అక్షర

నీలి మబ్బులలో ఐరోపా అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నీలి మబ్బులలో
-డా.పేరం ఇందిరాదేవి;
వెల: రూ.160;
పుటలు: 208,
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.

పిల్లలు చదువు ప్రాథమిక దశలలో భారతదేశంలో జరిగినా డిగ్రీ చేతికందిన తర్వాత పైచదువులకి విదేశాలు వెళ్లడం అనేక దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలలో సర్వసాధారణమయింది. ఇంకో దేశంలోని వింతలు విశేషాలు తల్లితండ్రులు చూడాలనుకుంటారు పిల్లలు. అలా కొడుకు ఆహ్వానాన్ని అందుకుని ఐరోపా ఖండంలోని, కొన్ని దేశాలని చూసిన డాక్టర్ పేరం ఇందిరాదేవి, అనుభవాలని ‘ఆ నీలి మబ్బులలో...’ పుస్తకంలో పొందుపరచారు. నవలా రూపంలో యూరప్ సాంస్కృతిక చరిత్రలోని కొన్ని ఘట్టాలను పాఠకులకు అందించారు. కేవలం ట్రావెలాగ్‌లా రాయకుండా చదువరుల ఆసక్తిని పెంచడానికి కథని చేర్చారు.
కథానాయిక ‘నీహ’ రాసిన పేపర్, బెర్లిన్‌లో జరిగే ఇంటర్నేషనల్ సెమినార్‌కు ఎంపిక అవుతుంది. ఆమె ప్రొఫెసర్ తన శిష్యుడు నీల్ ఆనంద్ సహాయం ఉంటుందని నీహ కుటుంబ సభ్యులను ఒప్పించి యూరప్ యాత్రకు పంపించడంతో కథ మొదలవుతుంది.
పారిస్ విమానాశ్రయంలో దిగిన వెంటనే నీల్ చెప్పిన బేకరీ దగ్గరకు చేరుకున్న నీహకు నీల్ ఆనంద్ కనబడకపోడం కొంత ఆందోళన కల్గిస్తుంది. భారతదేశంనుంచి తెచ్చుకున్న ఫోను పారిస్‌లో పనిచేయదు. బేకరీలోని ఉద్యోగికి ఫోను నంబరు ఇచ్చి నీల్‌కి బేకరీ దగ్గిర ఉన్నానన్న సందేశం పంపుతుంది. నీహ, నీల్ కలిసి (కొన్నిసార్లు విడివిడిగా) చూసిన వింతలు విశేషాలు ప్రధానంగా పుస్తకంలో చోటుచేసుకున్నాయి. నోటర్‌డామ్ చర్చి, లగ్జెంబర్గ్ ప్యాలెస్, లూవ్ మ్యూజియం, ఆరంజరి మ్యూజియం, వెర్సె రాజభవనం, ఐఫిల్ టవర్, సాక్రెకేర్ బసీలికా తదితర పర్యాటక ఆకర్షణల వివరాలు చదువరుల ఆసక్తిని పెంచుతాయి. మైనన్‌డే విక్టర్ హ్యోగో అని పిలవబడే మ్యూజియం వివరాలు పొందుపరచబడ్డాయి. విక్టర్ హ్యూగో ఫ్రెంచి రచయిత, మేధావి, వేదాంతి. అతని నివాసాన్ని మ్యూజియంగా మార్చడం, అతని జీవనశైలి ప్రతిబింబించేలా తీర్చిదిద్దడం అద్భుతమంటుంది రచయిత్రి. విక్టర్ హ్యూగోని ఫ్రెంచివారు గుర్తించినట్టుగా మన గురజాడ, శ్రీశ్రీ, దేవులపల్లి, తిలక్, జాషువా తదితర రచయితలను కవులను గౌరవించుకోలేక పోతున్నాం కదా అని బాధపడుతుంది కథానాయిక. ఐఫిల్ టవర్ అమ్మకం ప్రయత్నం చరిత్రలో అతి తెలివైన మోసంగా మిగిలిపోతుంది.
తరువాతి అధ్యాయంలో బెల్జియం దేశం వివరాలున్నాయి. రాజధాని బ్రస్సెల్స్ నగరంలోని గ్రాండ్ ప్లేస్ స్క్వేర్ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినది. ఈ నగరంలో రెండేళ్లకి ఒకసారి నిర్వహించే ఫ్లవర్ ఎగ్జిబిషన్ ప్రపంచ విఖ్యాతి పొందినది. బ్రూజ్‌నగరంలోని చర్చ్ ఆఫ్ లివర్ లేడీ, 123 మీటర్ల గోపురం, మైఖేలాంజిలో చెక్కిన మడొన్నా చేతిలో బాలయేసు విగ్రహం వివరాలు పొందుపరచబడ్డాయి. ఉస్ట్‌ఎండ్‌లో ప్రఖ్యాత చిత్రాకారుడు జేమ్స్‌ఏన్సర్ ఇంటిని మ్యూజియంగా మార్చడం, సెయింట్ పెట్రాస్ సెయింట్ పాల్ చర్చ్, తదితర పర్యాటక స్థలాల వివరాలున్నాయి.
నెదర్లాండ్ దేశం అనగానే ఆనీఫ్రాంక్, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ అమ్మాయి దాక్కున్న సీక్రేట్ ప్రదేశం గుర్తుకువస్తాయి. ప్రస్తుతం మ్యూజియంగామారిన ఆ ఇల్లు పరిసరాలు తప్పక చూడాల్సినవి. ఆనీఫ్రాంక్ రాసిన డైరీ రెండవ ప్రపంచయుద్ధంలో జరిగిన దారుణాలని కళ్లకి కట్టినట్టు చూపుతాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ డైరీ అరవై భాషలలోకి అనువదింపబడింది.
జర్మనీ, జెకస్లోవేకియా, పోలాండ్, ఆస్ట్రియా, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలలోని చూడదగ్గ యాత్రాస్థలాల వివరాలే కాకుండా దేశాల చరిత్రలు, ప్రస్తుత జీవన విధానాలు, రవాణా సౌకర్యాలు సందర్భానుసారంగా ప్రస్తావించబడ్డాయి. ప్రతి రైల్వేస్టేషన్ ఒక గొప్ప కళాఖండంగా ఉందనడం రచయిత్రి కళారాధనకు తార్కాణం.
కేవలం ట్రావెలాగ్ ఆసక్తికరంగా ఉండకపోవచ్చునన్న భావనతో కథని కూడా జోడించడం జరిగింది. ట్రావెలాగ్‌కి సమకూరిన న్యాయం, కథకి జరగలేదేమోనన్న భావన పాఠకులకు కలగవచ్చు. అలాగే నాలుగు సంవత్సరాల శ్రమ ఫలితం ఈ నవల అన్నారు రచయిత్రి. అన్ని సంవత్సరాల సమయం ఎందుకు పట్టిందో ఇంకాస్త వివరంగా తెలిపితే బాగుండుననిపిస్తే చదువరిని తప్పుపట్టలేము.

-పాలంకి సత్యనారాయణ