అక్షర

గీతాసారం.. తిరుప్పావై పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాంత దేశికుల గోదాస్తుతి గోదాదేవి తిరుప్పావై భక్తిమాలిక
డా.పరవస్తు కమల
ప్రతులకు: పి.సుందరాచార్యులు
ఇం.నెం.10-4-68/6 (ఓల్డ్) రివైజ్డ్ నెం.10-4-250 లింగోజిగూడ, సరూర్‌నగర్
హైదరాబాద్- 500 035 65181071

** *******

కర్మభూమి, పుణ్యభూమి అయిన భారతదేశంలో భక్తి ఉద్యమానికి జీవం పోసినవారు - ఆళువారులు, నాయనార్లు! ఆళువారులు ‘విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులు’. వీరు పన్నిద్దరు. త్రరుూభూతమైన సంస్కృత వేదాన్ని, తమిళంలో నాలుగువేల పాశురాల్లో (పాటలు). ‘నాలాయిర దివ్య ప్రబంధం’గా భక్తజనావళికి అందించారు. ఈ పన్నిద్దరిలో ఒకేఒక స్ర్తి మూర్తి ఆండాళ్. ఈమె అయోనిజగా, భూదేవి అంశగా, శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో, గరుడాంశ సంభూతుడయిన విష్ణుచిత్తుని యింట తులసీవనంలో ఉద్భవించింది. ఈమెకే ఆముక్తమాల్యద, శూడికొడుత్తనాచ్చియార్, గోదాదేవి అని పేర్లు. ఈమె ద్రావిడ భాషలో ‘నాచ్చియార్ తిరుమొజి, తిరుప్పావై’ ప్రబంధాలను వెలయించింది.
నాచ్చియార్ తిరుమొజి - సంప్రదాయానుయాయులకే పరిమితం. తిరుప్పావై దేశమంతటా అన్ని సంప్రదాయాల వారికీ చిరపరిచితం. తిరుప్పావైకి మువ్వాయిరప్పడి, ఆరాయిరప్పడి వ్యాఖ్యానాలు శ్రీసంప్రదాయానుషక్తాలు. ఇంకా సంప్రదాయ ప్రవణులయిన, శ్రీ పండిత లక్ష్మణాచార్య, శ్రీ ప్ర.్భ.అణ్ణంగరాచార్య, శ్రీ శ్రీ్భష్యం అప్పలాచార్య తిరుప్పావై వ్యాఖ్యానాలు కూడా సంప్రదాయానుషక్తాలు అయినప్పటికీ ఆంధ్రదేశంలో అందరికీ పరిచితాలు. ప్రస్తుతం దేశంలో తిరుప్పావై ప్రవచనాలు చేస్తున్న వారందరికీ ఇవే కరదీపికలు.
ఇవి కాక, తమిళంలోనూ, తెలుగులోనూ కూడా అనేకానేక వ్యాఖ్యానాలు, అనుసరణలూ, పాటలూ కూడా కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగులో సాహితీ సమరాంగణ సార్వభౌముని ‘ఆముక్తమాల్యద’ బహుశా గోదా చరిత్రకి, మొదటి ప్రబంధం. తరువాత ముద్దుపళని, గోదా అంతరంగాన్ని భక్త్భివ బంధురంగా ప్రకటించుకొంది సంక్షిప్తంగా. భావకవి కృష్ణశాస్ర్తీ గారి ‘గోదాదేవి’ శ్రవ్య నాటిక, తిరుప్పావై పాటలూ ఆకాశవాణి ద్వారా తెలుగు వారందరికీ పరిచితాలు. వీటికి ముందే, శ్రీమతి తెలికచర్ల కందాల సీతమ్మగారి తిరుప్పావై తెలుగు పాటలు సంగీత సాహిత్య శోభతో, సంప్రదాయం తెలిసిన వారిని అలరిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుత గ్రంథం డా.పరవస్తు కమలగారి ‘తిరుప్పావై ప్రతీకలు’ - పరిశోధనా గ్రంథం. చాలా సంప్రదాయాభిజ్ఞత కల్గి, మంచి విషయ పరిజ్ఞానంతో, వివరణాత్మకంగా అందించిన గ్రంథం. ద్వాపరంలో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన గీతాసారాన్ని సమన్వయపరుస్తూ, శ్రీ ఆండాళ్, కలియుగంలో జీవుల పాపకర్మ పరీపాకం నుండి భక్తి మార్గంవైపు మళ్లించడం కోసం, స్వయంగా లక్ష్మీదేవి భూదేవి యంశగా.. గోదమ్మగా భూమిపై అవతరించి, పరమాత్మను చేరటం కోసం తాను స్వయంగా వ్రతమాచరించి, భగవత్సాన్నిధ్యాన్ని పొంది, ఇదిగో ఇలా భగవంతుని చేరవచ్చును అని మనకు దారి చూపింది..’ అంటూ, గీతను తిరుప్పావైకి సమన్వయపరచడం బాగుంది.
