ఆంధ్రప్రదేశ్‌

3న విశాఖలో నాన్-పొలిటికల్ జేఏసీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ డిమాండ్‌పై వచ్చేనెల మూడో తేదీన నగరంలో నాన్-పొలిటికల్ జేఏసీ సమావేశం ఉంటుందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్‌కె బీచ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి రాష్టమ్రంత్రి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ అంశం ఎన్నికల హామీ అని, విభజన చట్టంలోను ఉందన్నారు. నాలుగేళ్ళు అయినా ఈ హామీలు నెరవేరలేదన్నారు. ఈ దృష్ట్యా అన్ని జేఏసీలు ఒకే మాట, ఒకే బాటగా పయనించాల్సి ఉందని కోరారు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని, దీనిని కొత్తగా కోరడంలేదన్నారు. అందువల్ల జోన్ ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించాల్సి ఉందని, మూడోతేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్న నాన్-పొలిటికల్ జేఏసీల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం, ఏ రోజు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది ఆ రోజు నిర్ణయిస్తామని చెప్పారు. తమిళనాడు తరహాలో ఉద్యమించాలని కొంతమంది, కేంద్రంపై అనేక రకాలుగా వత్తిళ్ళు తీసుకువెళ్ళాలని మరికొంతమంది పరిశ్రమల కార్యకలాపాలను స్తంభింపజేయాలని ఇంకొందరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేశారన్నారు. దేశ ప్రధాని వాజ్‌పాయ్ హయాంలో రైల్వేజోన్‌ను కోరిన ఆరుమాసాల్లో మంజూరు చేయగలిగారన్నారు. అలాగే కేంద్ర రైల్వేశాఖామంత్రిగా రాంవిలాస్‌పాశ్వాన్ ఉన్నపుడు చిన్నప్రాంతానికి జోన్‌ను కేటాయించారని గుర్తుచేశారు. అటువంటిది అన్నివిధాలా అవకాశాలున్నా ఇక్కడ రైల్వేజోన్ రావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని, విశాఖ పౌరులుగా ఉన్న ఎంపీ హరిబాబు ఉద్యమం అవసరంలేదనడం సరికాదన్నారు. మిత్రపక్షంగా పోటీ చేస్తూ అనేక హామీలిచ్చిన బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ళు అయినా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అమరావతి అభివృద్ధికి ఏమీ చేసిందని ప్రశ్నించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రైల్వేజోన్ సాధన కోసం జెండాలు, అజెండాలు లేకుండా ఒకే జెండాతో ఉద్యమించాల్సి ఉందన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ మాదిరి ప్రజా పోరాటంగా జోన్ ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని, ముఖ్యమంత్రి రావాలని కోరారు. ఒడిశా నుంచి ఎటువంటి అభ్యంతరం లేదని అక్కడి ఎంపీలు చెప్పారని, అలాగే కేంద్ర రైల్వేశాఖామంత్రి పియాష్‌గోయల్‌కు తాము జోన్, ఇతర సమస్యలపై వినతిపత్రం అందజేశామని చెప్పారు. రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేస్తే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే హెడ్‌క్వార్టర్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. పార్టీ ఉద్యమంలా వెళ్ళకూడదని, ప్రజా పోరాటంలో సాగాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో జరిగిన అన్యాయంపైన ప్రజలు విశ్వసించడంలేదని, అందువల్ల పార్టీలకతీతంగా జోన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు మాట్లాడుతూ రైల్వేజోన్ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు. జోన్ సాధన కోసం ఎటువంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.