ఆంధ్రప్రదేశ్‌

ఆత్మరక్షణ, కొత్త ఎత్తుగడలకు మావోల వ్యూహరచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 26: వరుస ఎన్‌కౌంటర్లతో నేతలు, కేడర్‌ను కోల్పోతున్న మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పడ్డట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కేడర్ పునరుద్ధరణ, సైద్ధాంతిక విశే్లషణ, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయటంతో పాటు మిలిటెంట్ పోరాటాలను తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్‌పై యుద్ధంలో గ్రీన్‌హంట్ ఆపరేషన్‌తో పాటు మిషన్ 2016, 17, 18 అమలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా అనేక మంది ముఖ్య నాయకులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. గడచిన ఏడాదిలోనే దండకారణ్య ప్రాంతంలో 200 మంది, బీహార్-జార్ఖండ్ ప్రాంతంలో 40మంది, ఆంధ్ర-ఒడిషా సరిహద్దు ప్రాంతమైన ఏఓబీలో 45మంది, ఒడిశా రాష్ట్రంలో 10మంది, తెలంగాణలో 10మంది, పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు మరణించారు. వీరిలో 50మంది వరకు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోగా విప్లవోద్యమాన్ని అంతమొందించే వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోదీ సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ శక్తుల ప్రోద్బలంతో అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. తమ ఉద్యమాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక దృక్కోణంతో పరిగణించకుండా దేశద్రోహుల తరహాలో కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ సెంట్రల్ జోన్ కేడర్‌కు దిశానిర్దేశం చేసింది. ముందుగా ప్రజలతో మమేకమై ప్రజా, రైతాంగ, మహిళా సమస్యలపై ఉద్యమ పంథాను అనుసరించేలా చైతన్యం తేవాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు నెలలుగా షెల్టర్ జోన్‌కు పరిమితమైన ముఖ్య నేతలంతా ఏఓబీ, చత్తీస్‌గఢ్, దండకారణ్య ప్రాంతాలకు తరలివెళ్లినట్లు చెపుతున్నారు. ఈ నెల 28న నక్సల్బరీ ఉద్యమ ఆద్యుడు చారుమజుందార్ వర్ధంతి సందర్భంగా అమరవీరుల వారోత్సవాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. గత ఏడాది చివరిలో దండకారణ్యం, ఏఓబీ, తదితర ప్రాంతాల్లో ప్లీనరీ సమావేశాలతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వ్యవస్థాపక వారోత్సవాలను పోలీసుల నిర్బంధం మధ్య విజయవంతంగా పూర్తి చేసుకోగలిగామని కేంద్ర కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈసారి మరింత కట్టుదిట్టంగా అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అణచివేత చర్యల్లో భాగంగా కేంద్రం వివిధ రకాల సాంకేతిక, సమాచార వ్యవస్థలను వినియోగిస్తోందని, దీన్ని తలదనే్న రీతిలో ఉద్యమ కార్యాచరణ ఉండాలని కేడర్‌కు సూచనలిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా నాలుగేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న గుత్తపెట్టుబడిదారీ విధానాల వల్ల పారిశ్రామిక రంగం కునారిల్లుతోందని, నిరుద్యోగ సమస్య పెరిగిందని, నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయని, గిట్టుబాటు, మద్దతు ధరలేక వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని, మహిళలకు రక్షణ కరవైందనే అంశాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రజల్లో అధిక శాతం మంది అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మోదీకి తగిన గుణపాఠం చెప్పేలా జాగృతం చేయాలనేది పార్టీ లక్ష్యంగా తెలియవచ్చింది. మరోవైపు సైనిక బలగాలను ఎదుర్కొనేందుకు గెరిల్లా నియమాలు పాటిస్తూ ఆయుధాల స్వాధీనం, రహస్యం, వేగం, దృఢ సంకల్పం, స్థలమార్పిడి, ఆత్మరక్షణ, దాడులు, ఎత్తుగడలు, మెలకువలపై కేడర్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
మావోయిస్టుల ఉద్యమ అణచివేతకు జరుగుతున్న కుట్రలను ఎండగట్టేలా ఉద్యమపంథాలో మార్పులు, చేర్పులు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు భోగట్టా. సైనిక బలగాలకు సమాచారం అందిస్తున్నదెవరు? ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను రూపుమాపటం ఎలా? కొత్త కేడర్ రిక్రూట్‌మెంట్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థి, ఉద్యోగ, రైతాంగ, మహిళా ఉద్యమాలతో మమేకం కావటం ద్వారా ఉద్యమానికి ఊపిరిలూదే లక్ష్యంతో మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.