అక్షర

స్వాదు సరళిలో సరస కథాకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నము లాద్య సత్క్థల్/వావిరిబుట్టు రత్నములవారిత సత్కవి కల్పనా విభూ/షావహ పూర్వ వృత్తములు సానలదీరిన జాతిరత్నముల్...(కల్పిత గాథలు కల్తీ రత్నాలు. ఆదినుంచీ క్రమానుగతంగా చెప్పబడుతూ వచ్చిన కథలు తరువాత తరువాత కవిత్వాన్ని అద్దుకొని నిలచిన, సానలు దీరిన జాతి రత్నాలు)’’ అన్నాడు ప్రసిద్ధ ప్రబంధ కవి రామరాజ భూషణుడు. ఈ పసిడి పలుకుకు ప్రబల తార్కాణంగా ఇటీవల సాహితీలోకంలో కనిపిస్తున్న కావ్యం ‘ఊర్వశి’. కవి సద్యస్సృష్ట పాత్రాభినయ అవధాని, సరస సాహితీ ‘ప్రతిభామూర్తి’ (ఎవార్డు గ్రహీత) డాక్టర్ ధారా రామనాధ శాస్ర్తీ.
ఊర్వశీ పురూరవులు అనే ఒక పురాణ దంపతుల రసవత్తర గాథ ప్రప్రథమంగా ఋగ్వేదంలోను, ఆ తర్వాత కావ్య పురాణేతి హాసాల్లోను, మహాకవుల నాటక వాజ్ఞ్మయంలోను బహుభాషల్లో బహురీతుల్లో కథా శరీరాన్ని ఆవిష్కరించుకుంటూ వచ్చింది. మనువు, శ్రద్ధ, ఇడ అనే పాత్రలతో మన మానవజాతి ప్రారంభ గాథగా ‘కామాయని’ అనే పేరుతో హిందీలో జయశంకరప్రసాద్ ఒక కావ్యం వ్రాశాడు. హిందీలోనే దినకర్ ఊర్వశి ప్రణయ వృత్తాంతాన్ని కావ్యంగా రాశాడు.
ఇలాంటి కవితా సృజనాక్రమంలో కృతయుగానికి భరత వాక్యంగాను, త్రేతాయుగానికి నాందీ ఘట్టంగాను భాసించిన పురూరవ చరిత్ర భిన్న భిన్న మాత్రాచ్ఛంద రీతులలో సరళ భాషా సుందరంగా, ఒక కథా కావ్యంగా, ధారా వారి ‘ఊర్వశి’గా రూపొందింది.
విష్ణువు సృజియించిన ఊర్వశిని బుధుని పుత్రుడైన పురూరవుడు మోహించి, ఆమె అంగీకారంతో తన అర్థాంగిగా చేసుకుంటాడు. నరపాలుడైన పురూరవుని కోసం ఊర్వశి ఇలాతలానికి దిగివచ్చి, ఆరు ఋతువుల సంపూర్ణ సంవత్సర కాలం దాంపత్య సుఖాన్ని ఇస్తుంది. ఆ తరువాత తిరిగి స్వర్గానికి వెళ్లిపోతుంది. ఇలా ఆరుసార్లు ఊర్వశీ పురూరవుల యోగ వియోగాలు జరుగుతాయి. ఆరు సంవత్సరాలలో వరుసగా ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, అయుడు, జయుడు, విజయుడు అనే ఆరుగురు కొడుకులు పుడతారు. ఇదీ స్థూలంగా ఈ కావ్యంలోని కథ. ఈ ఆరుగురుకానీ, ఊర్వశీ పురూరవుల ఆరు పర్యాయాల సమాగమం గానీ ఆరు ఋతువులకు ప్రతీక.
