ఆంధ్రప్రదేశ్‌

విమానాశ్రయంలో ఎమ్మెల్యే హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 26: మీరెంత.. మీ ఉద్యోగాలెంత... ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా... మీ కథ చూస్తా... అంటూ చిత్తూరు జిల్లా జేసీ గిరీషా, రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడుపై నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చిందులేసిన సంఘటన గురువారం సాయంత్రం 5.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులపై బూతు పురాణం విప్పడం చూసి విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులు, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిలకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారు నిర్ఘాంత పోయారు. ఎమ్మెల్యే పత్రికల్లో రాయలేని అశ్లీల పదాలతో అధికారులను దూషించడంపై రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది.
శ్రీవారి దర్శనార్థం మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తమ కుటుంబ సభ్యులతో గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి స్వాగతం పలకడానికి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామరావు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానం దిగిన దేవేగౌడ తాను విమానాశ్రయంలోకి నడిచి రాలేనని చెప్పడంతో జేసీ గిరీషా ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును రన్‌వేపైకి తీసుకు వచ్చారు. అక్కడ కారెక్కిన దేవేగౌడ అత్యవసర ద్వారం గుండా వెలుపలికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చి ప్రయాణికులు వెలుపలికి వచ్చే ద్వారం వద్ద ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వేచి ఉండటాన్ని చూసిన అధికారులు విమానాశ్రయం వెలుపల దేవేగౌడ ఉన్నారని సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బొల్లినేని చిత్తూరు జిల్లా జేసీని పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషించారు. మీరెంత.. మీ ఉద్యోగాలెంతా అంటూ కఠినంగా మాట్లాడారు. తాను స్వాగతం పలకడానికి వచ్చినప్పుడు తనకు ముందస్తు సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నా జేసీ గిరీషా, తహశీల్దార్ నరసింహులు నాయుడు సంయమనంతో వ్యవహరించి ఆయన్ను దేవేగౌడ, కుమార స్వామిల వద్దకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా పొరపాటు జరిగిందని, తప్పుగా భావించవద్దని మాజీ ప్రధాని కోరిక మేరకు ఆయన్ను ఇలా తీసుకురావాల్సి వచ్చిందని ఎమ్మెల్యే బొల్లినేనికి జేసీ వివరించారు. అయినా కూడా ఆయన శాంతించకుండా మాజీ ప్రధాని దేవేగౌడ సమక్షంలోనే మరోమారు పరుష వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో సీఎం కుమార స్వామి కూడా జోక్యం చేసుకుని ఆయన్ను శాంతింప జేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
అదే సమయంలో తమ అధికారి పట్ల పరుషంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడు పొరబాటు జరిగింది సార్.. అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాస్కెల్.. నువ్వెవరు.. నీ బతుకెంత.. నీ ఉద్యోగ మెంత.. ముఖ్యమంత్రితో చెప్పి మీ కథ చూస్తానంటూ హెచ్చరికలు చేశారు.
దీంతో అందరూ అవాక్కయ్యారు. అటు తరువాత మాజీ ప్రధాని దేవేగౌడ, సీఎం కుమార స్వామి ప్రవేశ ద్వారం నుంచి కుటుంబ సభ్యులు రాగానే వారితో కలిసి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. బొల్లినేని నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. ఇదిలావుండగా రెవిన్యూ ఉన్నతాధికారుల పట్ల ఎమ్మెల్యే అనుసరించిన తీరును రెవిన్యూ సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. ఈవిషయాన్ని ఇంతటితో వదలకపోతే రేణిగుంట విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి తాము కూడా సీఎం వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరిస్తామని స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యే ఐఎఎస్ అధికారిని పరుష పదజాలం ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.