అక్షర

మనుచరిత్రకు మరో రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతపత్ర మనుచరిత్ర
-పింగళి వేంకట కృష్ణారావు
వెల: రు.180/-
ప్రతులకు:
పి.వి.ఎస్.రామారావు
43-3-3 ఎ/2 రామకృష్ణాపురం
2వ లైను, విజయవాడ-520003
మరియు
అన్ని ప్రముఖ పుస్తక
విక్రయశాలలు

‘అటజనిగాంచె’ అనే పద్యం రాని తెలుగువారు, వరూధునీ ప్రవరులంటే తెలియని తెలుగువారు వుండరంటే అతిశయోక్తి కాదు. ఇవి పెద్దన రచించిన స్వారోబిష మనుసంభవములోనివి. ఇది మనుచరిత్రగా ప్రజలలో వ్యవహరించబడుతోంది. సుమారు ఏడువందల పద్యాల మనుచరిత్రలోనుండి నూట పది పద్యాలను తీసుకుని శతపత్ర మనుచరిత్ర -మనుచరిత్ర కథా అర్ధ వ్యాఖ్యానాన్ని అందించారు పింగళి వేంకట కృష్ణారావుగారు. ఈ పుస్తకం నిజంగా శతపత్రమే. శతపత్రంలోని సౌరభాన్ని పాఠకులచేత రచయిత ఆఘ్రాణింపచేసారు. కథా గమనానికి, భావానికి, రసానికి ఇందులో భంగం కలగలేదు. పాఠకులకు సంగ్రహంగా సుబోధకంగా విషయాన్ని అందిస్తుంది. స్థూలంగా మనుచరిత్ర కథ ఇది. నిష్ఠాగరిష్టుడై ధర్మానికి మారుపేరైనవాడు ప్రవరాఖ్యుడు పండితుడు. అలేఖ్యతనూ విలాసుడు అనేంత అందం కలిగినవాడు. భార్యతో కలిసి తల్లిదండ్రుల సేవించేవాడు, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేవాడు. అధ్యయనం, అధ్యాపనం, అగ్ని ఆరాధన క్రమం తప్పక చేసేవాడు. తీర్థ యాత్రలపై ఆసక్తి కలవాడు. అతిథి సేవా తత్పరుడు, ఒకనాడు అతిథిగా వచ్చిన ఔషధ సిద్ధుడిచేత ఇవ్వబడిన పాదలేపనంతో హిమాలయాలకు వెళ్లాడు. ఆనందించాడు. పసరు కరిగిపోయింది. ఇల్లు గుర్తుకు వచ్చింది. తిరిగి వెళ్లే మార్గం కానరాలేదు. అపుడే వరూధుని కనిపించింది. అమితమైన వైభవంతో ఒప్పారుతున్న అప్సర స్ర్తి. సౌందర్యరాశి. అంతకు ముందు ఎప్పుడూ మానవలోకంలో ప్రవరుని వంటి అందమైన వారు వుంటారని ఊహించి ఎరుగదు.
ప్రవరుని చూసి చకితురాలైంది. ఇంటికి దారి చూపు తల్లీ అని అడిగాడు. నన్ను పెళ్లాడమంది వరూధుని. ‘చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపై తేనియలే’ అని తిరస్కరించాడు ప్రవరుడు. పరిపరి విధాల ప్రాధేయపడింది. ప్రవరుడు ‘బుద్ధి జాడ్య జనితోన్మాదులే కదా శ్రోత్రియుల్’ అనుకున్నాడు. ఇవేవీ పట్టలేదు. మనసు అంతా ఇంటిపై లగ్నమై వుంది. మరీ మరీ బతిమలాడుతున్న వరూధునిని నిర్దయగా త్రోసివేశాడు. అగ్నిహోత్రుణ్ణి ప్రార్ధించి ఇల్లు చేరుకున్నాడు. ఇక్కడ ధర్మమే జయించింది. ప్రవరుడు ఇంద్రియాలకు వశం కాలేదనే నీతిని లోకానికి అందించింది. అమాయకురాలైన వరూధునిపై అంతకు ముందే కనే్నసి వున్న గంధర్వుడు మాయ ప్రవరుని రూపం ధరించి వరూధునిని చేరుకున్నాడు.
వరూధుని సంతోషించింది. మాయా ప్రవరుని చేత మోసపోతున్నానన్న విషయం తెలుసుకోలేకపోయింది. కనీసం అనుమానం కూడా రాలేదు. ఆమె గర్భం ధరించింది. మాయాప్రవరుడు మాయమాటలు చెప్పి మాయమైపోయాడు. ప్రవరుడు వివాహితుడని తెలిసి కూడా అతనిపై వ్యామోహంలో చిక్కుకోవడం వరూధుని అమాయకత్వాన్ని సూచిస్తోంది. సాటిలేని సౌందర్యం, వైభవం ఉన్నప్పటికీ మోసపోయిన విషయాన్ని ఒక హెచ్చరికగా కవి చేశాడు. ‘క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్’, ‘మాయలుగా మగవారి కృత్యముల్’ వంటి నీతి వాక్యాలు చొప్పించాడు. వరూధునికి స్వరోచి జన్మించాడు. ప్రవరుని ధర్మము, మాయాప్రవరుని భోగలాలసత కలగలిపినవాడు. మనోరమ, విభావసి, కళావతిలను పెండ్లాడాడు. జంతువుల భాషలు తెలిసినవాడు. పద్మినీ విద్యను పొందినవాడు. సుఖ జీవనం గడిపేవాడు. ఒకనాడు చక్రవాక పక్షి, లేడి తనను గురించి చులకనగా మాట్లాడడాన్ని విని మనస్సును మార్చుకున్నట్టే మార్చుకుని మళ్లీ మామూలు స్థితికి చేరుకున్నాడు. సుఖ భోగాలు అనుభవించాడు. వన దేవతను పెండ్లాడి స్వారోబిష మనుసంభవానికి కారకుడైనాడు. లోకంలో ధర్మాన్ని స్థిరంగా నిలిపి సర్వజనహితంగా పరిపాలన చేసాడు. స్వారోబిషమనువు ధర్మపాలకుడిగా పేరుపొందాడు. పెద్దన సంగీత సాహిత్యాలతోపాటు తంత్రీవాద్యాలు, సాముద్రికం, శకునం, వృక్ష జాతులు, పక్షిజాతులు, వేటకుక్కలు, వేట, గృహనిర్మాణం, తెలుగువారి ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆ రహస్యాలను రచయిత తన వ్యాఖ్యానం ద్వారా మనకందించారు.
ప్రారంభంలో గణపతి భ్రమపడిన విషయాన్ని వర్ణించే పద్యం ద్వారా రాబోయే కథలో వరూధుని భ్రమపడడాన్ని కవి సూచించాడు. హిమాలయ వర్ణన పద్యంలో హిమాలయాల ఔన్నత్యంతోపాటు సెలయేటి గలగలలు కూడా నిండి వుండడాన్ని చూపించారు. ఏ రాగాన్ని ఏ సమయంలో పాడాలో తెలిపిన పద్యాలను ఉదహరించారు. సంగీత సాహిత్యాల మేళవింపుగా గల పద్యాలు పేర్కొన్నారు. ఏ రకమైన చందస్సును ఎందుకు ఉపయోగించాలో వివరించారు. ఉత్పలమాలకు ఉత్పలమాలను విసరడం వంటి పద్యాలు ఇందుకు ఉదాహరణలు. పెద్దనకు ఆంధ్ర భాషాభిమానమెక్కువ. తెలుగు సంప్రదాయాలపై మక్కువ ఎక్కువ. స్వరోచి పెళ్లి ఘట్టాన్ని వర్ణిస్తూ ప్రేలగంప, తలంబ్రాలు, సూత్రధారణ, సప్తపది మొదలైన ఘట్టాలన్నీ వర్ణించాడు. ఇటువంటి చోట్ల రచయిత వ్యాఖ్యానం, రచయిత సునిశిత పరిశీలనాసక్తికి నిదర్శనంగా నిలుస్తున్నది.
తేనె, పరికిణీ, ఓణీ, ఓషధులు, సంగీతము మొదలైన విషయాలకు రచయిత అందించిన వివరాలు బాగున్నాయి. భావాన్ని నొక్కి చెప్పడం కోసమేమో కాంక్రీట్, డివైన్‌బ్యూటీ, ఇంటీరియర్ వంటి పరభాషా పదాలను ప్రయోగించారు. కవి వివిధ అలంకారాలను, పదాలను ప్రయోగించడంలో గల ఔచిత్యాన్ని చర్చించారు. వ్యాఖ్యానంలోని ప్రతి పద్యానికి ఓ శీర్షికని పెట్టడం ఇందులోని విశేషం. ఈ పేర్లలో నీతిని తెలిపేవి, కొన్ని కథను స్ఫురింప చేసేవి వున్నాయి. ఈ పద్యం ఒక మిఠాయి పొట్లం, పద్యరచనకిది ఒజ్జబంతి, మూడు పద్యాల మరుమల్లెపొద, సాహిత్యమపి సంగీతం, ఇలాపేర్లు పెట్టారు. ఈ పద్యం ప్రక్షేపమా! నిక్షేపమా! అని చర్చించారు. భారతీయ ఆదర్శ కుటుంబం, జీవుని సంస్కారాన్ని బట్టే జీవనం, వివేకం లేని ప్రేమ మృత్యువు లాంటిది, ఒక్కొక్కరికి ఒక్కరే వరము, శిక్షారక్షాదక్షుడే నిజమైన గురువు అనే నీతి వాక్యాలు ఇందులో ఉన్నాయి.
‘వనిత తనంత తా వలచి వచ్చిన చులకనకాదే యేరికిన్’ వంటి విషయాలు సార్వకాలికములని రచయిత విశే్లషించారు.గృహస్తు పెడదారి పడితే సంసారం గోదారవుతుంది, తాము ప్రేమించేవారి గుణగణాలు, వేష భాషలు, చదువు సంస్కారం లోతుగా పరిశీలించి నిర్ణయించాలని ఇది స్ర్తి పురుషులిద్దరికీ నీతి. ఈ విషయంలో తల్లిదండ్రుల, స్నేహితుల సలహాలు స్వీకరించాలి. తండ్రి ఎల్లప్పుడు కొడుకును కనిపెట్టి వుండాలి. శుభకార్యాలు ఇళ్లలోనే జరగాలి మొదలైన నీతులు సందేశాన్ని అందిస్తు న్నాయి. ఇవన్నీ ఆచరణ యోగ్యమైనవి. పరిపాలకుడు సరిగా లేకుంటే రాజ్యం నాశనమవుతుందని ఇందీవరాక్షుని ప్రస్తావిస్తూ చెప్పారు. సంయమి సమాజాలు మొదలైనవి నేటి సమాజానికి అవసరమని, అవి నేటి సమస్యలకు పరిష్కారంగా వుండగలవనీ వివరించారు. అనుబంధంగా మనుచరిత్రలో మంత్ర తంత్రాలు, వసె్తై్వక్యము, రసము మొదలైన అంశాలు చేర్చారు.

-లక్ష్మీ అన్నపూర్ణ