అక్షర

పల్లె సీమ కథల ‘బొడ్రాయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బొడ్రాయి’
-మేరెడ్డి యాదగిరిరెడ్డి
(కథల సంపుటి)
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో

సరైన దృష్టికోణంలో సమాజాన్ని పరిశీలిస్తే నిబద్ధతగల కథకుని చుట్టూ ఎనె్నన్నో ఇతివృత్తాలు రెక్కలు విప్పుకుంటాయి. ఈ కోవకు చెందిన గ్రంథకర్త మేరెడ్డి యాదగిరిరెడ్డి కలం నడపడంలో నేర్పరి. వౌలికంగా రైతు. ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ప్రజల స్థితిగతులు, కష్టాలు, సమస్యలు, సాగు పద్ధతులు, పేద రైతుల అప్పులు, అగచాట్లు, న్యాయస్థానాల పనితీరు, పోలీసుల పోకడలు, ప్రపంచీకరణ ప్రభావం వంటి లోక వృత్తాంతాలు సాకల్యంగా అవగాహన చేసుకున్నారాయన.
ఈ నేపథ్యంలో యాదగిరిరెడ్డి సంపుటీకరించిన 13 కథలు ప్రతి దానిలోను వైలక్షణ్యం సంతరింపజేశారు. ‘‘నా జీవితం ఉపాధ్యాయునిగా, రైతుగా గ్రామీణ జీవితంతో ముడిపడి వున్నందున అవేనా కథావస్తువులు’’ అని ఆయనే వ్యక్తపరిచారు. గ్రంథానికి ‘బొడ్రాయి’ అని పేరు పెట్టడం గ్రామ సీమలపై ఆయన మమకారానికి తార్కాణం. కథారచనలో సమాజ ప్రయోజనాన్ని కాంక్షించారాయన. హెచ్చరికో, చురకో, సందేశమో పరోక్షంగా ప్రతి కథాలోను కానవస్తుంది. గ్రామీణుల్ని కాపాడుతుందని నమ్మిన ‘బొడ్రాయి’ ప్రతిష్ఠవల్ల సర్పంచు, కరణం, షావుకారు కుతంత్రాలు పన్ని లాభపడ్డారు కాని ‘‘ఊరు అప్పుల ఊబిలో దిగబడింది. చాలామంది చదువుకునే పిల్లలు జీతాలకు, పని పిల్లలుగా కుదిరారు (పుట 11). ప్రపంచీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా వృత్తికళాకారుల దైన్యస్థితి ‘తోలుబొమ్మలు’ కథలో ఆర్ద్రంగా చిత్రించారు. రంగప్ప తాతలనుంచి తోలుబొమ్మలాడించడం (బుడిగ గంజాల) కుల వృత్తి. ప్రపంచీకరణ, పట్టణీకరణతో వాళ్ల బతుకులు అతలా కుతలమయ్యాయి. రంగప్పకు ఊపిరితిత్తుల వ్యాధి ముదిరింది. వ్యాధి చికిత్సకోసం మనవడు రాములు తోలుబొమ్మలతో చెప్పులు కుట్టి ధనం కూడబెడతాడు. శ్రీరామచంద్రుని బొమ్మకూడా చెప్పులుగా మారింది. చివరకు ‘‘ఎంత అపచారం చేశావురా! అయ్యో’’ కేకలు వేసుకుంటూ గుండెలు పట్టుకుని నిలువునా కూలిపోయాడు రంగప్ప (43).’’ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు రకరకాల బోధనేతరమైన పనులు అప్పగించడం మూలంగా పిల్లల చదువులు ఎలా దెబ్బతింటున్నాయో ‘బడి’ కథ విశదీకరిస్తుంది. నల్లగొండ జిల్లా మారుమూల గ్రామం కంకణాలపల్లి కథాక్షేత్రంగా నడిచింది ‘విషపు నీళ్లు’ కథ. అక్కడి నీళ్లలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ కావడంచేత ఆ వూరిలో మూడొంతుల మందికి అంగవైకల్యం ఏర్పడింది. తేజస్విని ముఖం చంద్రబింబంలా వుంటుంది. అమెరికాలోవున్న ప్రసాద్ నెట్‌లో చూసి తేజస్వినిని చూశాడు. ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఇండియా వచ్చి ఆమెను చూసి మాట్లాడాడు. ‘‘మనం పెళ్లిచేసుకుని రోజూ నీవు నవ్వినప్పుడల్లా నీ పండ్లపై ఉన్న ఆ పసుపుపచ్చ మచ్చలు చూసి భరించే శక్తి నాలో లేదు’’(33) అని వార్త పంపాడు. దొంగతనాలపై పోలీసులు తీసుకునే చిత్ర విచిత్ర చర్యలకు ‘డయల్ యువర్’’ కథ అద్దం పడుతుంది. రైతు ఆత్మహత్యలపై సమగ్ర కథనం ‘తీర్పు’లో చోటుచేసుకుంది. బోర్లు వేసినా నీళ్లుపడక నష్టపోయిన రామరెడ్డి అప్పులపాలై ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఆయన పేరు బైరెడ్డి రామరెడ్డి ‘బోర్ల రాంరెడ్డి’గా మారింది. న్యాయస్థానంలో న్యాయమూర్తి రామరెడ్డిని ప్రశ్నించి రాబట్టిన వివరాల్లో పేద రైతు దైన్యాన్ని కళ్లకుకట్టినట్లు చూపారు. వర్షాలు పడనందువల్ల పేద రైతు బక్కయ్య కష్టాలను ‘కరవు’ కథలో దయనీయంగా అక్షరబద్ధం చేశారు. అభివ్యక్తి గరిమతో, సమర్ధ వాక్య నిర్మాణంలో శైలి పఠనీయంగా వుంది. తెలంగాణ రైతు జీవనం ప్రధాన కేంద్ర బిందువుగా చేసుకుని సాధికారికంగా శిల్పచణతతో ఈ కథలు అందించిన యాదగిరిరెడ్డి కృషి ప్రశంసార్హం.

-జిఆర్కె