ఆంధ్రప్రదేశ్‌

వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 4: ముఖ్యమంత్రి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు బయలుదేరిన సీపీఐ, సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారితోపాటు జర్నలిస్టులను సైతం నారావారిపల్లెలోకి వెళ్లకుండా కిలోమీటరు దూరంలోని రంగంపేట క్రాస్ వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. పోలీసులు భారీగా మోహరించారు. దీంతో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నారావారిపల్లెలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించకుండానే వెనుతిరిగారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించే లక్ష్యంతో వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. అక్కడ నుంచి పీలేరుకు బయలుదేరిన యాత్ర మార్గమధ్యంలో నారావారిపల్లెలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని నిర్ణయించారు. బస్సుయాత్ర రంగంపేట క్రాస్ వద్దకు చేరుకునేసరికే నారావారిపల్లెకు వెళ్లేందుకు వీల్లేదంటూ రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. దీంతో సీపీఐ, సీపీఎం నేతలు వారితో వాగ్వివాదానికి దిగారు. బారికేడ్లను తొలగించి తమ వాహనాలను అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే వారి వాహనాలనే కాకుండా వామపక్ష నేతలను కూడా బారికేడ్లు దాటి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు అక్కడే రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించి ధర్నా చేశారు. చివరకు ఐదుగురు వామపక్ష నేతలను మాత్రమే నారావారి పల్లెకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే వారి వెంట జర్నలిస్టులు వెళ్లేందుకు అనుమతించలేదు. దీనికి నిరసనగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తమతోపాటు జర్నలిస్టులను అనుమతించకపోతే తాము కూడా సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేది లేదంటూ వామపక్ష నేతలు స్పష్టం చేసి అక్కడ నుంచి వెనుతిరిగారు. ఈసందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం స్వగ్రామంలో రూ. 8కోట్లతో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్‌లో డాకర్లు లేరని, వైద్య పరికరాలు అందుబాటులో లేవని, దీంతో ఒకరిద్దరు రోగులు కూడా రావడం లేదన్నారు. ఈ బండారమంతా బయటపడుతుందనే తమను పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. సిఎం స్వగ్రామంలో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తమవంటి వారిని ఆహ్వానించి గ్రామాన్ని చూపించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అనంతపురంలో మొదలైన బస్సు యాత్రలో భాగంగా చేనేత కార్మికులు, ఉల్లి రైతుల సమస్యలను పరిశీలిస్తూ వస్తున్నామన్నారు. ప్రజాసమస్యలపై సీఎంకు లేఖలు కూడా రాస్తున్నామన్నారు. తిరుపతి నుంచి పీలేరుకు వెళుతూ నారావారిపల్లెలోని హెల్త్‌సెంటర్‌ను చూద్దామనుకుంటే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. హెల్త్ సెంటర్‌ను చూడటమే నేరమా అని ప్రశ్నించారు. అధికార పక్షం ఎందుకు అంతగా భయపడుతోందన్నారు. పోలీసులతో ఎంతకాలం నెట్టుకొస్తారో చూస్తామన్నారు. ఈనెల 15వ తేదీన విజయవాడ మహాగర్జన సభ తరువాత మళ్లీ నారావారిపల్లెకు వస్తామని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం..పోలీసులతో వామపక్ష నేతల వాగ్వాదం