ఈ కావ్యం మొత్తం ఒక ప్రతీకాత్మక-లేక-సంకేతాత్మక కావ్యం; ఒక అనువర్తిత పౌరాణికం(ఎప్లైడ్ మిథాలజీ). రామనాథశాస్ర్తీగారి మాటల్లో ఊర్వశి అప్సరస్తత్త్వానికి, పురూరవుడు ప్రణయ యజ్ఞతత్త్వాలకు, ఇందులోని మైత్రావరుణ పాత్రలు విశ్వ చేతన-అచేతన తత్త్వాలకు ప్రతీకలు (సంకేతాలు). యజ్ఞంలో నిప్పును రాజేసే అరణి అనేది ప్రకృతి-పురుషుల సంయోగానికి చిహ్నం-ఇలా ఈ కావ్యంలోని ప్రతీకల వివరణలను 58వ పుటలో ‘అరణి’ అనే విభాగంలో అందించారు కవి ధారా సులభ గ్రాహ్యంగా.
ఇక కావ్యగుణ ఆకర్షణల విషయానికొస్తే ముఖ్యంగా కథా కథన, గమనాలు ఉత్కంఠ భరితంగా సాగిపోతాయి. మిత్రావరుణుల శాపము, ఊర్వశి వెంట ఎప్పుడూ రెండు మేకలు ఉండడం, ఏ మేకకు హాని జరిగినా వెంటనే ఊర్వశి ఊర్థ్వలోకానికి వెళ్లిపోవడం, అమరేంద్రుని ఆధిపత్యాహంకార లక్షణాల ప్రదర్శన, ఊర్వశికి పురూరవుడు నగ్నంగా కనిపిస్తే చాలు ఆ దాంపత్యానికి సద్యోవిఘాతం, కథానాయకుడికి ఒక నిప్పుల గినె్న తన నాయికా రూపంగా కనిపించడం, చివరకు పురూరవుడు చిరంతన సత్యద్రష్టై ఆ అగ్నిపాత్రను ఆవలకు విసిరేసి, పవిత్ర యజ్ఞ అరణితో నిప్పును రాజేస్తూ త్రేతాయుగాన్ని స్వాగతించడం-ఇలా కొన్ని కొన్ని ఉత్కంఠ భరిత ఊహాతీత సంక్రమణలతో కథ ఆసాంతం తనను తాను చదివించుకుంటూ ముందుకు లాక్కుపోతుంది పాఠకుడిని.
‘సృష్టి’ ఖండికలోనే కనిపించే ‘‘అప్పుడా మృగరాజ ఉప్పరమ్ముగ నెగసి/వనమెల్ల ఉల్లోల కల్లోల మొనరించి/్భయద గర్జల ఘోర పాదాగ్ర ఘట్టనల/రటద్దంత ధ్వనుల పటు భీతి కలుగగా’’ వంటి గేయ పంక్తులలో కనిపించే ‘రీతి’ అనే శబ్దార్థ సమతూక క్రమ కవితా లక్షణం బాగుంది.
కావ్యం మొత్తంగా ఉన్న లయారమ్యత, కథలోని ఉత్కంఠతలను పరికిస్తే ఇది ఒక చక్కని నృత్య రూపకంగా ఒప్పుతుంది అని చెప్పగలం.
పురూరవుడు ఓంకారంలోని అకార, ఉకార, మకారాలను వింగడించి మూడు దివ్యపథాలుగా చూపగలడు అన్న రామనాథశాస్ర్తీ గారి విశే్లషణ, ఊహా చిత్రణ చాలా ఉదాత్తంగాను, భావ గర్భితంగాను ఉన్నాయి.
‘‘ఊర్వశి భూతలానికి పతనం చెంది యంత్రాధార కీలలు (షాకిల్స్) ఊడిపోయి, పడిపోయిన యంత్రంలాగ ఉన్నది’’ అనడంలోని ఆధునిక యంత్ర సాంకేతిక ఉపమానం ముచ్చటగా ఉంది.
‘‘ఆనంద భావన పిక్కటిల్లటం’’ వంటి కొన్ని భావ గర్భిత నూత్న వాక్యప్రయోగాలు అక్కడక్కడ అందగించాయి.
25వ పుటలోని ‘శక్తి వంతంబై’ అని కాక ‘శక్తి మంతంబై’ అని ఉండాలి కదా మతుబర్థక ప్రత్యయ సూత్రం ప్రకారం! ఇది కేవలం అచ్చుపొరపాటై ఉంటుంది.
మొత్తంమీద ఈ ‘ఊర్వశి’ సహృదయ వశీకరణి.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం