ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలకు ‘గ్రామదర్శిని’తో శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: ఎన్నికలకు ఆట్టే సమయం లేకపోవడంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. ప్రత్యేక హోదాను సాకుగా చూపి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అధికార టీడీపీ ఓపక్క ప్రతిపక్షాల మాటల తూటాలకు బదులిస్తూనే, చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో టీడీపీ గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఒక రకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేల్లో సుమారు 60 మందికి తిరిగి టిక్కెట్‌లు రావంటూ రెండేళ్ల కిందటే పార్టీ అధిష్ఠానం ఫీలర్ వదిలింది. కానీ ఎమ్మెల్యేలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందైనా జనం మధ్యకు వెళ్లకపోతే, పార్టీకి ఇబ్బంది తప్పదని భావించిన చంద్రబాబు రాష్ట్రంలోని కొంతమంది ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి, గ్రామదర్శిని కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం జనవరి వరకూ సాగుతుంది. జనవరిలో నిర్వహించే జన్మభూమి నాటికి ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కారమవ్వాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఈ గ్రామదర్శిని ప్రధాన లక్ష్యం కూడా ఇదే. జనవరి తరువాత ఎలాగూ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. అయితే టీడీపీ ఈ ప్రక్రియను మరో ఆరు నెలల ముందే ప్రారంభించడం గమనార్హం.రాష్ట్రంలోని ప్రతీ టీడీపీ ఎమ్మెల్యే, లేదా నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రతి రోజు ఒక గ్రామాన్ని సందర్శించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించాలి. అలాగే, ఆయా గ్రామాల్లో ప్రజలకు వ్యక్తిగతంగా అందిన లబ్ది గురించి వివరించాలి. గ్రామాలకు వెళ్లినప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షాల గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకే ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించాలి.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పించన్లపై టీడీపీ ప్రభుత్వం సమీక్ష జరిపి, చాలా మందికి పించన్లను తొలగించింది. ఇదేంటని ప్రశ్నిస్తే, వారంతా అనర్హులని ప్రకటించింది. ఆ తరువాత జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, పించన్ల మంజూరు బాధ్యతను వారికి అప్పగించింది. ఇందులో అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా చేసింది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడంతో జన్మభూమి కమిటీల జోక్యాన్ని తగ్గించింది. తాజాగా గృహాల మంజూరులో కూడా టీడీపీ కార్యకర్తలకే పెద్ద పీట వేశారన్న విమర్శలు తలెత్తాయి. అంతేకాదు, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ జనానికి అందడం లేదు. ప్రస్తుతం గ్రామ దర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళుతున్నప్పుడు చాలా మంది ఈ మూడింటిపైనే ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకుల చేతివాటం బయటపడుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తల అతి జోక్యం ప్రభావం ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పడుతోంది.
ఇదిలా ఉండగా గతంలో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజకవర్గ కేంద్రాల్లోనే నివాసం ఉంటున్నారు. జనానికి ఏ కష్టం వచ్చినా, దాన్ని పరిష్కరించేందుకు ఇట్టే వాలిపోతున్నారు.
అయితే, పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే తీరువలన పార్టీకి నష్టం వచ్చే నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగుండి, పార్టీకి అక్కడ ఇబ్బంది ఉంటే, ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రార్టీ కార్యాలయం ద్వారా సదరు ఎమ్మెల్యేకు సూచనలు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. అప్పటికీ, నియోజకవర్గంలో పరిస్థితి మెరుగుపడకపోతే, ప్రత్యామ్నాయ అభ్యర్థి గురించి పార్టీ ఆలోచన చేసుకునేందుకు ఈ గ్రామ దర్శిని ఉపయోగపడుతుందని పార్టీలోని ఓ సీనియర్ నాయకుడు చెపుతున్నారు. ఈ గ్రామ దర్శిని కార్యక్రమంపై ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందాయి. అప్పటికీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగులేదంటే అది ఎమ్మెల్యే తీరే కారణమవుతుంది తప్ప, పార్టీ, ప్రభుత్వం కాదని’ అన్నారు.