అక్షర

మంచిని పెంచని ‘మహాసంకల్పం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాసంకల్పం-నవల
రచన:వాసుదేవ్
(డా.కడియాల వాసుదేవరావు)
ప్రచురణ:సాహితీమిత్రులు, విజయవాడ.
వెల:రూ.200 పేజీలు:323
***

1970 ఇటు కొన్ని సంవత్సరాలూ, అటు కొన్ని సంవత్సరాల కాలంలో వైద్య వృత్తి కాలమాన పరిస్థితుల వివరణ ఈ ‘మహాసంకల్పం’ నవల్లో జరిగింది. అప్పుడు కొందరు డాక్టర్లు పేషంట్ల మీద ఏ విధంగా వ్యాపారం చేసేరో, ఆసుపత్రి సర్వీసుల్ని ఏ విధంగా అమ్ముకున్నారో లోతులకు వెళ్లి పరిశోధన చేసి కళ్లకు కట్టినట్లు రాసేరు. అంతేకాదు ఒక గవర్నమెంటు డాక్టరు ఏ స్థాయికి దిగజారగలడు, బ్రోకర్లని ఏ విధంగా సమర్థతతో లావాదేవీలు ఎలా నడిపించుకోగలడో, ఆఖర్నవాళ్ల చేతుల్లో ఎలా కీలుబొమ్మలా మారగలడో చాలా విపులీకరించి రాసేరు. ఇలా దోచుకునేవారు అథమానికి దిగజారినవారూ ఒక వర్గం వారయితే, అంతకంటే హీనత్వం వైద్య విద్యార్థులను, అందులోనూ నాసిరకం వారిని పరీక్షల్లో పాసు చేసేందుకు డబ్బు ఎంత ప్రాధాన్యత వహించేదో కూడా గుండెల్లో దిగబడేట్లు చిత్రీకరించేరు.
రచయిత మంచి డాక్టర్లు పడే తపన గురించి, కొత్తకొత్త విధానాన్నిరోగులకు ఎలా వాడవచ్చో వాటి మెళకువలను చాలా విపులంగా విశదీకరించేరు. ఈ మంచి డాక్టర్ల శాతం 80% (నవలలో) అయితే దిగజారిన వారి శాతం 20% ఉన్నా ఈ మంచి డాక్టర్లు పాఠకుల మీద లోతైన ముద్ర వేయలేకపోయారు.
చెడును ఎంత లైట్‌గా చెప్పినా వాటి ప్రభావం పాఠకుల మీద ఎక్కువ ఉంటుంది. మనిషి జీవిత లక్ష్యం డబ్బు. దానిని సంపాదించుకునేందుకు ఎన్ని వక్రమార్గాలనైనా ఎన్నుకుంటాడు. కొత్తకొత్తదారుల్ని కనిపెడుతూంటాడు. అలాగని గవర్నమెంట్ డాక్టర్లు డబ్బు సంపాదన గురించి ఎన్నుకున్న నీచమార్గాలన్నింటినీ కళ్లముందు ఉంచితే, కొత్తగా ఈ వృత్తిలోకి చేరినవారికి మీరు డాక్టరు సమృద్ధిగా సంపాదించాలంటే ఈ మార్గాన్ని ఎన్నుకోండి అని సూచించినట్లు ఉంటుంది.
చెడు ఒంటబట్టినంత తొందరగా మంచి ఒంటబట్టదు. తొందరగా డబ్బు సంపాదించడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే మార్గాలన్నీ ఇవి అని అంత కూలంకషంగా బయటపెడితే వాటి ప్రభావం మనిషి వక్రించడానికి దోహదం చేయదా?
ఈ వృత్తిలో ఉండే చెడును అంటీ అంటనట్లు ఉదహరించి, డాక్టర్లలోని సేవాతత్పరత, మంచి చేయాలనే సంకల్పం, ఎక్కువ ఖర్చు కాకుండా డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే డాక్టర్ల పాత్రలు, హృదయాన్ని అంటుకునేలా మలచి ఉంటే రాబోయేతరాల్లో హృదయమున్న డాక్టర్లు తయారయ్యే అవకాశం ఉంది. అలా చేయాలంటే పాత్రపోషణ చాలా అవసరం. ఇలాంటి పాత్రల్ని మలచాలంటే డాక్టరంటే ఇలా ఉండాలి అని ప్రశంస పొందేవారిగా పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలచి, మరో కాబోయే డాక్టర్ని ఉత్తేజపరిచేలా రచనను చేసి ఉంటే, దాని ప్రయోజనం మరోరకంగా ఉండేది.
రచయితకు మంచి శైలి ఉంది. పదాల మీద పట్టు ఉంది. విషయం ఉంది. అయినా చెడును తీక్షణంగా చెప్పిన రచయిత మంచిని హృదయానికి హత్తుకునేలా చేయలేకపోయారనిపిస్తుంది.
ఈ నవల చదవాలా, లేక చదివిస్తుందా అంటే- రెండూ చేస్తుంది.
మంచి ఔన్నత్యాన్ని కొద్దిగా పెంచి, హృదయంమీద ఇంకొంచెం ఎక్కువ ముద్రవేయగలిగి ఉంటే-ఈ నవలకు కొత్త రూపురేఖలు వొచ్చి ఉండేవి.
క్యారెక్టరు లేని డాక్టర్ల ఉదంతాన్ని మెల్లగానూ, మానవాళికి పనికివచ్చే దీటైన పాత్రల పేజీలనూ తొందరగాను తిప్పేసేటట్టుంది. ఈ పాత్రలలో కథ కొంచెం బిగువుగా అల్లి ఉంటే నవలకి పూర్ణత కొంచెం ఎక్కువ వచ్చి ఉండేదేమో.
ఈ నవల చదవడం ముగిస్తే ఇది అసంపూర్ణం అనిపిస్తుంది. ఎందుకంటే రచయిత పాతకాలం హీనత ఉన్న డాక్టర్ల గురించే చెప్పారు. మరి ఈ కాలం కార్పొరేట్ డాక్టర్ల వ్యవస్థ గురించి ఇంకా చెపుతారు అని ఎదురుచూస్తుంటారు పాఠకులు. దానికి రెండో భాగం రాబోతుంది అనుకుంటారు.
వస్తే బాగుంటుందనుకుంటారు.
అప్పటివరకు ఈ నవల అసంపూర్ణం. డాక్టరుగారు రెండో భాగానికి కలం ఎత్తుకుంటారని ఆశపడదాం.

-డాక్టర్ ఎస్సెస్ శ్రీరంగం