రాష్ట్రీయం

కుదుటపడిన గోదారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 26: ఉప్పొంగే గోదావరి ఉప్పు జలాల పాలవుతోంది. ఏటికేడాది లక్షలాది క్యూసెక్కుల జలాలు వృథాగా సముద్రం దారిపడుతున్నాయి. రబీలో జలాల కోసం వెంపర్లాడే పరిస్థితిని బట్టి వరద జలాలను దాచుకోడానికి లేదు. ఎందుకంటే కాటన్ బ్యారేజి వద్ద ఎఫ్‌ఆర్‌ఎల్ సామర్ధ్యం 3.18 టీఎంసీలు మాత్రమే. ఆపై వచ్చే జలాలన్నీ సముద్రం పాలవ్వాల్సిందే.
కాటన్ బ్యారేజీ నుంచి ఈ ఏడాది జూలై మాసంలో రోజూ లక్షలాది క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. గత ఏడాది జూన్, జూలై మాసాల్లో 297 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోయాయి. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీనుంచి ఇప్పటివరకు 491 టీఎంసీల జలాలు సముద్రం పాలయ్యాయి. అంటే ఈ నీటితో దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు.
గత ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 105 టీఎంసీలు తోడారు. ఈ ఏడాది ఇప్పటివరకు 19.48 టీఎంసీలు తోడారు. 24 పంపులతో రోజుకు 8500 క్యూసెక్కుల జలాలను తోడుతున్నారు. ప్రస్తుతం గోదావరి వరద ఉద్ధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గురువారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.30 అడుగుల నీటి మట్టం నమోదైంది. 13.81 మీటర్ల రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని పెట్టి బ్యారేజి మొత్తం 175 గేట్లను 0.3 మీటర్లు, 0.4 మీటర్ల మేరకు ఎత్తివేసి వరద జలాలను దిగువకు విడిచి పెడుతున్నారు. ఒక లక్షా 75 వేల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. అదే విధంగా బ్యారేజి నుంచి మూడు డెల్టాలకు నీటి విడుదలను పెంపుదల చేశారు. తూర్పు డెల్టాకు 4500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 2400 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7000 క్యూసెక్కుల చొప్పున నీటిని కాల్వలకు సాగునీటి నిమిత్తం విడుదల చేశారు.
భద్రాచలం వద్ద కూడా నీటి మట్టం బాగా తగ్గింది. 12.50 అడుగుల మట్టంలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో ప్రవాహ ఉద్ధృతి బాగా తగ్గింది. కాళేశ్వరం వద్ద 5.02, పేరూరు 6.37, దుమ్ముగూడెం 7.30, కూనవరం 7.95, కుంట 5.24, కొయిదా 10.22, పోలవరం 7.26, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 13.76 మీటర్ల నీటి మట్టం నమోదైంది.
ఎంత నీరు వచ్చినా దిగువ ప్రాంతానికి బ్యారేజి నుంచి విడుదల చేయాల్సిందే. ఇక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. దీంతో లక్షలాది క్యూసెక్కులు ఏటికేడాది సముద్రంలోకి ఉరకలేస్తున్నాయి. అయితే గత రెండేళ్లుగా గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో కూడా వరదలు రాలేదు. అయినప్పటికీ లక్షలాది క్యూసెక్కులు సముద్రంలోకి పోతున్నాయి. ఇక వరదలు వస్తే ఊహించలేనంత భారీగా సముద్రంలోకి విడిచి పెడతారు. వరద జలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రమాద స్థాయికి చేరుకుంటే బ్యారేజి గేట్లను పూర్తిగా అంటే మూడున్నర మీటర్లు ఎత్తివేసి దిగువకు వదులుతారు. ఈ ఏడాది రెండున్నర మీటర్ల వరకు ఎత్తివేసి దిగువకు విడిచి పెట్టే పరిస్థితి వచ్చింది. గత ఏడాది గేట్లు ఆల్ క్లియర్ అంటే గేట్లను తాకకుండా వరద ప్రవాహం సాగే స్థితి, అటువంటి స్థితి ఈ ఏడాది ఒకసారే వచ్చింది. బ్యారేజి వద్ద 11.75 అడుగులు నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక, 13.75 అడుగులు నమోదైతే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగుల స్థాయికి చేరితే ప్రమాద స్థాయికి చేరినట్టుగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ వరద గోదావరి ప్రస్తుతం కుదుట పడింది.
చిత్రం..ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుండి సముద్రంలోకి విడుదలవుతున్న వరద జలాలు