తిరుప్పావై 30 పాశురాల (పాటల) వ్రతం. మూడు దశలు. మొదటి ఐదు పాశురాలలో వ్రతానికి సన్నద్ధులై, అందరినీ వ్రతాభిముఖ్యులను చేయడం. తరువాతి పది పాటలలో ఆచార్య సమాశ్రయణం - ఒక్కొక్క గోపికనీ మేలుకొలుపుతూ, ఆచార్యులను సేవించడం ఎలాగో తెలుపుతుంది శ్రీ ఆండాళ్. చివరగా - వ్రతాభిముఖ్యులైన వారు ఆచార్యుని ఆశ్రయించి, వారి ద్వారా పరమాత్మను పొందాలి.. జీవాత్మ పరమాత్మను పొందే మార్గాన్ని సూచిస్తుంది శ్రీ ఆండాళ్. ఇదీ సూక్ష్మంగా తిరుప్పావై వ్రతం.
అలా సకల వేదసారాన్ని తన ముప్పై పాశురాల్లో (పాటల్లో) నిక్షేపించి, జీవులు తరించడానికై మన కోసం అందించిన గ్రంథం తిరుప్పావై. అందుకే శ్రీ లక్ష్మణ యతీంద్రులు అంటారు, తమ తెనుగుసేత - రసధుని లో-
‘పాపముల్ బాపు శ్రీపాదములు చూపు
వేదబీజమ్మకు గోదమ్మ పలుకు
ముప్పది పాశురములు నేరనట్టి బ్రతుకు
వ్యర్థమ్ము - భూమి భారమ్ము సుమ్ము!’
రచయిత్రి, తమిళ పాశురం దాని భావం విశేషార్థం ఇస్తూ, ప్రతి పదాన్ని అన్వయిస్తూ, అర్థాన్నిచ్చి, వాటి అంతరార్థాన్నిస్తూ.. శ్రీకృష్ణుని గీతతో ఆండాళ్ తిరుప్పావై గీతను అన్వయిస్తూ, అక్కడక్కడ విశేషార్థాలను జోడిస్తూ చాలా విపులంగా పాఠకులకు సంప్రదాయానురక్తిని కలిగిస్తూ చేసిన ప్రయత్నం. తమిళంలో ఉన్న ఈ పాశురాలకు చక్కటి తెలుగు వ్యాఖ్యానంతో, దృష్టాంత ప్రతీకలు చూపుతూ రచించిన ఈ గ్రంథం సంప్రదాయాభినివేశం ఉన్నవారందరికీ సమాదరణీయం కాగలదు.
‘తిరుప్పావై - సంక్షిప్త వ్యాఖ్యానం’ అనే మరొక గ్రంథాన్ని అందిస్తున్నారు, రచయిత్రి. స్వతహాగా సంప్రదాయ కుటుంబం నుండి వచ్చినవారు కావటాన, సంప్రదాయాన్ని మీరకుండా సంక్షిప్త వ్యాఖ్యానాన్ని సంతరించేరు తిరుప్పావైకి. వ్యాఖ్యానంతో పాటు అక్కడక్కడ విశేష, స్వాపదేశార్థాలనూ పరిచయం చేసేరు. తిరుప్పావైని తొలిసారి పరిచయం చేసుకునేవారికి ఇది చాలా ఉపయుక్త గ్రంథంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
రచయిత్రి మరొక గ్రంథం ‘వేదాంత దేశికుల గోదాస్తుతి - గోదాదేవి తిరుప్పావై భక్తిమాలిక’. ఇందులో తిరుప్పావై వాచ్యార్థాన్నిస్తూ, వేదాంత దేశికుల గోదాస్తుతిని సమన్వయపరుస్తూ చేసిన ప్రయత్నమిది.
