అక్షర

తెలుగు భాషాభిమానులకు మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పత్రికలకు ఇంగ్లిషు తెగులు
-కె.ఎల్.రెడ్డి
వెల: రూ.110
ప్రతులకు: నవ చేతన బుక్‌హౌస్ విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవ తెలంగాణ పుస్తక కేంద్రాలు

** ** *****************************

‘తెలుగు పత్రికలకు ఇంగ్లిషు తెగులు’ గ్రంథంలోని అంశాలను పరిశీలించే ముందు రచయిత (విశే్లషకులు) కె.ఎల్.రెడ్డి (కంచర్ల లక్ష్మారెడ్డి) ప్రస్తావన అవసరం. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన ధ్యేయంగా ‘నేడు’ కరపత్రం ప్రతి దినం వెలువరించి జైలుశిక్ష అనుభవించిన ఉద్యమకారుడాయన. ఇప్పుడాయన వయస్సు 85 సంవత్సరాలు. రచనలు సాగిస్తూ పత్రికా రంగానికి అంకితమైన ఆదర్శ పాత్రికేయుడు కె.ఎల్.రెడ్డి. ప్రస్తుతం ‘మన తెలంగాణ’ దినపత్రికలో క్వాలిటీ సెల్ ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు. 2016 జూన్ 12 ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ఆయనపై గోవిందరాజు చక్రధర్ రాసిన వ్యాసం చదివి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారు కె.ఎల్.రెడ్డిని తమ కార్యాలయానికి పిలిపించుకుని, యోగక్షేమాలు తెలుసుకుని 15 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. కె.ఎల్.రెడ్డి తన అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చే అసాధారణ జర్నలిస్టు. పత్రిక యాజమాన్యానికి నచ్చకపోతే వెంటనే రాజీనామా చేయడం ఆయన నైజం.
‘తెలుగుదేశం’ ‘తెలుగు’ ‘తెలుగు రాస్తా’ ‘ఈనాడు’ ‘ఆంధ్రపత్రిక’ ‘ఆంధ్రప్రభ’ ‘ఆంధ్రభూమి’ ‘ఇండియన్ హెరాల్డ్’ ‘వీక్షణం’ ‘సాయంకాలం’ ‘వారంవారం’ ‘కృష్ణా పత్రిక’ ‘నేటి నిజం’ ‘మహానగర్’ ‘తెలంగాణ ప్రభ’ ‘కాలేజీ విద్యార్థి’ పత్రికలలో వివిధ పదవుల్లో పనిచేసిన అనుభవసారంతో రచించిన విలక్షణ గ్రంథమిది. ప్రధానంగా పత్రికలలోని తెలుగును ఆధారం చేసుకున్నారు. వాస్తవానికి ఇది తెలుగు రచనకు మార్గదర్శనం చేసే విజ్ఞాన సర్వస్వంగా రూపొందించారు. రచనలోని అన్ని కోణాలను స్పృశించి విశే్లషించారు. వ్యాకరణ పరంగా పరిశీలించారు. లోపాలను వివరిస్తూ ఉదాహరణలిచ్చారు. భాషా దోషాలు, వాక్య నిర్మాణంలో లోపాలు, పదాల వాడుకలో తప్పులు, వ్యక్తులు - ప్రాంతాలు, దేశాలు పేర్లు మూల రూపంలో లేకపోవడం, తెలుగు పదం వుండగా ఇంగ్లిషు పదం వాడడం, పదాలలో అక్షరాలు తారుమారు చేయడం, తప్పు సమాసాలు ఉపయోగించడం, అనువాదం మక్కీకిమక్కీగా ఉండడం, ఉర్దూ పదాలను తప్పుగా ప్రయోగించడం, ఏకరూపత లోపించడం, కాలం చెల్లిన పదాలను వాడడం, విశేషణాలను సరైన క్రమంలో రాయకపోవడం, సమాసాలు దీర్ఘంగా రాయడం, పదాల పునరుక్తి, వ్యర్థ పదాలను చేర్చడం, గ్రాంథిక రూపాలకు చోటు కల్పించడం.. ఇలా రచనలో అనేక అంశాలను విశే్లషణాత్మకంగా చర్చించారు. తప్పులను చూపి ఒప్పులను ఇచ్చారు. ప్రత్యేకంగా ఇందుకోసం గ్రంథం చివర ఒక పట్టికను చేర్చారు. జర్నలిస్టుల కోసమే అని చెప్పినా యధార్థానికి ఇందులోని అంశాలు తెలుగులో రాసే వారందరికీ వర్తిస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, రచయితలు, ఉద్యోగులు, పాఠకులు అందరూ ఈ విశే్లషణను తెలుసుకోవడం ఎంతో ప్రయోజనకరం. ‘తెలుగు జర్నలిజం పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ లోటుపాట్లన్నిటినీ దృష్టిలో పెట్టుకునే నేను విద్యార్థులకు దిక్సూచిగా ఉపయోగపడే భాషా విశే్లషణాత్మక పుస్తక రచనకు శ్రీకారం చుట్టాను’ అని రచయిత స్పష్టపరిచారు. ఈ గ్రంథంలో నలభై శీర్షికల క్రింద వివిధాంశాలను విశే్లషించారు. ఈ సమీక్షలో ప్రతి శీర్షిక నుంచి ఉదాహరణ లివ్వడం వాంఛనీయమైనా స్థలాభావం చేత కొన్నిటికి మాత్రమే అవకాశముంటుంది. గావాస్కర్, జవాహర్, నరేంద్ర మోది, నాలందా, సిలిగుడి వంటి సరైన రూపాలు ఒక శీర్షికలో ఇచ్చారు. ‘గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలు’కు ‘బాలికల ప్రభుత్వ పాఠశాల’గా అనువదించాలన్నారు. రక్తమార్పిడి, వస్త్ర దుకాణం, పురాతన ఇల్లు, దురలవాట్లు మొదలైన దుష్ట సమాసాలను విడమరిచి చూపారు. జరిగింది. చెందిన, సంబంధించిన వంటి పదాల వాడుకలోని అనౌచిత్యం వివరించారు. కితాబ్, తుపాన్, ఛలో, పరార్ వంటి తప్పుగా రాస్తున్న ఉర్దూ పదాలను సవరించి చూపారు. విశేషణాలు సముచిత స్థానంలో వాడడం లేదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కొత్త అమెరికా అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మొదలైన ఉదాహరణలిచ్చారు. కాగా, పోగా, ఈ సందర్భంగా, ఇకపోతే, అయితే, క్రమేపి వంటి ఊతపదాల వాడుక మానుకోవాలని హితవు పలికారు. మేధోమథనం, కరసేవ వంటి భాషా దోషాలను తెలియజేశారు. మద్యపాన సేవనం, దినోత్సవ వేడుకలు, ఉచితంగా అన్నదానం వంటివి పునరుక్తి దోషాలన్నారు. పై - కై - మై ఎలా వాడాలో విశదం చేశారు. శ - ష - స అక్షరాలు ఎలా తారుమారు అవుతున్నాయో ఉదాహరణ లిచ్చారు. పదాలలో అక్కరలేని దీర్ఘాలు వద్దని సూచించారు.
పైన చెప్పినట్టు జర్నలిస్టులే కాక తెలుగు చదివే, తెలుగు రాసేవారందరికీ ఉపయోగకరమైన ఈ గ్రంథాన్ని ఎంతో శ్రమించి అందించిన కె.ఎల్.రెడ్డి అభినందనీయులు.

-జిఆర్కె