ఆంధ్రప్రదేశ్‌

భయం గుప్పిట్లో పశ్చిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 20: ఏకథాటిగా రోజుల తరబడి కురుస్తున్న భారీవర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా నీటమునిగిన రహదారులు, మోకాలి నీటిలో మునిగిపోయిన పంటపొలాలే దర్శనమిస్తున్నాయి. దీనికితోడు పశ్చిమ ఏజన్సీలో పరిస్థితి మరింత భయానకంగా మారుతూ వస్తోంది. ప్రధానంగా గోదావరి ఉద్ధృతి ఇటీవలకాలంలో ఏనాడు లేనిరీతిలో పెరిగిపోవటంతో పెద్దసమస్యగా మారిపోయింది. పోలవరం, వేలేరుపాడు, కుకునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి తదితర మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి రెండురోజులుగా కొనసాగుతోంది. ఆదివారంనాటికి గోదావరి వరద ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టినట్లు కన్పించినా సోమవారంనాటికి పరిస్థితి యధాపూర్వక స్థితికి చేరుకుంది. మధ్యాహ్న సమయానికి మళ్లీ వరద ఉద్ధృతి పరుగులు తీయటంతో పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీటికితోడు జల్లేరు, బైనేరు వంటి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఎర్రకాలువలో వచ్చి చేరటంతో ఇప్పుడు అందరి దృష్టి ఎర్రకాల్వ తీరుపైనే కేంద్రీకృతమైంది. దాదాపుగా జిల్లాకు ఎర్రకాల్వను దు:ఖదాయినిగా భావిస్తున్న తరుణంలో మరోసారి ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చటంతో పరిసర ప్రాంత మండలాల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుచోట్ల ఎర్రకాలువ వరద తన ప్రభావాన్ని చూపిస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటితోపాటు గుండేరు, తమ్మిలేరు కూడా పొంగిపొర్లుతూ జిల్లా కేంద్రమైన ఏలూరు, దెందులూరు, పెదపాడు, పరిసర మండలాల్లో ఆందోళనకు కారణమవుతోంది. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు రిజర్వాయర్‌కు భారీమొత్తంలో వరదనీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ ఇన్‌ఫ్లో 15600 క్యూసెక్కులు ఉండగా ఆవుట్‌ఫ్లో 7800 క్యూసెక్కుల వరకు ఉంది. అయితే ఇది మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. గణపవరం మండలం పిప్పర వద్ద యనమదుర్రు డ్రైన్ ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడ రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఫలితంగా 12 గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తున్నారు. నక్కల డ్రెయిన్ పొంగి ప్రవహిస్తుండటంతో ఆచంట మండలం ఆచంట వేమవరం, పోడూరు మండలం వద్దిపర్రు, కాంభోట్లపాలెంలో 1200 ఎకరాల్లో పంట నీటమునిగింది. జంగారెడ్డిగూడెంలో పురాతన వంతెన కూలిపోవటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జల్లేరు ఉధృతికి మాచన్నగూడెం వద్ద వంతెనకు 30 అడుగుల గండి పడింది. పట్టెన్నపాలెం వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ కరకట్ట బీటలు వారటంతో పరిస్థితిని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, ఎస్పీ రవిప్రకాష్‌లు పరిశీలించారు. అవసరమైతే 5,6 గ్రామాల ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వేలేరుపాడు మండలం భూదేవిపేట-వసంతవాడ మధ్య కోళ్లఫారం, పాడిపరిశ్రమలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. ఇక్కడ వరదనీటి దిగ్బంధంలో చిక్కుకున్న యజమానులు సత్యంబాబు, వెంకటేశ్వర్లను సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక బోటులో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఎర్రకాలువ గ్రామంలోకి ప్రవేశించింది. వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించటంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏలూరులోని వైఎస్సార్ కాలనీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరటంతో రాత్రికి రాత్రే కాలనీని అధికారులు ఖాళీ చేయించారు. బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. జంగారెడ్డిగూడెం వద్ద తాడువాయి వద్ద రహదారికి గండి పడటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి, నల్లజర్ల, ఏలూరు మీదుగా మళ్లించారు. ఏలూరు మండలం శ్రీపర్రు కాజ్‌వేపై తమ్మిలేరు వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కైకలూరు-ఏలూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిడదవోలు మండలం కంసాలిపాలెం, తాడేపల్లిగూడెం మండలం మాధవరంల వద్ద రోడ్డుపై రెండు అడుగుల ఎత్తులో ఎర్రకాల్వ ప్రవహిస్తోంది. తాళ్లపాలెం, నందమూరు, సత్యవాడ, పసలపూడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లిగూడెం మండలంలో ఉధృతంగా ఎర్రకాల్వ ప్రవహిస్తుండటంతో మాధవవరం-నిడదవోలు మధ్య ఉన్న కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. ఇదిఇలాఉండగా సోమవారం పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో ఉదయం నుంచి జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌లు జిల్లాలోని పలుప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్ధితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి బాధితులను అక్కడకు తరలించి అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు. అన్నిచోట్ల రోడ్లు చిధ్రం కావటంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
గోదావరిలో నాటుపడవ బోల్తా
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ గురజాపులంక మొండి గోదావరిలో సోమవారం పడవ బోల్తా పడిన సంఘటనలో ఒక వ్యక్తి గల్లంతవ్వగా, మరో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబందించి స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి. లంక గ్రామమైన లంకాఫ్ ఠాణేలంక పంచాయతీ కూనాలంకకు చెందిన వారికి కమిని పంచాయతీ గురజాపులంక మొండిలో పెరుగులంక భూములు ఉన్నాయి. అక్కడ వారు కూరపాదులను పండించుకుంటూ పశువులను కూడా మేపుకుంటారు. దీంతో సోమవారం ఉదయానే్న గురజాపులంకకు చెందిన 15 మంది రైతులు నాటుపడవపై కమిని పంచాయతీ గురజాపులంక మొండిరేవు నుండి పెరుగులంకకు వెళ్లి పశువుల పాలను సేకరించుకుని తిరిగి ఒడ్డుకు చేరుకుంటుండగా గోదావరి వరద ఉద్ధృతికి పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న నల్లా బుచ్చిమహేశ్వరరావు (25) గల్లంతయ్యాడు. మిగిలిన వారంతా చెట్ల కొమ్మలను పట్టుకుని మృత్యుంజయులుగా ఒడ్డుకు చేరుకోవడంతో మరో ఘోర ప్రమాదం తప్పినట్టయ్యింది. గత నెల జూలై 14న పశులవుల్లంక మొండిరేవులో పడవ తిరగబడిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. గల్లంతైన బుచ్చిమహేశ్వరరావుకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం అతని భార్య భారతి ఎనిమిదవ నెల గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరును చూపరుల హృదయాలను కలచివేస్తోంది.
గురజాపులంకలో పడవ బోల్తా పడిన సంఘటనలో 14 మంది మృత్యుంజయులుగా బయటపడ్డారు. వారిలో కొప్పిశెట్టి వీరబాబు, పొద్దొకు ప్రతాపరెడ్డి, కన్నీడి సూర్య ప్రకాష్, వడ్డి సత్యనారాయణ, నీతిపూడి సతీష్, నల్లా రాజారావు, గొలుసు నాగేశ్వరరావు, గొలుసు వెంకటేశ్వరరావు, కర్రి పోతురాజు, కుప్పాల శ్రీనివాస్, కన్నీడి రాజులతో పాటు మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పడవ ప్రమాదం వార్త తెలియగానే అమలాపురం ఆర్డీవో బి వెంకటరమణ, డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, ముమ్మిడివరం సీఐ కేటీటీవీ రమణారావు, తహసీల్దార్ ఎం వీర్రాజులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.