ఐదవ పాశురంలో - ‘మాయనై మన్ను...’ తన చేష్టలతో అందర్నీ ఆశ్చర్యపరిచే మాయావి శ్రీకృష్ణుడు త్రిగుణాత్మకమైన మాయాశక్తిని అందరిపై ప్రయోగిస్తాడు. అట్లాంటి మాయావిని సైతం తన శిరమున ధరించిన భక్తి పూమాలికతో కట్టుబడునట్టు చేసిన గోద ఆ స్వామిని స్తోత్రం చేయమని సూచిస్తోంది అంటూ.. దేశికుల ‘అమ్నాయ దేవి దయతే యదసౌ ముకుదః తన్నిశ్చితం నియమిత స్తవ వౌళిధామ్నా!’ సమన్వయం బాగుంది.
అలాగే ఇరవై ఒకటవ పాశురంలో.. ‘ఏత్తకలంగళ్..’ ‘రంగేశ్వరస్య తవచ ప్రణయాను బంధాత్’ - గోద, తన ప్రణయ భావనా మాలికతో స్వామిని బంధించడానికి అనేక సౌందర్యవంతములైన పాటలమాలికను కూర్చింది! శ్రుత్యాదులచే పూజింపబడే స్వామి, తన పామాలనే అత్యుత్తమ శ్రుతిమాలగా స్వీకరించాడు... అని దేశికులు గోదా వైభవాన్ని కీర్తిస్తున్నారు.
‘ఒరుత్తి మగనాయ్’ అనే పాశురంలో - ఒక అమ్మకి కొడుకుగా జన్మించి, అదే రాత్రి వేరొక అమ్మ ఒడి బిడ్డడైన శ్రీకృష్ణుని లీలలు ఓర్వలేని కంసాసురు తలపులను తునాతునకలుగా చేసిన.. భగవానుని కన్నతల్లిని పెంచిన తల్లిని కీర్తించింది, ఆండాళ్.
దేశికులు తమ గోదాస్తుతిలో ‘గోదే గుణై రపనయన్ ప్రణతాపరాధాన్..’ తల్లీ, గోదా! ఆశ్రీతుల దోషాలను కూడా నీవు నీ గుణముల చేత తొలగించి, స్వామి కృపను మాపై కలుగజేస్తావు. తప్పులు చేసినవారు తమ తప్పిదాల నెరిగి, ‘అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయాప్రసవభూః కృతఘ్నః దుర్మానీ స్మరపరవశో వంచన పరః నృశంసః పాపిష్ఠః కథమహమితో దుఃఖజలధేః అపారాదుత్తీర్ణః తన పరిచరేయం చరణయోః॥ అంటూ యామునాచార్యులు తమ స్తోత్రరత్నంలో చెప్పినట్టు నైచ్యానుసంధాన పూర్వకంగా స్వామిని శరణాగతి చేసినట్టయితే, అమ్మ క్షమామూర్తి కనుక, ‘కిమేతత్ నిర్దోషః కః ఇహ జగతీతి..’ అంటూ బిడ్డలను క్షమించి, రక్షించుమని స్వామికి విన్నవించి క్షమింపజేయిస్తుంది. అటువంటి వాత్సల్యమూర్తి ఆమె. భక్తులు బాధపడటాన్ని భరించలేక, ఆమె కనికరిస్తుంది! అని అమ్మ గోదమ్మను స్తుతిస్తారు దేశికులు.
ఇలా ఒక్కొక్క పాశురార్థాన్ని దేశికుల గోదాస్తుతితో సమన్వయించి చెప్పిన తీరు బాగుంది. ఇదే గ్రంథంలో అనుబంధాలుగా మంగళం పాట ఆళువారుల తిరునక్షత్ర తనియన్లను పొందుపరిచారు.
తిరుప్పావై ప్రతీకలు - వేదాంత దేశికుల గోదాస్తుతి - గోదాదేవి తిరుప్పావై భక్తిమాలిక, తిరుప్పావై - సంక్షిప్త వ్యాఖ్యానము కూడా చాలా నిశితంగా విమర్శనాత్మకంగా సంప్రదాయానుసారంగా మలచడానికి శ్రీమతి కమలగారు చాలా కృషి చేశారు. ఈ గ్రంథాలు సంప్రదాయానుయాయులతో బాటు గోదా దేవియందు, ఆమె పాడిన తిరుప్పావై పట్లా కొత్తవారికి సైతమూ అనురక్తిని కలిగించేట్లు తీర్చిదిద్దారు రచయిత్రి.

-ఎస్.టి.పి.వేణుగోపాలస్వామి