ఆంధ్రప్రదేశ్‌

25 ఎంపీ సీట్లూ గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, బీజేపీపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అంత సులభం కాదని, ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగబోతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైషమ్యాలు, ప్రాంతీయ తత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ కర్నాటకలో ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తెరగాలన్నారు. పార్టీ మహానాడులో తొలిరోజైన ఆదివారం జరిగిన ప్రారంభ సభలో బాబు భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడారు. ప్రధాని మోదీ నిస్సిగ్గుగా తనను ఎదిరించే వారిపై కక్షగట్టి సీబీఐ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ దాడులు చేయిస్తూ తను మాత్రం చట్టవిరుద్ధమైన చర్యలకు బరితెగిస్తున్నారని ఆరోపించారు.
కర్నాటకలో తమకు తగిన బలం లేదని తెలిసినా గవర్నర్ వ్యవస్థను అభాసుపాల్జేసి తమ పార్టీ నేతతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారంటే అడ్డగోలుగా కొనుగోలు చేయాలనేకదా వారి ఆలోచన అంటూ మండిపడ్డారు. గతంలో తాము ఓటింగ్ యంత్రాలను ప్రోత్సహించినప్పటికీ నేడు మోదీ అప్రజాస్వామిక విధానాలు చూసి అనుమానించాల్సి వస్తున్నందున వాటిపై దేశవ్యాప్తంగా మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా విభజన జరగాలని తాను కోరితే అడ్డగోలుగా విభజన జరిగిందని, అయినా లోటు బడ్జెట్‌తోనే ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకంటే దీటుగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్నానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తానుపడిన శ్రమతోనే సైబరాబాద్ నగరం ఆవిర్భివించిందని, హైదరాబాద్ ఆదాయం పెరిగిందంటూ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70శాతం హైదరాబాద్ నగరానిదే అని చెప్పారు. తన కష్టంతోనే నేడు తెలంగాణ వాసులు అనుభవిస్తున్నారని, ఇది తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా వృద్ధిరేటు 7.4 శాతం అయితే ఏపీ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నందున హోదా కోసం ఉద్యమించాల్సి వస్తోందన్నారు. అయితే తన సమర్థ నాయకత్వం వల్లనే పరిపాలనా రంగంలో ఏపీ నెంబర్‌గా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో దారిద్య్ర నిర్మూలన కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని, అలాగే అగ్రవర్ణాల్లోని పేదల కష్టాలను తీర్చేందుకు బ్రాహ్మణ, కాపు, వైశ్య కార్పొరేషన్లకు శ్రీకారం చుట్టామన్నారు. తాను అధికారం చేపట్టే సమయంలో విద్యుత్ సంక్షోభం ఉండగా తాను కేవలం మూడు మాసాల్లోనే మిగులు విద్యుత్ సాధించామన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 17వేల 500 కి.మీ మేర సిమెంట్ రోడ్లు వేయటం జరిగిందని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది తన లక్ష్యంగా చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పారిశ్రామిక విప్లవం నెలకొందంటూ తన కృషి వల్ల 16లక్షల కోట్ల రూపాయల విలువైన 2వేల ఎంవోయూలు జరిగాయని, ఇవన్నీ పూర్తయితే 36 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్లవంటివని చంద్రబాబు వివరించారు.