రీ, సుద్దాల హనుమంతుల పదబంధాలు పాటలు తన కులాన్ని చులకన చేసే విధంగా ఉన్నాయన్న కవి తిరుగుబాటుకు దర్పణం.. 1972 బంగ్లాదేశ్ విభజన సమయంలో అక్కడి హిందువులు, తెలంగాణలో 1947 తరువాత రజాకార్లను అణచివేసే పేరుతో ముస్లిం కుటుంబాలు.. ప్రస్తుతం మయన్మార్లో రోహింగ్యాల కష్టాలు పుట్టుమచ్చ కవిత్వంలో కవి హృదయంలో నేటికీ ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడెక్కడున్నాయో వెతికి పట్టి కులం పుట్టుమచ్చలు చెరిపేయాలి. మరుగున పడుతున్న మనిషితనం పచ్చబొట్టు పొడవాలి. భూగోళమా నీ గ్లోబల్ చేతిని అందించు...

-కంచర్ల శ్రీనివాస్